ప్రజల పాలిట శాపం
ABN, Publish Date - May 06 , 2024 | 03:03 AM
రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు(ల్యాండ్ టైటిలింగ్) చట్టాన్ని అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా మారుతుందని విశ్రాంత ఐఏఎస్ పి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక్క ఏపీలోనే ఈ చట్టం అమలుకు అత్యుత్సాహం
కేంద్ర నమూనా చట్టానికి మరిన్ని కఠిన నిబంధనలు
జనచైతన్య వేదిక చర్చాగోష్ఠిలో విశ్రాంత ఐఏఎస్ పి.కృష్ణయ్య
గుంటూరు కార్పొరేషన్, మే 5: రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు(ల్యాండ్ టైటిలింగ్) చట్టాన్ని అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా మారుతుందని విశ్రాంత ఐఏఎస్ పి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ‘భూ యాజమాన్య హక్కు చట్టం అమలు పూర్వ పరాలు-సమస్యలు’ అనే అంశంపై జనచైతన్య వేదిక ఆదివారం గుంటూరులో చర్చాగోష్ఠి నిర్వహించింది. ఇందులో ఆయన ప్రసంగిస్తూ.. చట్టంలో చెప్పిన నిర్దిష్ట కాలంలో లీజులు, తనఖాలు, ఇతర అన్యాక్రాంతాలు, క్రయ విక్రయాలను.. భూమి ఆస్తి హక్కు అధికారి వద్ద నమోదు చేయడంలో యాజమానులు విఫలమైతే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.50 వేల జరిమానా విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. భూ హక్కుల నిర్ధారణ, వివాదాల పరిష్కారాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాలను నుంచి తొలగించి, ప్రభుత్వ ఆధీనంలో, వారి కనుసన్నల్లో పనిచేసే రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలను సంక్రమింపజేయడం ద్వారా అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వాలు వాటిని భక్షించే విధంగా నిబంధనలు కొత్త చట్టంలో పొందుపరచడం ఆక్షేపణీయమన్నారు. భూ హక్కు కొత్త చట్టం దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారు, నిరక్షరాస్యుల ప్రయోజనాలను దెబ్బ తీస్తుందన్నారు.
ఈ చట్టాన్ని దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయకపోయినా ఒక్క ఆంధ్రప్రదేశ ముందుకు రావడం దేనికోసమని కృష్ణయ్య ప్రశ్నించారు. ఉన్నత న్యాయస్థానాలు భూహక్కు విషయాల్లో ఇచ్చిన తీర్పులను ఏడు రోజుల్లో అధికారుల వద్ద నమోదు చేసుకోకపోతే ఆ తీర్పులను అంగీకరించలేమని పేర్కొనడం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని పేర్కొన్నారు. భూ హక్కుదారులు అధికారుల వద్ద తగిన దరఖాస్తులు చేసుకున్న తర్వాత రెండేళ్ల తర్వాత మాత్రమే వారికి యాజమాన్య హక్కు గుర్తించబడుతుందని చెప్పడం ద్వారా, వారు రుణాలు పొందడానికి, క్రయవిక్రయాలకు అవకాశం కోల్పోతారని తెలిపారు. ప్రపంచ బ్యాంక్ ఆదేశాల కనుగుణంగా నీతి ఆయోగ్ రూపొందించిన నమూనా చట్టానికి మరిన్ని కఠిన నిబంధనలు పొందుపరిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ హక్కు చట్టాలను రూపొందించడాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ దివాకర్‌బాబు, హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, పౌర హక్కుల సంఘం నేత పి.రాజారావు, ప్రోగ్రెసివ్ ఫోరం నేత పీవీ మల్లికార్జునరావు, ‘మానవత’ చైర్మన్ పావులూరి రమేష్, రేట్ పేయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఒ.నారాయణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డీఏ ఆర్.సుబ్రహ్మణ్యం ప్రసంగించారు.
Updated Date - May 06 , 2024 | 03:03 AM