ఈపీడీసీఎల్‌లో ఇంటి దొంగలపై విచారణ
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:43 AM
రెండేళ్ల క్రితం ఈపీడీసీఎల్ జోన్-3 (మధురవాడ) ఈఈ కార్యాలయంలో జరిగిన రూ.29 లక్షల ఈపీఎఫ్ నిధుల గోల్‌మాల్‌పై యంత్రాంగం కదిలింది.
నివేదిక కోరిన కలెక్టర్
మరోవైపు పీఎం పాలెం స్టేషన్‌కు విజిలెన్స్
విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):
రెండేళ్ల క్రితం ఈపీడీసీఎల్ జోన్-3 (మధురవాడ) ఈఈ కార్యాలయంలో జరిగిన రూ.29 లక్షల ఈపీఎఫ్ నిధుల గోల్‌మాల్‌పై యంత్రాంగం కదిలింది. ఈ నిధులు ప్రభుత్వ ఖాతా నుంచి అటెండర్ వ్యక్తిగత ఖాతాకు మళ్లించాల్సిందిగా లేఖలు రాసిన అధికారిని విడిచిపెట్టి కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు చేపట్టారని, పోలీసులకు కూడా సరైన సమాచారం ఇవ్వలేదని ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం వెలుగులోకి తేవడంతో అధికారులు దీనిపై పునర్విచారణ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ హరీంధిర ప్రసాద్, ఈ అంశంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని విశాఖ సర్కిల్ ఎస్‌ఈ మహేంద్రనాథ్‌ను ఆదేశించారు. మరోవైపు పీఎం పాలెం పోలీసులు ఈ కేసును ఎలా విచారించారు?, ఏ నివేదిక తయారుచేశారో తెలుసుకోవడానికి విజిలెన్స్ అధికారులు అక్కడకు వెళ్లారు. అయితే కార్పొరేట్ కార్యాలయం మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. ఇదిలావుంటే ఈ కుంభకోణం అనంతరం ఆ జోన్ నుంచి వేరే జోన్‌కు మారిన సదరు అధికారి బ్యాంకుకు రాసిన లేఖలపై సంతకం తనది కాదని, ఫోర్జరీ చేశారని చెబుతున్నట్టు తెలిసింది. ఇక్కడ విషయం ఏమిటంటే...ఆ నిధులు అటెండర్ ఖాతాకు మళ్లించాలని ఈఈ లేఖ రాసినట్టు దర్యాప్తు చేసిన పోలీసులకే తెలియదు. నిజంగా ఆ లేఖలో సంతకాలు ఫోర్జరీవి అయితే ఆయన అప్పుడే పోలీసులకు చెప్పి, అందులో నిజాలు నిగ్గు తేల్చమని అడగాల్సింది. కానీ అప్పుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సరైన వివరాలే ఇవ్వలేదు. అసలు ప్రభుత్వ ఖాతా నుంచి వ్యక్తిగత ఖాతాకు దఫదఫాలుగా లక్షలాది రూపాయల నిధులు వెళుతుంటే అప్పుడు అక్కడ ఈఈగా పనిచేసిన అధికారి ఏమి చేసినట్టు?...ఈ వ్యవహారంపై లోతుగా విచారిస్తే అసలు నిధుల మళ్లింపు ఆలోచన ఎవరిది?, ఆ డబ్బుతో ఏమి చేయాలనుకున్నారో తేలుతుంది.
Updated Date - Jul 31 , 2024 | 12:43 AM