నత్తనడకన గ్యాస్ పైప్‌లైన్
ABN, Publish Date - May 17 , 2024 | 01:08 AM
రాష్ట్రంలో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సంస్థను కేంద్రం తప్పించింది.
కాకినాడ-శ్రీకాకుళం పైప్‌లైన్ నిర్మాణానికి 2014లో శ్రీకారం
మూడేళ్లలో పూర్తిచేయాలని నిబంధన
ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, గెయిల్ కలిసి జాయింట్ వెంచర్
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డుతో ఒప్పందం
పదేళ్లయినా పూర్తి చేయకపోవడంతో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ
కొత్త వారిని ఆహ్వానిస్తూ ప్రకటన జారీ
విశాఖలో సేవలకు మరింత జాప్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సంస్థను కేంద్రం తప్పించింది. ఈ ప్రాజెక్టును 2014లో చేపట్టగా మూడేళ్లలో పూర్తి చేయాలనే నిబంధన పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఏపీ ప్రభుత్వం సమకూర్చకపోవడంతో తాజాగా ఈ ఒప్పందం రద్దు చేశారు. సగంలో ఆగిన ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకు రావాలంటూ కేంద్ర సంస్థ బిడ్లను ఆహ్వానించింది.
ఇదీ పైప్‌లైన్ ప్రాజెక్ట్ కథ
కేంద్ర ప్రభుత్వ సంస్థ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) కాకినాడ-శ్రీకాకుళం మధ్య పైప్‌లైన్ ద్వారా గ్యాస్ అందించేందుకు ప్రాజెక్టును 2014లో చేపట్టింది. దీని పొడవు 391 కి.మీ. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,103 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) కలిసి జాయింట్ వెంచర్ కింద ఈ ప్రాజెక్టును తీసుకున్నాయి. మూడేళ్లలో పూర్తి చేయాలనేది ఒప్పందం.
అయితే ఏపీ ప్రభుత్వం అవసరమైన నిధులు సమకూర్చకపోవడం వల్ల పనులు అనుకున్న విధంగా జరగలేదు. దీనిపై సమీక్షలు నిర్వహించినప్పుడల్లా గడువు కోరుతూ వచ్చారు. 2019లో కరోనా రావడంతో కొన్నాళ్లు దానిని సాకుగా చూపించారు. నిధుల కొరత వల్లే పనులు చేపట్టలేకపోతున్నామని గెయిల్ స్పష్టంచేసింది. ఇందులో గెయిల్‌కు 89 శాతం వాటా కాగా, ఏపీ ప్రభుత్వం వాటా 11 శాతం. అది తక్కువే అయినప్పటికీ నిధులు సమకూర్చలేదు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, గడువు పెంచుతూ 2024 జూన్ నాటికి పూర్తి చేయాలని స్పష్టంచేశారు. అయితే అందుకు తగిన విధంగా పనులు జరగకపోవడంతో కేంద్ర సంస్థ ఈ గడువుకు ముందే జాయింట్ వెంచర్ ప్రాజెక్టును రద్దు చేసింది. దీనిని పూర్తి చేయడానికి సామర్థ్యం కలిగిన సంస్థలు ముందుకు రావాలని నోటిఫికేషన్ జారీచేసింది. దానికి స్పందించిన హెచ్‌పీసీఎల్ సంస్థ, ఈ ప్రాజెక్టును పూర్తి చేయగల సత్తా తమకు ఉందని తెలిపింది. మరోవైపు గెయిల్ కూడా శ్రీకాకుళం-విశాఖపట్నం మధ్య పనులు తమకు అప్పగించాలని కోరుతోంది.
గాజువాక వరకు వచ్చింది
కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు చేపట్టిన ప్రాజెక్టు పనులు గాజువాకలో గత ఏడాదే పూర్తయ్యాయి. దాంతో అక్కడ సుమారు ఐదు వేల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దీనికి ఏర్పాట్లు చేసింది. అప్పటివరకు సిలెండర్ల ద్వారా ఇళ్లకు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సరఫరా చేశారు. ఏడాది నుంచి ఎల్‌పీజీకి బదులుగా ‘నేచురల్ గ్యాస్’ సరఫరా చేస్తున్నారు. దీనిని ‘పీఎన్‌జీ’గా వ్యవహరిస్తారు. ఈ కనెక్షన్‌లో సిలెండర్ ఉండదు. ఇంటి వరకు భూగర్భం ద్వారా పైప్‌లైన్ వేస్తారు. అక్కడి నుంచి ప్రత్యేకమైన పైపుల ద్వారా ఇంటిలోని కిచెన్‌కు కనెక్షన్ ఇస్తారు. గ్యాస్ వినియోగాన్ని కిలోల లెక్కన కాకుండా కిలో క్యాలరీల లెక్కన బిల్లింగ్ చేస్తారు. ఇది పోస్ట్ పెయిడ్ కనెక్షన్. విద్యుత్ బిల్లులా నెల తరువాత ఎంత వాడితే అంత కట్టాల్సి ఉంటుంది. కనెక్షన్‌కు మీటరు ఉంటుంది. దాని ద్వారా ఎంత గ్యాస్ ఉపయోగించిందీ లెక్కిస్తారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లకే కాకుండా వ్యక్తిగత గృహాలకు కూడా ఈ కనెక్షన్లు ఇస్తారు. ఈ విధంగా గ్యాస్ తీసుకునే వారికి రాయితీ ఏమీ ఉండదు. ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం ఆగిపోయాయి. తిరిగి ఎవరో ఒకరు చేపట్టే వరకు విశాఖ ప్రజలకు ఈ సౌకర్యం అందుబాటులోకి రాదు.
Updated Date - May 17 , 2024 | 01:08 AM