మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి
ABN, Publish Date - May 26 , 2024 | 12:56 AM
మావోయిస్టులు కాలం చెల్లించిన సిద్ధాంతాలు, హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్‌పీ తుహిన్‌సిన్హా పిలుపునిచ్చారు. జిల్లాలో సీలేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ స్వాధీనం చేసుకున్న సందర్భంగా శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎస్‌పీ తుహిన్‌సిన్హా పిలుపు
పాడేరు, మే 25(ఆంధ్రజ్యోతి): మావోయిస్టులు కాలం చెల్లించిన సిద్ధాంతాలు, హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్‌పీ తుహిన్‌సిన్హా పిలుపునిచ్చారు. జిల్లాలో సీలేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ స్వాధీనం చేసుకున్న సందర్భంగా శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో అధిక సంఖ్యలో మావోయిస్టులు, వారి సానుభూతిపరులు జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం అందించిన పునరావాస ప్రోత్సాహాన్ని పొందారన్నారు. అరకొరగా ఎవరైనా మావోయిస్టులు ఉంటే స్వచ్ఛందంగా తమ వద్దకు వచ్చి లొంగిపోవాలని, లేని పక్షంలో తమకు అందుబాటులో ఉన్న గ్రామపెద్దలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా తమను సంప్రతించి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు. మావోయిస్టు పార్టీలో ఉంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం నేరమని, అలాగే ప్రజల నుంచి సైతం మావోయిస్టులకు ఎటువంటి సహకారం అందడం లేదన్నారు. కాగా సీలేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పనసలబందలో మావోయిస్టుల డంప్ స్వాఽధీనం చేసుకున్న ఘటనలో సీలేరు ఎస్‌ఐ రామకృష్ణ, చింతపల్లి ఆర్‌ఎస్‌ఐ జాన్‌రోహిత్, జి.మాడుగుల ఎస్‌ఐ శ్రీనివాసరావులను ఎస్‌పీ తుహిన్‌సిన్హా, చింతపల్లి ఏఎస్‌పీ ప్రతాప్ శివకిశోర్ అభినందించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చక్కని ఓటింగ్
జిల్లాలో మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ సైతం ఈ ఎన్నికల్లో ఓటింగ్ చక్కగా జరిగిందని ఎస్‌పీ తుహిన్‌సిన్హా అన్నారు. చింతపల్లి, పెదబయలు, జీకేవీధి ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు అధిక సంఖ్యలో గిరిజన ఓటర్లు తరలివచ్చి తమ ఓటును వినియోగించుకున్నారన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు అర్థం చేసుకోవాలని, గిరిజన ప్రజలు ప్రజాస్వామ్యానికే మొగ్గు చూపుతున్నారని ఎస్‌పీ పేర్కొన్నారు. ఎక్కడా మావోయిస్టులకు భయపడి ఎన్నికలకు దూరం కాలేదన్నారు. జిల్లాలో ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ సైతం సజావుగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో 4,500 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని, కౌంటింగ్‌కు సంబంధించి అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు పలు సూచనలు చేశామన్నారు. కౌంటింగ్ రోజున ర్యాలీలు, విజయోత్సవ కార్యక్రమాలకు అనుమతులు లేవని ఎస్‌పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఏఎస్‌పీ ప్రతాప్ శివకిశోర్, డీసీఆర్‌బీ సీఐ హిమగిరి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2024 | 12:56 AM