చోడవరం, మాడుగుల ప్రాంతంలో పారిశ్రామిక క్లస్టర్
ABN, Publish Date - Jul 21 , 2024 | 01:13 AM
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువత, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో చోడవరం, మాడుగుల పరిసరాల్లో పారిశ్రామిక క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించారు. ఇందు కోసం ఐదు వేల ఎకరాలను సేకరించనున్నట్టు చెప్పారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ విషయంలో త్వరలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం శాక మంత్రి అనిత, ఎమ్మెల్యేలతో చర్చిస్తామన్నారు.
5 వేల ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు
ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు
బీపీసీఎల్ పెట్రో కెమికల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నా..
ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్లు
యువతకు ఉపాధి కల్పనకు కట్టుబడి ఉన్నాం
అనకాపల్లి, రాజమండ్రి ఆరు లేన్ల రహదారి
అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్
అనకాపల్లి, జూలై 20 (ఆంధ్రజ్యోతి):
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువత, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో చోడవరం, మాడుగుల పరిసరాల్లో పారిశ్రామిక క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించారు. ఇందు కోసం ఐదు వేల ఎకరాలను సేకరించనున్నట్టు చెప్పారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ విషయంలో త్వరలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం శాక మంత్రి అనిత, ఎమ్మెల్యేలతో చర్చిస్తామన్నారు. దేశంలో ప్రముఖ కంపెనీలను జిల్లాకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరగుతున్నాయన్నారు. ఐటీ రంగం అభివృద్ధితోపాటు సిమెంట్ కంపెనీలు, హైడ్రోజన్ ప్లాంట్‌లను ఏర్పాటుకు చర్చలు జరగుతున్నామన్నారు. ఇప్పటికే అదాని, జిందాల్, బిర్లా, రిలియన్స్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చించినట్టు సీఎం రమేశ్ వెల్లడించారు. నక్కపల్లిలో ఎస్‌ఈజెడ్‌కు జాతీయ రహదారి నుంచి కనెక్టవిటీ రహదారి నిర్మాణ పనులు చేపట్టి అక్కడ కూడా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బీపీసీఎల్ ఏపీ పెట్రో కెమికల్ కంపెనీని ఎలమంచిలి, పాయకరావుపేట తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బీపీసీఎల్ పెట్రో కెమికల్ పరిశ్రమ జిల్లాలో ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. దీనికి సముద్ర తీర ప్రాంతాల్లో కనీసం 5 వేల నుంచి 6 వేల ఎకరాలు భూమి అవసరమని అంటున్నారని, ఎలమంచిలి, అనకాపల్లి, పాయకరావుపేట పరిసరాల్లో భూసేకరణకు కలెక్టరుతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాన్నారు.
అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. అవసరం మేరకు అన్నిచోట్ల అండర్ పాస్‌లు, ఓవర్ పాస్‌ల నిర్మాణానికి కేంద్ర మంత్రి గడ్గరీ అంగీకరించారన్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడతామన్నారు. అనకాపల్లి నుంచి లంకెలపాలెం మీదుగా వెళ్లే జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రోడ్డును అండర్‌పాస్‌లు, ఓవర్ పాస్‌లు లేకుండా లంకెలపాలెం నుంచి విశాఖపట్నం వరకు డైరెక్ట్‌గా ప్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. అనకాపల్లి నుంచి భీమిలి, భోగాపురం వరకు మెట్రోతో పాటు ప్లైఓవర్‌ల నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించామన్నారు. సబ్బవరం నుంచి షీలానగర్ రోడ్డు పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డు పనులతో పాటు లంకెలపాలెం నుంచి సబ్బవరం వరకు రోడ్డు పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో రూ.800 కోట్లతో ఏలేరు ఎడమ కాలువ పనులు పూర్తిచేసి, సాగు, తాగునీరు అందించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు. జిల్లాలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను ఇథనాల్ ఫ్యాక్టరీలుగా మార్చేందుకు రైతులు, స్థానిక నాయకులతో చర్చించనున్నట్టు చెప్పారు. అనకాపల్లిలో చెత్త డంపింగ్ యార్డును వేరొక ప్రాంతానికి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
జిల్లాలో 1,500 గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్‌లు
జిల్లాలో అన్నిగ్రామాలకు సురక్షితమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఎంపీ గ్రాంట్ మంజూరు కాగానే 1,500 గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. అలాగే గెయిల్, ఎన్‌టీపీసీ, ఇందుజా కంపెనీల నుంచి సీఎస్‌ఆర్ నిధులను ఖర్చు చేసి అన్ని గ్రామాల్లో మినరల్ వాటర్‌ప్లాంట్‌లు మంజూరు చేస్తామన్నారు. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్‌ల మంజూరుకు ప్రతిపాదనలు తీసుకుంటామన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ఎలమంచిలి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 21 , 2024 | 01:13 AM