విశ్వం శూన్యం నుంచి రాలేదు
ABN, Publish Date - Jul 15 , 2024 | 04:23 AM
విశ్వం శూన్యం నుంచి రాలేదని, అకారణంగా విశ్వంలో ఏ సంఘటనా జరగదని హేతువాద సంఘ నాయకుడు డాక్టర్ బాలనాయుని పేర్కొన్నారు.
హేతువాద సంఘ నాయకుడు డాక్టర్ బాలనాయుని
బాపట్ల, జూలై 14: విశ్వం శూన్యం నుంచి రాలేదని, అకారణంగా విశ్వంలో ఏ సంఘటనా జరగదని హేతువాద సంఘ నాయకుడు డాక్టర్ బాలనాయుని పేర్కొన్నారు. బాపట్ల ఎన్జీవో హోమ్‌లో జరుగుతున్న భారత హేతువాద సంఘ 93వ వార్షిక మహాసభలలో భాగంగా ఆదివారం హేతువాద, మానవవాద అధ్యయన తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వతత్వం అనే అంశం మీద డాక్టర్ బాలనాయుని మాట్లాడుతూ.. నియమబద్ద విశ్వపదార్థం శక్తిగా మారుతుందన్నారు. విశ్వపరిణామంలో నూతన నిర్మాణం వచ్చినప్పుడల్లా కొత్త లక్షణాలు వ్యక్తమవుతాయని చెప్పారు. హేతుబద్ద ఆలోచన-మానవ జీవనతత్వం అంశం మీద తెలంగాణ హేతువాద సంఘ ఉపాధ్యక్షుడు షేక్. నబీ సాహెబ్ మాట్లాడుతూ.. మానవ జీవన విధానం మెరుగు పడాలంటే హేతుబద్ద ఆలోచన అత్యవసరమన్నారు. తూర్పుగోదావరి జిల్లా హేతువాద సంఘ అధ్యక్షుడు కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ మనుషులు సహజంగా హేతుబద్ద ఆలోచన కలవారని, మతవిశ్వాసాల ప్రభావం వల్ల వారు ఆలోచించలేకపోతున్నారని అన్నారు. భౌతిక వాస్తవిక వాదం- విశ్వతత్వం అనే అంశంపై భారత హేతువాద సంఘ అధ్యక్షుడు డాక్టర్ గుమ్మా వీరన్న మాట్లాడుతూ.. విశ్వం భౌతిక వాస్తవికం అన్నారు. విశ్వానికి ఆది అంతం లేవన్నారు. విశ్వతత్వాన్ని, పరిణామాన్ని అవగాహన చేసుకోవడానికి భౌతిక వాస్తవిక వాదం దారి చూపుతుందన్నారు. కార్యక్రమంలో దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
Updated Date - Jul 15 , 2024 | 04:23 AM