ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరిశ్రమల్లో భద్రత ఏదీ?

ABN, Publish Date - Jul 04 , 2024 | 11:24 PM

జిల్లాలో కార్మికులకు భద్రత కరువైంది. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం రాజ్యమేలింది. పరిశ్రమల్లో, క్వారీల్లో, చివరకు భవన నిర్మాణ కార్మికులకు సైతం భద్రత కరువై.. ప్రాణాలు పోగొట్టుకున్నారు.

సరాకా పరిశ్రమలో రియాక్టర్‌ వద్ద మంటలు అదుపు చేస్తున్న సిబ్బంది (ఫైల్‌)

- జిల్లాలో కార్మికుల ప్రాణాలకు భరోసా కరువు

- యంత్రాల మధ్య నలిగిపోతున్న శ్రమజీవులు

- పట్టించుకోని అధికారులు, యాజమాన్యాలు

- గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మరీ నిర్లక్ష్యం

(రణస్థలం)

- జూన్‌ 29న పైడిభీమవరంలోని సరాక రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్‌ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో సమీపంలో కార్మికులు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ భారీగా వాహనాలు కాలిపోయాయి. రూ.కోటిన్నర వరకూ నష్టం వాటిల్లింది.

............................

- ఈ నెల 2న పైడిభీమవరం పారిశ్రామికవాడలోని శ్రేయస్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. నిల్వల గోదాములపై రేకులు బిగిస్తుండగా.. ప్రమాదవశాత్తూ షమీర్‌షేక్‌ (23), రహిబుల్‌షేక్‌ (23) జారిపడ్డారు. షమీర్‌షేక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రహిబుల్‌షేక్‌ను విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ.. బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరిదీ ఉత్తరప్రదేశ్‌. ఉపాధి కోసం ఇక్కడకు వచ్చి ఊహించని ప్రమాదంలో మృతి చెందడంతో కార్మికులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై జేఆర్‌ పురం ఎస్‌ఐ కె.గోవిందరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

............................

- తాజాగా.. పిషిని పంచాయతీ పరిధిలోని ఓ రసాయనిక పరిశ్రమలో గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో పి.త్రినాధరావు, కే.గోవిందరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక డ్రమ్‌లోని రసాయన పౌడర్‌ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో అక్కడ ఉన్న ఈ ఇద్దరు కార్మికుల కళ్లు ఎర్రపడి తీవ్ర ఇబ్బంది పడ్డారు. వీరిద్దరినీ చికిత్స నిమిత్తం విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రమాదం లేదని కార్మికులు తెలిపారు.

.....................

జిల్లాలో కార్మికులకు భద్రత కరువైంది. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం రాజ్యమేలింది. పరిశ్రమల్లో, క్వారీల్లో, చివరకు భవన నిర్మాణ కార్మికులకు సైతం భద్రత కరువై.. ప్రాణాలు పోగొట్టుకున్నారు. కనీస వేతనాలు, సౌకర్యాలకు నోచుకోకపోగా.. మండుతున్న యంత్రాల మధ్య పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. జిల్లాలో పైడిభీమవరం పారిశ్రామికవాడతో పాటు పలాస ప్రాంతంలో జీడి పరిశ్రమలు ఉన్నాయి. టెక్కలి, పొందూరు వంటి ప్రాంతాల్లో క్వారీలు నడుస్తున్నాయి. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రత లేదు. కార్మిక చట్టాలను యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నాయి. యంత్రాల మధ్య పనిచేసే కార్మికులకు హీట్‌ రెసిస్టెంట్‌ ఆఫ్రాన్లు, గమ్‌బూట్లు, హెల్మెట్లు గ్లౌజులు విధిగా అందించాలి. వీటిని అందించడంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు మృత్యువాత పడుతున్నారు. క్షతగాత్రులుగా మారుతున్నారు. బాధితులకు నామమాత్రంగా పరిహారం అందించి యాజమాన్యాలు చేతులు దులుపుకొంటున్నట్టు ఆరోపణలున్నాయి.

- తరచూ ప్రమాదాలు

పైడిభీమవరం పారిశ్రామిక వాడలో సుమారు 30 వరకూ పరిశ్రమలున్నాయి. వీటిలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. స్థానికంగా సరైన వైద్య సదుపాయాలు కూడా లేవు. పైడిభీమవరంలో 2010లో కార్మికుల సౌకర్యార్థం ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కానీ వైద్యులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించక పోవడంతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. పరిశ్రమల్లో ఏ ప్రమాదం జరిగినా మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను విజయనగరం తరలిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 22,800మంది కార్మికులు గుర్తింపు పొందారు. వారి మూలవేతనం నుంచి 1.75 శాతం ఈఎస్‌ఐకి వెళ్తుంది. యాజమాన్యాలు సైతం కొంత మొత్తాన్ని భరిస్తున్నాయి. కానీ ఈఎస్‌ఐ సేవలు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. సకాలంలో అత్యవసర వైద్యం అందక చాలామంది మృత్యువాత పడుతున్నారు. అందుకే తక్షణం 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రితో పాటు అత్యాధునిక వైద్యసదుపాయాలు అందుబాటులోకి తేవాలని కార్మికులు కోరుతున్నారు. కార్మిక చట్టాలను పటిష్ఠంగా అమలుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- అమ్మో క్వారీలు..

జిల్లాలో వంద వరకూ క్వారీలు నడుస్తున్నాయి. అందులో అనుమతి ఉన్నవి కొన్నే. ప్రధాన రాజకీయ కుటుంబాలకు చెందిన వారి చేతిలో క్వారీలు ఉన్నాయి. అక్కడ ప్రమాదాలు జరిగి కార్మికులు మృత్యువాత పడుతున్నా బయటకు రాకుండా మేనేజ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. టెక్కలి, నందిగాం, పొందూరు, కంచిలి, పలాస మండలాల్లో క్వారీల నిర్వహణ అధికం. ఇక్కడ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. కానీ వెలుగుచూసిన ఘటనలు కొన్నే. రాజకీయ జోక్యంతో అధికారులు అటువైపుగా చూడడం లేదన్న విమర్శలున్నాయి. అనుమతి లేకుండా క్వారీలు నిర్వహిస్తున్నా.. కార్మికులకు భద్రత లేకపోయినా కనీస చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

కార్మికశాఖ పట్టించుకోవాలి

జిల్లాలో కార్మిక శాఖ ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. పరిశ్రమలు మూతపడుతున్నా పట్టించుకోవడం లేదు. కార్మిక చట్టాలను అమలు చేయకపోయినా చర్యలు తీసుకోవడం లేదు. కనీసం పరిశ్రమల్లో భద్రతా చర్యలు ఎలా ఉన్నాయో తనిఖీ చేసేందుకు కూడా ముందుకు రాకపోవడం దారుణం. ఇప్పటికైనా దృష్టిపెట్టాలి.

- సీహెచ్‌ అమ్మన్నాయుడు, సీటూ నాయకుడు

................................

గాలికొదిలేశారు

కార్మికుల భద్రతను గాలికొదిలేస్తున్నారు. పరిశ్రమల వద్ద కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదు. క్వారీలు సైతం ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు కోల్పోయే సమయంలో.. రేటు కట్టి చేతులు దులుపుకొంటున్నారు. కార్మిక చట్టాలు అమలుకావడం లేదు. చనిపోతున్నా పరిహారం దక్కడం లేదు.

- పి.తేజేశ్వరరావు, సీటూ నాయకుడు

Updated Date - Jul 04 , 2024 | 11:24 PM

Advertising
Advertising