అక్టోబరుకు.. పూర్తయేనా?
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:57 PM
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో టిడ్కో(టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) గృహాలను అక్టోబరు నాటికి లబ్ధిదారులకు అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కావస్తున్నా.. ఇప్పటివరకూ అంగుళం పని కూడా జరగలేదు.
- అంగుళం కూడా కదలని అభివృద్ధి
- ఇదీ టిడ్కో గృహాల పరిస్థితి
పలాస, సెప్టెంబరు 10: పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో టిడ్కో(టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) గృహాలను అక్టోబరు నాటికి లబ్ధిదారులకు అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కావస్తున్నా.. ఇప్పటివరకూ అంగుళం పని కూడా జరగలేదు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తేనే.. పనులు పూర్తయ్యే పరిస్థితి నెలకొంది. 2014-19 సంవత్సరాల మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం పలాస-కాశీబుగ్గ మునిసిపల్ ప్రజల కోసం జాతీయరహదారి బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో మొత్తం 1968 గృహాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల భాగస్వామ్యంతో సరసమైన గృహాలు (అఫ్రెడబుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్‌షిప్-ఏహెచ్‌పీ) నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు టాటా నిర్మాణ సంస్థకు పనుల బాధ్యతను అప్పగించింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణ పనుల్లో మతలబు ఉందంటూ.. టెండర్లు రద్దు చేసింది. రివర్స్ టెండర్లకు శ్రీకారం చుట్టింది. అప్పటికే 980 గృహాల నిర్మాణం 80 శాతం వరకూ పూర్తయ్యాయి. వాటినే పూర్తి చేసి ఇచ్చేందుకు లబ్ధిదారుల నుంచి బ్యాంకు ఖాతాలు ప్రారంభించి వారికి రుణాలు మంజూరు చేసింది. లబ్ధిదారులు ప్రతినెలా వడ్డీ, అసలు కట్టుకుంటున్నారు తప్ప.. పనులు మాత్రం ఇప్పటికీ జరగడం లేదు. గత ఐదేళ్లలో రహదారులు, కాలువలు, మరుగుదొడ్లూ, విద్యుత్ దీపాలు, తాగునీరు ఊసే లేకుండా పోయింది. పూర్తయిన గృహాల్లోకి ఎవరూ వెళ్లకుండా రేకులు వేసి జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం నిర్మాణ ప్రాంతంలో కేవలం సెక్యూరిటీగార్డులు తప్ప కార్మికులు ఎవరూ లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గృహాల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ నాటికి ఒక కొలిక్కి తీసుకువస్తామని కాంట్రాక్టర్లు హామీ ఇచ్చినా ఆ మేరకు పనులు సాగకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. లబ్ధిదారులు ప్రతిరోజు ఆ గృహ సముదాయానికి వెళ్లి పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలిస్తు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Updated Date - Sep 10 , 2024 | 11:57 PM