‘మేహాద్రి’పై మహా నిర్లక్ష్యం
ABN, Publish Date - May 19 , 2024 | 01:15 AM
నగర ప్రజల దాహార్తిని తీర్చడంతో కీలకమైన మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ పరిస్థితి నానాటికీ దీనావస్థకు చేరుతోంది.
రిజర్వాయర్‌లో డెడ్ స్టోరేజీ
కనీస నీటి మట్టానికి చేరువలో నిల్వలు
44.6 అడుగులకు పడిపోయిన వైనం
పూడికతీత పనులు చేపట్టకపోవడమే కారణం
ఏటా తగ్గిపోతున్న నీటి నిల్వ సామర్థ్యం
ఏడాదిగా మరమ్మతులకు నోచుకోని స్పిల్‌వే గేట్లు
నిర్వహణ పనులకు నిధులు విడుదల చేయని జీవీఎంసీ
గోపాలపట్నం, మే 18:
నగర ప్రజల దాహార్తిని తీర్చడంతో కీలకమైన మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ పరిస్థితి నానాటికీ దీనావస్థకు చేరుతోంది. నిర్వహణకు నిధులు మంజూరు చేయడంలో ‘మహా’ నిర్లక్ష్యం నగర వాసులకు శాపంలా పరిణమిస్తోంది. దీంతో రిజర్వాయర్ కొన్నేళ్లుగా వేసవి వచ్చేసరికి అడుగంటిపోతోంది. రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి అర్ధ శతాబ్దం గడుస్తున్నా మరమ్మతులపై దృష్టి సారించకపోవడం, ఏళ్లుగా పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీటి నిల్వల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.
వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలే లక్ష్యంగా నిర్మించిన మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ కాలక్రమేణా నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో కీలకంగా మారింది. ఈ రిజర్వాయర్ నుంచి నగర వాసుల అవసరాల కోసం నిత్యం సుమారు 12 ఎంజీడీల నీటిని వినియోగిస్తుంటారు. రిజర్వాయర్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 61 అడుగులు కాగా, కనిష్ఠ నీటిమట్టం 44 అడుగులు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం 44.6 అడుగులకు చేరింది. పూడిక తొలగింపు పనులు చేపట్టకపోవడంతో వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్ తొందరగా నిండిపోతోంది. ఈ సమయంలో గేట్లు తెరిస్తే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో రిజర్వాయర్ నీటిమట్టం 57 అడుగులకు చేరగానే గేట్లు తెరిచి, వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా కొన్నేళ్ల నుంచి రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గించాల్సి వస్తోంది. ఇదిలావుండగా రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి 50 ఏళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా పూడికతీత పనులు చేపట్టలేదు. ఇందుకోసం పదేళ్ల కిందట డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అధికారులతో పరిశీలన జరిపించగా సుమారు రూ.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే నిధులు ఇచ్చేందుకు జీవీఎంసీ ససేమిరా అనడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీంతో ఏటా రిజర్వాయర్ నీటిమట్టం తగ్గుముఖం పడుతూనే ఉంది.
నిర్వహణలో మహా నిర్లక్ష్యం
వాస్తవానికి మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ నిర్వహణ బాధ్యతలు ఇరిగేషన్ శాఖ చూస్తున్నప్పటికీ, అందుకు అవసరమైన నిధులను సమకూర్చే బాధ్యత పూర్తిగా జీవీఎంసీ తీసుకుంది. కానీ కనీస నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయకపోవడంతో రిజర్వాయర్ పరిస్థితి అధ్వానంగా మారుతోంది. పూడికతీత పనులు, గట్లు నిర్వహణ, రాతి పేర్పు వంటి పెద్ద పనుల మాటెలా ఉన్నా కనీసం స్పిల్‌వే వద్ద రెండు గేట్లు మరమ్మతుకు గురై నెలలు గడుస్తున్నా జీవీఎంసీ నిధులు మంజూరు చేయకపోవడంతో నీరు వృథాగా పోతోంది. నగరవాసుల తాగునీటి అవసరాలను గుర్తించి, సకాలంలో నిర్వహణ పనులకు నిధులు విడుదల చేయాల్సిన జీవీఎంసీ అధికారులు, పాలకులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తుండడమే దీనికి కారణమని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. సకాలంలో గేట్లు మరమ్మతులు చేపట్టకపోతే వర్షాలు కురిసే సమయంలో వరద నీటిని వెంటనే దిగువకు విడుదల చేయాల్సి వస్తోందని, లేదంటే రిజర్వాయర్‌కు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి రిజర్వాయర్ నిర్వహణ చర్యలు చేపట్టకపోతే నీటి నిల్వలు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Updated Date - May 19 , 2024 | 01:22 AM