ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జలాశయాలు కళకళ

ABN, Publish Date - Sep 10 , 2024 | 01:10 AM

నగరానికి తాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి.

మూడురోజులపాటు కురిసిన వర్షాలకు భారీగా చేరిన నీరు

గరిష్ఠ స్థాయికి చేరిన నీటిమట్టాలు

ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో ఏలేరు, తాటిపూడి రిజర్వాయర్ల నుంచి దిగువకు నీరు విడుదల

మేహాద్రిగెడ్డ నీటిమట్టం మరింత పెరిగితే దిగువకు విడిచిపెట్టే అవకాశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరానికి తాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం ప్రభావంతో మూడు రోజులపాటు ఇటు శ్రీకాకుళం జిల్లా అటు కృష్ణా జిల్లా వరకూ విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో అన్ని రిజర్వాయర్లు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఏలేరు, తాటిపూడి రిజర్వాయర్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా, మేహాద్రిగెడ్డకు ఇన్‌ఫ్లో కొనసాగితే మంగళవారం గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

నగరవాసుల తాగునీటి అవసరాలతోపాటు పరిశ్రమలకు కావాల్సిన నీటిని తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్‌తోపాటు విజయనగరం జిల్లా తాటిపూడి, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో గల రైవాడ రిజర్వాయర్‌తోపాటు నగర పరిధిలో ఉన్న మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్ల నుంచి సేకరిస్తుంటారు. అయితే రైవాడ, ఏలేరు, తాటిపూడి రిజర్వాయర్ల నుంచి ఎక్కువభాగం నీటిని వ్యవసాయ అవసరాలకు కేటాయించాల్సి ఉంటుంది. వేసవి సీజన్‌లో ఒకవైపు రబీకి నీటిని విడుదల చేస్తూనే, నగర ప్రజల తాగునీరు అవసరాలకు, పరిశ్రమలకు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనివల్ల వేసవిలో నీటి లభ్యత తగ్గుతుంది. ప్రస్తుతం కురిసిన వర్షాల పుణ్యమా అని వచ్చే రెండేళ్ల వరకూ నగరంలో తాగునీటికి ఇబ్బందిపడే పరిస్థితి తలెత్తకపోవచ్చునని జీవీఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. నగరానికి అవసరమైన నీటిలో సింహభాగం అందించే ఏలేరు రిజర్వాయర్‌ గరిష్ఠ సామర్థ్యం 86.56 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 85.7 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో అధికారులు రిజర్వాయర్‌ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో ప్రధాన రిజర్వాయర్‌ అయిన రైవాడ గరిష్ఠ సామర్థ్యం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 111.37 మీటర్లకు చేరింది. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గరిష్ఠ సామర్థ్యం 61 అడుగులు కాగా, ప్రస్తుతం 58 అడుగులకు చేరుకుంది. ఇంకా నీటి మట్టం పెరిగితే రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాలు మునిగిపోతాయి కాబట్టి అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇన్‌ఫ్లో ఇంకా కొనసాగితే మంగళవారం నీటిని దిగువకు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తాటిపూడి రిజర్వాయర్‌ గరిష్ఠ సామర్థ్యం 297 అడుగులు కాగా ప్రస్తుతం 290.2 అడుగుల మేరు నీరు ఉంది. ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో అధికారులు రిజర్వాయర్‌ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముడసర్లోవ రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 169 అడుగులు కాగా ప్రస్తుతం 163 అడుగులకు చేరింది. గంభీరం రిజర్వాయర్‌ గరిష్ఠ స్థాయి 126 అడుగులు కాగా ప్రస్తుతం 125 అడుగులకు చేరింది.

రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం ప్రస్తుతం

ఏలేరు 86.56 మీటర్లు 85.7 మీటర్లు

రైవాడ 114 మీటర్లు 111.37 మీటర్లు

మేహాద్రిగెడ్డ 61 అడుగులు 58 అడుగులు

తాటిపూడి 297 అడుగులు 290.2 అడుగులు

గోస్తనీ 35 అడుగులు 29 అడుగులు

ముడసర్లోవ 169 అడుగులు 163 అడుగులు

గంభీరం 126 అడుగులు 125 అడుగులు

కొండవాలు ప్రాంతాల్లో 12,750 కుటుంబాలు

రక్షణకు ప్రత్యేక కార్యాచరణ

మేహాద్రిగెడ్డ గేట్లు మరమ్మతులకు రూ.2 కోట్లతో ప్రతిపాదన

కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

నగరంలో కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న 12,750 కుటుంబాల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర్‌ ప్రసాద్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కొండవాలు ప్రాంతాల్లో పలుచోట్ల రక్షణ గోడలు ప్రమాద పరిస్థితికి చేరుకున్నాయన్నారు. కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న 96 కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించామన్నారు. విశాఖ రూరల్‌ మండల పరిధిలో 6,900 కుటుంబాలు, గోపాలపట్నంలో 2,272, భీమిలి మండలంలో 1,100, పెదగంట్యాడలో 750, పెందుర్తిలో 716, ములగాడలో 650, గాజువాకలో 190 కుటుంబాలు కొండవాలులో నివాసం ఉంటున్నాయన్నారు. వచ్చే తుఫాన్‌ సీజన్‌లో ఇబ్బందులు లేకుండా కొండవాలు ప్రాంతాల్లో నివాసితుల రక్షణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భారీవర్షాలకు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ 58 అడుగులకు చేరిందని, మరో మూడున్నర అడుగులు నిండితే పూర్తిస్థాయి మట్టానికి చేరుకుంటుందన్నారు. వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్‌ను సందర్శించి పరిస్థితి సమీక్షించామన్నారు. రిజర్వాయర్‌కు ఆరు గేట్లల్లో శిథిలావస్థకు చేరిన రెండింటి మరమ్మతులకు రూ.రెండు కోట్లతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకు ప్రతిపాదనలు పంపామన్నారు. రిజర్వాయర్‌ నుంచి నీరు ప్రవహించే కొండగెడ్డ నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తాటిపూడి రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదల, వర్షాలకు గోస్తనీలో వరద ప్రవాహం పెరిగినందున పద్మనాభం, భీమిలి మండలాల్లో తీర గ్రామాలను అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని, దీనిపై శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. వాయుగుండం ఏర్పడక ముందు విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి చేపల వేటకు వెళ్లిన 30 బోట్లు సురక్షితంగా గోపాల్‌పూర్‌లో ఒడ్డుకు చేరుకున్నాయని, ఈ మేరకు సంబంధిత జిల్లా కలెక్టర్‌తో మాట్లాడామన్నారు. వర్షాలకు అక్కడక్కడా ప్రహరీ గోడలు, పాఠశాల గోడలు కూలాయని కలెక్టర్‌ తెలిపారు. విజయవాడ వరద బాధితులకు రెండున్నర లక్షల ఆహార పొట్లాలు, లక్షన్నర లీటర్ల పాలు, రెండు లక్షల వాటర్‌ బ్యాటిళ్లు పంపించామన్నారు. విజయవాడలో విధులు నిర్వహణకు 1,000 మంది పారిశుధ్య సిబ్బందిని పంపించామని, నేవీ నుంచి బోట్లు వెళ్లాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.

మేహాద్రికి జల కళ

57.5 అడుగులకు చేరిన నిల్వలు

పూర్తిస్థాయి నీటి మట్టం 61 అడుగులు

మరో రెండు అడుగుల మేర నీరు చేరితేనే దిగువకు విడుదల

గోపాలపట్నం, సెప్టెంబరు 9:

భారీవర్షాలతో మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నిండుకుండను తలపిస్తోంది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 61 అడుగులు కాగా...ప్రస్తుతం 57.5 అడుగుల మేర నిల్వలున్నాయి. మరో రెండు అడుగులు నీరు చేరితేనే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయాల్సి ఉంటుందని, అప్పటివరకూ ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు. కాగా రిజర్వాయర్‌ను కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడం, ఇన్‌ఫ్లో లేకపోవడంతో నీటిమట్టం స్థిరంగా ఉందని, భారీవర్షాలు కురిస్తే నాలుగు గేట్లను ఎత్తి, వరదనీటిని దిగువకు విడుదల చేయాల్సి ఉంటుందని ఇంజనీరింగ్‌ అధికారులు ఆయనకు వివరించారు. రిజర్వాయర్‌ గేట్లు ఎత్తాల్సిన పరిస్థితులు ఎదురైతే ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ముంపు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్‌లో నీరు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చేపలు పట్టేవారు లోపలకు వెళ్లకుండా నియంత్రించాలని సూచించారు.

జీవీఎంసీకి రూ.15 కోట్లు నష్టం

నష్టం మరింత పెరిగే అవకాశం

విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

వాయుగుండం ప్రభావంతో నగరంలో మూడు రోజులపాటు కురిసిన భారీవర్షాల వల్ల జీవీఎంసీకి రూ.15 కోట్ల వరకూ ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల ధాటికి 21 కిలోమీటర్లు మేర రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల గుంతలుపడితే, మరికొన్నిచోట్ల రోడ్లపై పొర లేచిపోయింది. ఇంకొన్నిచోట్ల వర్షం నీరు రోడ్ల పైనుంచి ప్రవహించడంతో కోతకు గురయ్యాయి. వీటిని మరమ్మతు చేసేందుకు కనీసం రూ.12 కోట్లు వరకూ ఖర్చవుతుందని ఇంజనీరింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఓపెన్‌ డ్రెయిన్లు రెండు కిలోమీటర్లు మేర దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతు చేసేందుకు రూ.కోటి వరకూ ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. నగరంలో 63 చోట్ల వీధి లైట్లు దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేసేందుకు కనీసం రూ.పది లక్షలు వరకూ అవుతాయని అంచనా వేస్తున్నారు. శిధిలావస్థకు చేరిన భవనాలు, కమ్యూనిటీ హాళ్లు నాలుగు కూలిపోగా, మరికొన్ని దెబ్బతిన్నాయి. వీటివల్ల సుమారు రూ.కోటి వరకూ నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రవాహం ధాటికి నీటి సరఫరా పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతు చేసేందుకు రూ.పది లక్షలు అవసరం అవుతాయని అఽధికారులు చెబుతున్నారు. ఆస్తి నష్టంపై అధికారులు ఇంకా సర్వే చేస్తుండడంతో మరింత పెరిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - Sep 10 , 2024 | 01:10 AM

Advertising
Advertising