జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు
ABN, Publish Date - Nov 26 , 2024 | 05:25 AM
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షించారు.
ఏర్పాట్లపై సమీక్షించిన టీటీడీ అదనపు ఈవో
తిరుమల, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి కావడంతో ఆ రోజు నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు కల్పించనున్నారు. ఈ పదిరోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు (స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా) చేసినట్టు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అలాగే, చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, డిఫెన్స్, ఎన్‌ఆర్‌ఐ దర్శనాలతో పాటు ఆర్జితసేవలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఆ రోజుల్లో వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాల వితరణ చేయాలని అధికారులకు సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో ఇంకోసారి సమీక్షిస్తామన్నారు.
Updated Date - Nov 26 , 2024 | 05:26 AM