ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అరసవల్లి.. ఆ ఐదేళ్లు!

ABN, Publish Date - Aug 21 , 2024 | 11:34 PM

వైసీపీ పాలనలో అరవసల్లి ఆదిత్యుడి ఆలయ ప్రతిష్ఠ మసకబారింది. గత ఐదేళ్లూ కనీస స్థాయిలో అభివృద్ధి కరువైంది. దీనికితోడు రాజకీయ జోక్యం, అధికారుల తీరు విమర్శలకు దారి తీసింది. ఫలితంగా దైవదర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

అరసవల్లి ఆదిత్యుడి ఆలయం

- ఆలయ అభివృద్ధి పట్టని గత వైసీపీ సర్కారు

- శంకుస్థాపనకే పరిమితమైన పుష్కరిణి పనులు

- కారుచౌకగా దేవస్థానం భూములు లీజుకు..

- దుకాణాల అద్దెలు కూడా నామమాత్రమే..

- అప్పటి అధికారుల తీరుపై తీవ్రమైన విమర్శలు

- కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని భక్తుల విజ్ఞప్తి

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

దేశంలో ప్రాశస్త్యం కలిగిన దేవాలయాల్లో అరసవల్లి శ్రీసూర్యభగవానుడి ఆలయం ఒకటి. ప్రత్యక్షదైవంగా భావించే ఆదిత్యుడ్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆలయం ఈసమెత్తు కూడా అభివృద్ధి చెందలేదు. పైగా రాజకీయ జోక్యంతో ఆలయ అధికారుల అక్రమాలు చర్చనీయాంశమయ్యాయి. ఆలయ అభివృద్ధి లేక.. భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం.. కేవలం సమీక్షలతో కాకుండా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.

......................

వైసీపీ పాలనలో అరవసల్లి ఆదిత్యుడి ఆలయ ప్రతిష్ఠ మసకబారింది. గత ఐదేళ్లూ కనీస స్థాయిలో అభివృద్ధి కరువైంది. దీనికితోడు రాజకీయ జోక్యం, అధికారుల తీరు విమర్శలకు దారి తీసింది. ఫలితంగా దైవదర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆదిత్యుడి ఆలయాన్ని ఏడో శతాబ్దంలో నిర్మించారు. ఏడాదికి రెండుసార్లు ఆలయంలో స్వామి మూలవిరాట్‌ను నేరుగా సూర్యకిరణాలు తాకుతాయి. ఏటా రథసప్తమి నాడు లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. చైత్ర శుద్ధ ఏకాదశి, స్వామి వార్షిక కళ్యాణం, కార్తీక శుద్ధ ద్వాదశి, తెప్ప తిరునాళ్లు, మాఘ శుద్ధ సప్తమి వంటి రోజుల్లోనూ భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కాగా.. ఆలయానికి స్థిర ఆస్తులున్నా, మరోవైపు ఆదాయం వస్తున్నా.. ఆ స్థాయిలో మాత్రం భక్తులకు సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- ఆదాయం.. భూముల వివరాలివీ...

ఆదిత్యుడి పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.42,52,41,667 డిపాజిట్‌ ఉంది. అలాగే ఆదిత్యుని ఆలయానికి భక్తులు, దాతల నుంచి 2020-21 సంవత్సరంలో రూ.7.42కోట్లు, 2021-22లో రూ.2.41కోట్లు, 2022-23లో రూ.6.61కోట్లు, 2023-24లో రూ.8.41కోట్లు ఆదాయం లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2024-25) రూ.11.26కోట్లు ఆదాయం చేకూరనుందని ఆలయ అధికారులు అంచనా వేశారు. భూముల విషయానికొస్తే.. మొత్తం 83.99 ఎకరాలు ఉన్నాయి. ఇందులో అర్చకుల ఆధ్వర్యంలో 57.44 ఎకరాల భూములు ఉన్నాయి. అర్చక సిబ్బందికి వేతనాలు ఉండవు. ఈ భూములపై వచ్చే ఫలసాయంపైనే వారు ఆధారపడతారు. ఈ భూములను సర్వీసు ఈనాముగా గుర్తించారు. వీటిపై ఎటువంటి ఆదాయం దేవస్థానానికీ ఉండదు.

- కారుచౌక భూములంటే ఇవే సుమీ...

ఆదిత్యుడి దేవస్థానానికి చెందిన మిగిలిన 26.55 ఎకరాలు శ్రీకాకుళం చుట్టుపక్కనే ఉన్నాయి. సాగునీటి సౌకర్యం కూడా ఉన్న ఈ విలువైన భూములను అత్యంత కారుచౌకగా లీజుదారులకు కట్టబెట్టేశారు. ఏడాదికి ఈ భూమి ద్వారా వచ్చే లీజు కేవలం రూ.2,07,200 మాత్రమే. అంటే ఎకరాకు కేవలం రూ.7969 మాత్రమే. ఏళ్ల తరబడి సాగుచేస్తున్న వారికే లీజుకు ఇచ్చేసి.. అనధికారికంగా ఆదాయం దేవస్థానానికి సమకూరకుండా అధికారులే యత్నిస్తున్నారు. లీజు పెంపుపై ఆలోచన కానీ, ప్రతిపాదన కూడా చేయడం లేదు. ఇటీవల సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు.. ఇదే విషయమై ఆదిత్య ఆలయ ఈవోను తూర్పారబట్టేశారు. ఏకపక్షంగా ఆలయ భూములు లీజుకు ఇస్తూ.. వాటిని పొడిగిస్తూ.. తెరవెనుక అధికారులు లబ్ధి పొందుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఆదిత్యుడి ఆలయానికి ఎదురుగా దేవస్థానానికి చెందిన దుకాణాలు ఉన్నాయి. వీటిని కూడా నామమాత్రపు అద్దెతోనే.. ఎటువంటి వేలంపాట వేయకుండా గతంలో ఉన్నవారికే కట్టబెడుతున్నారు. ఇందులో అభిమానులు ఉంటే వారికి దుకాణం కేటాయించి.. పెద్దమనసు చాటుకుంటున్నారు అధికారులు. మొత్తం పది దుకాణాలు ఉండగా.. వాటి ద్వారా ఏడాదికి వచ్చే ఆదాయం రూ.6.56 లక్షలు మాత్రమే. అంటే ఒక్కో దుకాణానికి నెలకు రూ.5,470 చొప్పున చెల్లిస్తున్నట్లు స్పష్టమవుతోంది. శ్రీకాకుళం నగరానికి దూరంగా కూడా ఇంత చౌకగా దుకాణాలు అద్దెకు లభించవు.

- మూలకు చేరిన ‘మాస్టర్‌ ప్లాన్‌’...

2014-2019 మధ్య కాలంలో అప్పటి సీఎం చంద్రబాబు.. అరసవల్లి ఆదిత్యుడి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. 2016లో ఆలయాన్ని స్వయంగా పరిశీలించి మాస్టర్‌ప్లాన్‌పై ఆయన చర్చించారు. తక్షణమే చర్యలు తీసుకుని ప్రతిపాదన పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. తిరుపతి మాదిరి ఆలయంతోపాటు.. అన్ని మాఢవీఽధులు స్పష్టంగా కనిపించేందుకుగాను మొత్తం 6.67 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇందులో దేవస్థానానికి చెందిన 4.05 ఎకరాలు.. డీసీఎంఎస్‌కు చెందిన 2.07 ఎకరాలు.. ప్రైవేటు భూమి 0.55 సెంట్లు మాత్రమే గుర్తించి ప్రణాళిక సిద్ధం చేశారు. దశలవారీగా మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేసేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఫేజ్‌-1లో కేవలం 0.25ఎకరాల విస్తీర్ణంలో దేవాలయానికి ఎదురుగా నివసిస్తున్న 11 కుటుంబాలకు మరోచోట భూమిని సమకూర్చి వారిని అక్కడకు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఫేజ్‌-2లో 2.07 ఎకరాల ప్రైవేటు భూమిని పుష్కరిణి అభివృద్ధి కోసం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం అప్పట్లో ఆర్డీఓ ద్వారా ప్రతిపాదన పంపారు. ఫేజ్‌-3లో టీటీడీ భవనాన్ని కూల్చివేసి.. మాఢవీధులకు ఆనుకుని ఉన్న 52 ఇళ్లను ఖాళీచేయించి.. వారికి సరైన పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇది అమలు చేయలేకపోయారు. ప్రతిపాదనలతోనే అన్ని దశలు ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆదిత్యుని అభివృద్ధే మరిచింది. మాస్టర్‌ప్లాన్‌ను మూలకు చేర్చేసింది.

- చుక్కనీరు లేని ఇంద్రపుష్కరిణి...

ఆదిత్యుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఇంద్ర పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేవారు. కానీ, ప్రస్తుతం పుష్కరిణిలో చుక్కనీరు కూడా లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. రెవెన్యూమంత్రి హోదాలో ఇంద్ర పుష్కరిణి పనులను చేపట్టేందుకు గతేడాది ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. రూ.3,28,64,208 నిధులతో పుష్కరిణిని ఆధునికీకరించేందుకు కార్యాచరణ ఆరంభించారు. కర్ణాటకకు చెందిన ఓ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. పనులు మాత్రం పది శాతం కూడా చేపట్టలేదు. మళ్లీ ప్రతిపాదనలు మార్చి గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వానికి పంపారు. కానీ కార్యరూపం దాల్చలేదు. వైసీపీకి చెందిన వీర అనుచరులు.. దేవస్థానంలో పాలకమండలి సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. చేసిన అభివృద్ధి మాత్రం సున్నా.

- ఉన్నతాధికారి తీరుపై విమర్శలు

ఆదిత్యుడి ఆలయంలో ప్రస్తుతం ఓ ఉన్నతాధికారి అత్యంతగా విమర్శలు పాలవుతున్నారు. అనుమతులు లేకుండా అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నవారితో చెట్టాపట్టాలేసుకుంటూ.. పలుకుబడి ఉపయోగించుకుని తిష్ట వేసిన రిటైర్డ్‌ ఉద్యోగితో అక్రమాలకు పాల్పడుతున్నారని విశ్వసనీయ సమాచారం. చాన్నాళ్ల కిందట తొలగించిన ఓ ఉద్యోగిని వెంటబెట్టుకుని ఇటీవల విజయవాడ వెళ్లారు. అంతకుమునుపు తొలగించిన తాత్కాలిక ఉద్యోగులను కొంతమందిని విధుల్లోకి తీసుకోవాలని దేవదాయశాఖ ఉన్నతాధికారులను కోరినట్లు సమాచారం. సిబ్బంది వెర్సస్‌ ఉన్నతాధికారి అన్నట్లుగా అక్కడ పరిస్థితి తయారైంది. ఆదిత్యుని ఆలయ అభివృద్ధిపై కాకుండా.. వ్యక్తిగత శ్రద్ధ చూపుతూ.. దుకాణాలు, భూముల వేలం విషయాల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందని భక్తులు పేర్కొంటున్నారు. మంత్రి, ప్రజాప్రతినిధులు స్పందించి ఆలయ అభివృద్ధిపై శ్రద్ధ చూపాలని కోరుతున్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:34 PM

Advertising
Advertising
<