ఏయూ హాస్టళ్ల ప్రక్షాళనపై దృష్టి
ABN, Publish Date - Sep 10 , 2024 | 01:00 AM
విశ్వవిద్యాలయాలను డ్రగ్స్ రహితంగా, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ ఆదేశాల అమలుపై ఏయూ అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు.
ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేందుకు రెక్టార్ ప్రొఫెసర్ కిశోర్‌బాబు నేతృత్వంలో
పది మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు
హాస్టళ్లలో బయటి వ్యక్తులు లేకుండా చేయడం, డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు క్యాంపస్‌లోకి రాకుండా చేయడమే లక్ష్యం
క్యాంపస్‌లో ఉంటే తప్పనిసరిగా విద్యార్థులు ఐడీ కార్డులు ధరించాల్సిందే
విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
విశ్వవిద్యాలయాలను డ్రగ్స్ రహితంగా, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ ఆదేశాల అమలుపై ఏయూ అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. వర్సిటీని పూర్తిస్థాయిలో డ్రగ్స్, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్‌గా తీర్చిదిద్దే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే వర్సిటీలో ఉన్న 40కిపైగా వసతి గృహాల్లో నిత్యం తనిఖీలు నిర్వ హించేందుకు ప్రత్యేక బృందాన్ని వీసీ ప్రొఫెసర్ జి.శశి భూషణరావు ఏర్పాటుచేశారు. అనేక హాస్టళ్లలో నాన్ బోర్డర్స్ ఉంటున్నట్టు, వారి ద్వారా డ్రగ్స్, గంజాయి వంటివి విశ్వ విద్యాలయంలోకి వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వాటికి చెక్ చెప్పాలంటే ఆకస్మిక తనిఖీలు చేయడం ఒక్కటే పరిష్కారంగా భావిస్తున్నారు. ఇందుకోసం రెక్టార్ ప్రొఫెసర్ కిశోర్‌బాబు నేతృత్వంలో ఆయా హాస్టళ్ల వార్డెన్లు, కళాశాల ప్రిన్సిపాల్స్‌తో ప్రత్యేకంగా బృందాన్ని నియమించారు. ఈ బృందం నిత్యం రెండు, మూడు హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నది. ఈ తనిఖీలకు వెళ్లిన వెంటనే సదరు బృందంలోని సెక్యూరిటీ సిబ్బంది తలుపులు మూసివేస్తారు. బయట విద్యార్థులు ఉంటే వారిపైనా, వారికి ఆశ్రయం ఇచ్చిన విద్యార్థులపైనా చర్యలు తీసుకోనున్నారు. అదే సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తారు.
నాన్ బోర్డర్స్‌తో ఇబ్బందులు
వర్సిటీలోని 40కిపైగా హాస్టళ్లలో సుమారు ఎనిమిది వేల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు. అనేక హాస్టళ్లలో నాన్ బోర్డర్స్ ఎక్కువగా ఉంటున్నారు. తనిఖీల ద్వారా వారికి చెక్ చెప్పాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు కూడా ఇబ్బందులు తప్పు తాయని అధికారులు పేర్కొంటున్నారు. నాన్ బోర్డర్స్ ఉండడం వల్ల జూనియర్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది.
ఐడీ కార్డు తప్పనిసరి
విద్యార్థులు వర్సిటీలో ఉన్న సమయంలో తప్పనిసరిగా మెడలో ఐడీ కార్డు ధరించాలన్న నిబంధనను అధికారులు తీసుకువచ్చారు. తరగతికి వచ్చినప్పుడు తప్పనిసరిగా విద్యా ర్థులు ఇకపై ఐడీ కార్డు ధరించాలి. అలాగే, హాస్టల్ విద్యార్థులు వర్సిటీలో, బయటకు వెళ్లి హాస్టల్‌లోకి వచ్చి నప్పుడు ఐడీ కార్డును ధరించాలని అధికారులు ఆదే శించారు. ఐడీ కార్డు ధరించని విద్యార్థిని అనుమతించవద్దని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మెస్‌లో భోజనం పెట్టేటప్పుడు కూడా తప్పనిసరిగా విద్యార్థులు ఐడీ కార్డును పరి శీలించాల్సిందిగా వార్డెన్లకు ఆదేశాలు అందాయి. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగేలా చేసేందుకు, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్టు రెక్టార్ ప్రొఫెసర్ కిశోర్‌బాబు తెలిపారు. ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు.
Updated Date - Sep 10 , 2024 | 01:00 AM