జలాశయాలకు పోటెత్తిన వరద నీరు
ABN, Publish Date - Sep 10 , 2024 | 12:01 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు కాంప్లెక్సులోని జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో జెన్‌కో అధికారులు అప్రమత్తమై డొంకరాయి, గుంటవాడ జలాశయాల నుంచి దిగువకు నీరును విడుదల చేస్తున్నారు.
సీలేరు జల విద్యుత్ కేంద్రంలోని నీరు
గుంటవాడ జలాశయం నుంచి 25 వేల క్యూసెక్కులు, డొంకరాయి జలాశయం నుంచి లక్షా 10 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల
సీలేరు, సెప్టెంబరు 9: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు కాంప్లెక్సులోని జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో జెన్‌కో అధికారులు అప్రమత్తమై డొంకరాయి, గుంటవాడ జలాశయాల నుంచి దిగువకు నీరును విడుదల చేస్తున్నారు. డొంకరాయి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1,037 అడుగులు కాగా, వలసగెడ్డ, పాలగెడ్డ, మంగంపాడు వాగుల నుంచి లక్షా పది వేల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. నీటిమట్టాన్ని స్థిరంగా కొనసాగించేందుకు అధికారులు జలాశయం ఏడు గేట్లు ఎత్తి లక్షా 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే గుంటవాడ జలాశయానికి పిల్లిగెడ్డ వాగు నుంచి 23 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు 23 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గుంటవాడ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,360 అడుగులు కాగా, ఇక్కడ 1,359 అడుగుల వద్ద స్థిరంగా కొనసాగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
జల విద్యుత్ కేంద్రంలోకి వర్షపునీరు
ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి జల విద్యుత్ కేంద్రం కొండ పైనుంచి వర ్షపు నీరు కేబుల్ ట్రెంచ్‌ల ద్వారా టర్భైన్ ఫ్లోర్‌లోకి ప్రవహించింది. జల విద్యుత్ కేంద్రం వెనుక భాగంలో ఉన్న డీ వాటరింగ్ పంప్ షెడ్ కూడా నీట మునిగిపోయి, డీ వాటరింగ్ సమస్య తలెత్తింది. దీంతో జెన్‌కో అధికారులు అప్రమత్తమై టర్భైన్ ఫ్లోర్‌లోకి ప్రవేశించిన వర్షపు నీటిని అదనపు మోటార్లను అమర్చి జల విద్యుత్ కేంద్రానికి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టారు. కాగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపి వేశారు. ఉదయం తొమ్మిది గంటల తరువాత రెండు యూనిట్లను వినియోగంలోకి తీసుకొచ్చారు.
పూర్తిస్థాయికి చేరువలో బలిమెల జలాశయం
సీలేరు కాంప్లెక్సులో అత్యంత పెద్దదైన బలిమెల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. ఇక్కడ పూర్తిస్థాయి నీటిమట్టం 1,516 అడుగులు కాగా, ప్రస్తుతం 1,510 అడుగులకు చేరింది. ఇక్కడ మరో ఐదు అడుగుల నీటిమట్టం పెరిగితే బలిమెల జలాశయం నుంచి గుంటవాడ జలాశయానికి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. బలిమెల నుంచి నీటిని విడుదల చేస్తే గుంటవాడ జలాశయానికి మరింత ఇన్‌ఫ్లో వచ్చి చేరే అవకాశం ఉండడంతో జెన్‌కో అధికారులు గుంటవాడ జలాశయం నుంచి భారీగా నీటిమట్టం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నారు.
జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో..
ముంచంగిపుట్టు : ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాలకు వరదనీరు పోటెత్తింది. సోమవారం ఆ రెండు జలాశయాలకు ఇన్‌ఫ్లో భారీగా చేరుతుండడతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
జోలాపుట్టు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,750 అడుగులు కాగా, సోమవారం 2,549.20 అడుగులకు చేరింది. దీంతో ఆరు గేట్లు ఎత్తి దిగువకు 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డుడుమ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,590 అడుగులు కాగా, ప్రస్తుతం 2,589.40 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై నాలుగు గేట్లు ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతంలో గల బలిమెలకు విడుదల చేశారు. ఆ రెండు జలాశయాల చరిత్రలో ఇంత స్థాయిలో వరద నీరు రావడం, అదే స్థాయిలో నీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
Updated Date - Sep 10 , 2024 | 12:01 AM