గేమింగ్ డిజార్డర్
ABN, Publish Date - Jun 29 , 2024 | 01:28 AM
నగర పరిధిలోని తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన 13 సంవత్సరాల విద్యార్థి కొద్దిరోజుల నుంచి ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు.
గంటల తరబడి ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతున్న విద్యార్థులు, యువతీయువకులు
బానిసలుగా మారుతున్న వైనం
ఎవరితోనూ కలవకపోవడం, గందరగోళం, తిండి, నిద్ర తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు అప్రమత్తం కావలసిందే...
అలాగే వదిలేస్తే ప్రమాదం
కౌన్సిలింగ్, మందులతో సాధారణ స్థితికి తీసుకురావచ్చంటున్న మానసిక వైద్యులు
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
నగర పరిధిలోని తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన 13 సంవత్సరాల విద్యార్థి కొద్దిరోజుల నుంచి ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. రోజుకు పది గంటలకుపైబడే ఆడుతుండడం, బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, పాఠశాలకు కూడా వెళ్లకపోవడం, ఇంట్లో గదికి పరిమితమవ్వడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ల సలహాతో మానసిక వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆన్‌లైన్ గేమింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు తేల్చారు.
రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ కోసం అప్పులు చేశాడు. తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి అప్పులు తీర్చారు. అయినా అతని తీరులో మార్పు రాకపోవడంతో మానసిక వైద్యులు వద్దకు తీసుకువెళ్లారు. యాప్‌లో ఏదో ఒక గేమ్ ఆడడాన్ని వ్యసనంగా మార్చుకున్నట్టు తేల్చిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకుని కౌన్సెలింగ్, మందులు ఇవ్వడం ద్వారా మెల్లగా సాధారణ స్థితికి తీసుకువచ్చారు.
గత కొన్నాళ్లుగా ఆన్‌లైన్ గేమింగ్ డిజార్డర్‌తో బాధపడు తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో గంటలు తరబడి గేమ్స్ ఆడుతుండే వారంతా ఇదే కోవకు వస్తుంటారు. ఈ సమస్యతో బాధపడేవారు కనీసం ఎనిమిది నుంచి 12 గంటలపాటు గేమ్స్ ఆడుతూ ఉంటారు. తిండి, నిద్ర, ఇతర వ్యాపకాల గురించి అసలు పట్టించుకోరు. రూమ్‌కు పరిమితమై గేమ్ ఆడుతూ అవతలి వారితో మాట్లాడుతూ సమయాన్ని గడుపుతుంటారు. ముఖ్యంగా ఆరు, ఏడు తరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి ఇంజనీరింగ్ వంటి కోర్సులు చదువుతున్న వారిలో ఈ తరహా సమస్యలు కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. రోజుల తరబడి ఆడుతున్నా తల్లిదండ్రులు గుర్తించి మందలించక పోవడంతో ఇది వ్యసనంగా మారి గేమింగ్ డిజార్డర్‌కు దారితీస్తోందంటున్నారు. పబ్జీ, ప్రీ ఫైర్ వంటి గేమ్స్ ఆడే వారిలో ఈ తరహా ఇబ్బందులు ఉంటున్నాయని చెబు తున్నారు. ఇటువంటి గేమ్స్ అనేకం ఉన్నాయి. ఈ గేమ్స్ ఆడేవాళ్లు..అవతలి వ్యక్తులతో సంభాషిస్తూ ఎనలేని ఆనందాన్ని పొందుతుంటారు. దీంతో ఎన్ని గంటలు ఆడినా వారికి సమయం తెలియదు. ఇదే డిజార్డర్‌కు దారితీస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ లక్షణాలుంటే అప్రమత్తం కావాలి..
గంటల తరబడి ఫోన్లు పట్టుకుని ఆటలాడుతుంటే తల్లిదండ్రులు అప్రమత్తం కావాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎవరితోనూ కలవకపోవడం, ఇంట్లోనే ఒక గదికి పరిమితం కావడం, సెల్‌ఫోన్ పట్టుకుని ఏవో మాట్లాడుతున్నట్టు కనిపించడం, స్కూల్/కళాశాలకు వెళ్లేం దుకు ఆసక్తి చూపించకపోవడం, గంటల తరబడి ఫోన్ పట్టుకుని ఉండడం, గందరగోళంగా కనిపించడం, తిండి, నిద్ర పట్ల ఆసక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తమై వైద్యులు వద్దకు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ చేయించాలి. అలాగే వదిలేస్తే ఆందోళన, డిప్రెషన్ వంటివి పెరిగి మానసిక సమస్యలు తలెత్తవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
సాధారణ స్థితికి ఇలా..
ఈ లక్షణాలు కనిపించిన వారిని మానసిక వైద్యుల వద్దకు తీసుకువెళితే కౌన్సెలింగ్ ఇచ్చి సాధారణ స్థితికి తీసుకు వస్తారు. అవసరమైతే సమస్య తీవ్రతను బట్టి కొందరికి మందులు కూడా వాడాల్సి ఉంటుంది. రోజువారీ ఆడే గేమింగ్ సమయాన్ని మెల్లగా తగ్గించుకుంటూ వచ్చి చివరికి పూర్తిగా దూరం చేస్తారు. అలాగే, గేమ్ ఆడేటప్పుడు కొందరికి రిలాక్స్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అటువంటి ఫీలింగ్ కలిగించే మందులను ఇవ్వడం ద్వారా ఆ తరహా ఆటలు వైపు వెళ్లకుండా చేస్తారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లో ఆడే వారికి ఈ తరహా ఇబ్బందులతోపాటు లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటుంటారని, కాబట్టి వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
పెరుగుతున్న కేసులు
- డాక్టర్ ఎన్‌ఎన్ నీహాల్, మానసిక వైద్య నిపుణులు
ఆన్‌లైన్ గేమింగ్ డిజార్డర్ కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. స్కూల్స్ తెరిచిన తరువాత ఇటు వంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. స్కూల్స్, కాలేజీలకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, సెల్‌ఫోన్ ఇవ్వాలని తల్లిదండ్రు లను వేధించడం చేస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించడం ద్వారా చిన్నారులను సాధా రణ స్థితికి తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది. ఆలస్యం అయితే మానసిక సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది.
Updated Date - Jun 29 , 2024 | 01:28 AM