ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ నేతల ‘చెత్త’ పనులు

ABN, Publish Date - Aug 23 , 2024 | 04:23 AM

జగన్‌ హయాంలో రాష్ట్రంలో చేపెట్టిన చెత్తశుద్ధి కార్యక్రమం వైసీపీ నేతల అక్రమాలకు నిలయంగా మారింది.

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ముసుగులో రూ.కోట్లు కొట్టేసేందుకు స్కెచ్‌

10 శాతం పనులకు 90 శాతం చేశారంటూ అధికారుల వత్తాసు

55 వేల టన్నుల చెత్త శుద్ధి పూర్తయిందంటూ బిల్లుల తయారు

5.25 కోట్లు నొక్కేసేందుకు సిద్ధం

నంద్యాలలో వెలుగులోకి అక్రమం

(నంద్యాల-ఆంధ్రజ్యోతి)

జగన్‌ హయాంలో రాష్ట్రంలో చేపెట్టిన చెత్తశుద్ధి కార్యక్రమం వైసీపీ నేతల అక్రమాలకు నిలయంగా మారింది. నంద్యాల జిల్లాలో రెండేళ్ల కిందటే చెత్తశుద్ధి పనులు మొదలుపెట్టినా వైసీపీ హయాంలో ఏమాత్రం ముందుకు సాగలేదు. జరిగిన కాస్త పని ద్వారా వచ్చిన మట్టి, ప్లాస్టిక్‌ను వైసీపీ నాయకులు అమ్ముకున్నారు. అయితే, అధికారులు మాత్రం 90 శాతం పనులు పూర్తయ్యాయంటూ బిల్లులు సిద్ధం చేశారు. ‘స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌’ సదరు బిల్లులను ఆమోదించటమే తరువాయి కోట్ల రూపాయల బిల్లులు మంజూరు కానున్నాయి. ఇప్పటికే కొంతమేరకు బిల్లులు మంజూరైనట్లు తెలిసింది. వీటిని కొట్టేసేందుకు నంద్యాల మున్సిపల్‌ అధికారులు, అప్పటి వైసీపీ నేతలు తెరవెనుక తతంగం నడిపిస్తున్నారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం లోతుగా ఆరా తీస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

ఉమ్మడిగా ఊడ్చేసేందుకు

నంద్యాల పట్టణ శివారులో ఉన్న కుందూ నది అవతల 13 ఎకరాల్లో డంపింగ్‌ యార్డు ఉంది. పట్టణం నుంచి రోజూ సేకరించిన 120 టన్నుల చెత్తను ఎప్పటికప్పుడు ఈ యార్డుకు తరలిస్తారు. దీనిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ కింద శుద్ధి చేయాల్సి ఉంది. కానీ, కొన్నేళ్లుగా చెత్త శుద్ధి జరగకపోవటంతో యార్డు పూర్తిగా నిండిపోయింది. దీనిని శుద్ధి చేస్తేగానీ రోజూవారీగా పట్టణం నుంచి సేకరించే చెత్తను యార్డులో వేసేందుకు వీలు లేదు. దీంతో గత వైసీపీ ప్రభుత్వం స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 66 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను శుద్ధి చేసే కాంట్రాక్టును ముంబైకి చెందిన సాగర్‌ మోటార్స్‌కు అప్పగించింది. తడి చెత్త ద్వారా రైతులకు ఉపయోగపడేలా వర్మీ కంపోస్టు తయారీ, అలాగే పొడి చెత్త నుంచి మట్టి, ఆర్‌డీఎ్‌ఫ(ప్లాస్టిక్‌, వస్త్రాలు, గాజు) వంటివి వేరు చేయాలి. ఇలా వేరు చేసిన ఆర్‌డీఎ్‌ఫను స్థానిక జిందాల్‌ ఫ్యాక్టరీకి తరలించాలి. ఒక టన్ను చెత్త శుద్ధి చేసినందుకు కాంట్రాక్టు సంస్థకు దాదాపు రూ.750 వరకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా మొత్తం శుద్ధి ప్రక్రియను రూ.5.25 కోట్లకు వైసీపీ ప్రభుత్వం అప్పగించింది. అయితే, పనులు మొదలుపెట్టి రెండేళ్లవుతున్నా చెత్త శుద్ధి ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో డంపింగ్‌ యార్డులో చెత్త కొండలా పేరుకుపోయింది.

అయితే, సంబంధిత కంపెనీ చెత్త శుద్ధి చేపడుతున్నట్లు ఎప్పటికప్పుడు వివరాలను లాగ్‌బుక్‌లో నమోదు చేసింది. వాస్తవానికి అలా జరగలేదు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. దీని వెనుక అప్పటి వైసీపీ నాయకుల ప్రోద్బలం ఉన్నట్లు ఆరోపణలు వినిపించాయి. జరిగిన కొద్ది మేర శుద్ధిలో వేరు చేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను, మట్టిని వైసీపీ చోటా మోటా నాయకులు అమ్మేసుకున్నారన్న ఆరోపణలు అప్పట్లోనే బలంగా వినిపించాయి. ఇక ఆ తర్వాత శుద్ధి ప్రక్రియ పూర్తిగా మూలన పడింది. ఈలోపు ఎన్నికలు రావటంతో ప్రభుత్వం మారిపోయింది. ఇక, ఎప్పటి నుంచో తమ ఆధ్వర్యంలోనే ఈ శుద్ధి కార్యక్రమం నడవటం, మున్సిపాలిటీలో కూడా తమ బలమే ఉండటంతో వైసీపీ నాయకులు, అధికారులతో కుమ్మక్కయి దీనికి సంబంధించిన బిల్లులను సిద్ధం చేశారు. వాటిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌కు కూడా పంపించారు. అక్కడి నుంచి ఆమోద ముద్ర రాగానే నిధులు విడుదలకానున్నాయి. ఇలా వచ్చిన సొమ్మును అధికారులు, వైసీపీ నేతలు పంచుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

గతేడాది జనవరిలో చెత్తశుద్ధి కార్యక్రమాన్ని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ప్రారంభించారు. కాంట్రాక్టు ప్రకారం 3 నెలల్లో పనులు పూర్తయ్యేలా చూడాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. రోజుకు 10 వేల టన్నుల చెత్తను శుద్ధి చేసినా 66 రోజుల్లో, అంటే రెండు నెలల్లోనే శుద్ధి ప్రక్రియను పూర్తి చేయవచ్చు. గతేడాది ఏప్రిల్‌లో పూర్తి కావాల్సిన శుద్ధి ప్రక్రియ సాంకేతిక కారణాలతో ఆగిపోయింది.

కనిపించని చెత్త‘శుద్ధి’

డంపింగ్‌ యార్డులోని 66 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త శుద్ధి ప్రక్రియను చేపట్టిన కంపెనీ ఇప్పటికే 55 వేల మెట్రిక్‌ టన్నులను శుద్ధి చేసిందని అధికారులు చెబుతున్నారు. తద్వారా వచ్చిన మట్టి, ఆర్‌డీఎ్‌ఫను 32 వేల టన్నుల మేర డంపింగ్‌ యార్డు నుంచి బయటకు పంపించామని, మరో 23 వేల టన్నులను బయటకు పంపించాల్సి ఉందని తెలిపారు. కానీ, డంపింగ్‌ యార్డులో శుద్ధి చేసిన వ్యర్థాలు ఏమాత్రం కనిపించవు. అసలు అక్కడి డోజర్లు, శుద్ధి చేసే యంత్రాలు పనిచేయక కొన్ని నెలలు అవుతోంది. ఇక మట్టి, ఆర్‌డీఎఫ్‌ వంటివి బయటకు పోయిందే లేదని చూసిన వారెవరికైనా అర్థమవుతుంది. దీంతో చెత్త శుద్ధి పనులకు సంబంధించి రూ.5.25 కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇందులో ఓ ఇంజనీరింగ్‌ అధికారి ప్రమేయం కూడా ఉందని, విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Aug 23 , 2024 | 04:23 AM

Advertising
Advertising