పడకేసిన నాడు-నేడు
ABN, Publish Date - May 27 , 2024 | 12:20 AM
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు రెండోదశ పనులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.
పనులు కొనసాగించేందుకు అన్నీ అవాంతరాలే...
సిమెంట్ ఉన్న పాఠశాలల ఖాతాల్లో పైసల్లేవ్
నిధులున్న చోట సిమెంట్‌కు కరవు
పెయింటింగ్స్ వేసేందుకు కాంట్రాక్టరు వెనకడుగు
ఇసుక రవాణాకు పోలీసుల అడ్డంకులు
అందని ఆర్వో ప్లాంట్లు, గ్రీన్ చాక్ బోర్డులు
పనుల పర్యవేక్షణకు మండలానికో అధికారి
విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు రెండోదశ పనులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన రెండోదశ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పనులు చేపట్టేందుకు సిమెంట్ ఉన్న పాఠశాలల్లో నిధుల కొరత పీడిస్తుండగా, నిధులున్న చోట సిమెంట్‌కు కరవు ఏర్పడింది. పైగా ఇసుక సరఫరాకు పోలీసులు అనుమతించకపోవడంతో ఎక్కడి పనులక్కడే నిలిచిపోయాయి. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులతో ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటుండగా.. ఉన్నతాఽధికారులు మాత్రం ఒంటికాలుపై లేస్తున్నారు.
జిల్లాలో రెండోదశ నాడు -నేడులో భాగంగా 309 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు 2021-22లో రూ.11,481.77 లక్షలతో పనులు ప్రతిపాదించారు. ఎంపికచేసిన పాఠశాలల్లో 522 అదనపు గదులు, ప్రహరీలు, ఇతర వసతుల కల్పనకు నిర్ణయించారు. అయితే పనులు పూర్తిచేసేందుకు ఆది నుంచీ నిధుల కొరత వెంటాడుతోంది. జిల్లాలోని పలు పాఠశాలలకు సిమెంట్ సరఫరా చేయగా, మరికొన్ని పాఠశాలలకు ఆయా తల్లిదండ్రుల కమిటీలే కొనుగోలు చేశాయి. గత ఏడాది నిధుల విడుదలలో తీవ్ర జాప్యంతో పనులు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు మాత్రం ప్రతివారం సమీక్షలు నిర్వహించి పనుల పురోగతిపై నిలదీస్తున్నారు. అయితే గత విద్యా సంవత్సరం చివరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పనులు ఆగిపోయాయి. పోలింగ్ ముగిసిన వెంటనే వీటిపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో పనుల జాప్యంపై జిల్లాలో విద్యాశాఖ అధికారులు, ఇతర అఽధికారుల నుంచి వివరణ కోరుతూ మెమో జారీచేశారు. అంతేకాక స్వల్పంగా నిధులు మంజూరు చేశారు.
నిధులు లేవు.. సిమెంటూ లేదు...
ఎన్నికల వేళ విడుదలచేసిన నిధుల నుంచి పనులు చేపడదామని భావించిన పాఠశాలల హెచ్‌ఎంలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని పాఠశాలల అభివృద్ధి కమిటీ ఖాతాల్లో నిల్వలున్నప్పటికీ, సిమెంటులేదు. సిమెంట్ ఉన్న చోట నిధులు లేవు. డబ్బులున్న పాఠశాలల కమిటీలు సిమెంట్ కొనుగోలుకు నిర్ణయించినప్పటికీ బస్తాకు రూ.280 మించి వెచ్చించకూడదని అధికారులు నిర్దేశించారు. అయితే బహిరంగ మార్కెట్‌లో సిమెంట్ బస్తా ధర రూ.330 వరకు ఉంది. దీంతో సిమెంట్ కొనుగోలు చేయలేకపోతున్నామని హెచ్‌ఎంలు వ్యాఖ్యానిస్తున్నారు. డబ్బులు లేని పాఠశాలల వద్ద ఉన్న సిమెంట్ తీసుకుని, పనులు చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తుండగా ఇసుక కొరత వెంటాడుతోంది. ఇప్పటివరకు డిపోల నుంచి ఇసుక సరఫరా చేసేవారు. మూడునెలల కిందట డిపోల నిర్వహణ ఏజెన్సీ మారడంతో సరఫరా నిలిచిపోయింది. బయట ఇసుక కొనుగోలుకు పోలీసులు అనుమతి ఇవ్వడంలేదని పలువురు హెచ్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాఠశాలలకు ఇసుక సరఫరా బాధ్యతను ప్రైవేటు వాహనాల ఆపరేటర్లకు అప్పగిస్తున్నారు.
నిలిచిన పెయింటింగ్స్ పనులు
ఇదిలావుండగా ఇప్పటి వరకు కేవలం 30 పాఠశాలలకే పెయింటింగ్స్‌వేసిన కాంట్రాక్టరు, బిల్లుల మంజూరుచేయడంలేదని వెనుకంజవేశారు. ప్రభుత్వం మారితో బిల్లుల మంజూరులో ప్రతిష్ఠంభన నెలకొంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు ప్రతి పాఠశాలకు గ్రీన్‌చాక్‌బోర్డుల సరఫరాలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు. ఇప్పటివరకు కేవలం 41 పాఠశాలలకే ఈ బోర్డులు వచ్చాయి. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు ఇంకా ప్రారంభం కాలేదు. వేసవి సెలవుల్లో పనులు చేస్తున్న పాఠశాలల్లో సంబంధిత హెచ్‌ఎంలపై కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. తాము చెప్పినట్టుగానే వ్యవహరించాలని ఒత్తిడి తెస్తున్నాయి.
హెచ్‌ఎంలకు బెదిరింపులు
పాఠశాలల పని దినాల్లో టీచర్లంతా ఉండడంతో కమిటీలు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. అదే వేసవి సెలవుల్లో హెచ్‌ఎం ఒక్కరే ఉండడంతో బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ కమిటీ ఒత్తిళ్ల మేర పనులు కొనసాగించడానికి అంగీకరిస్తే, తరువాత ఖర్చుచేసిన ప్రతి పైసాకు తామే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండోదశ పనుల్లో సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ మెటీరియల్ అంటే సిమెంట్, ఇసుక, పెయింటింగ్స్, గ్రీన్‌చాక్ బోర్డులు, ఆర్వో ప్లాంట్లు, ఎలక్ట్రికల్ మెటీరియల్ సరఫరాకు కొంత మొత్తం కేటాయించారు. నిర్మాణాల కోసం రూ.4760.53 లక్షలు నిధులు విడుదలచేయగా ఇంత వరకు రూ.3976.80 లక్షలు ఖర్చుచేశారు. ఇందులో 83.54 శాతం పనులు చేశామని అధికారులు చెబుతున్నారు. నిర్మాణల కోసం మరో రూ.15కోట్ల వరకు విడుదల కావాల్సి ఉందని చెబుతున్నారు. నిధుల కొరతతో పలుచోట్ల పనులు నిలిచిపోవడంతో పాఠశాలల ఆవరణ చిందరవందరగా మారింది. రెండు మూడు వారాల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటిలోగా పనులు పూర్తిచేయడం సాధ్యంకాదని హెచ్‌ఎంలు చెబుతున్నారు. పనులు మధ్యలో ఉండడంతో జూన్ 12న పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - May 27 , 2024 | 12:20 AM