చింతలూరులో అతిసార
ABN, Publish Date - Sep 10 , 2024 | 10:38 PM
మండలంలోని చింతలూరు గ్రామంలో అతిసార ప్రబలింది. మంగళవారం ఉదయం ఓ గిరిజనుడు అతిసారతో మృతి చెందగా, గ్రామంలో పది మంది అస్వస్థతతో బాధపడుతున్నారు.
ఒకరి మృతి, పది మందికి అస్వస్థత
చింతపల్లి, సెప్టెంబరు 10: మండలంలోని చింతలూరు గ్రామంలో అతిసార ప్రబలింది. మంగళవారం ఉదయం ఓ గిరిజనుడు అతిసారతో మృతి చెందగా, గ్రామంలో పది మంది అస్వస్థతతో బాధపడుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6వ తేదీన గ్రామంలో కొంత మంది గిరిజనులు అతిసార బారిన పడ్డారు. గ్రామానికి చెందిన కొర్ర రాము(50), కొర్ర అర్జున్ వాంతులు, విరేచనాలకు బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు సోమవారం చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అర్జున్ కోలుకోగా, కొర్ర రాము మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే గ్రామంలో సంపరి లక్ష్మి, గెమ్మెలి శాంతి, కొర్ర లక్ష్మణరావు సోమవారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనాల్లో ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. కాగా లంబసింగి పీహెచ్‌సీ పారామెడికల్ ఉద్యోగులు సాయంత్రం గ్రామాన్ని సందర్శించి బాధితులకు ప్రాథమిక చికిత్స అందించారు.
Updated Date - Sep 10 , 2024 | 10:38 PM