శాంతిని ట్రాప్ చేశారు
ABN, Publish Date - Jul 25 , 2024 | 04:00 AM
విశాఖలో రూ.వెయ్యికోట్ల భూమిని కాజేసేందుకే దేవదాయశాఖ సహాయ కమిషనర్ అయిన తన భార్య శాంతిని ట్రాప్ చేశారని ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపించారు.
వెయ్యి కోట్ల భూములు కాజేశారు
ఇది సాయిరెడ్డి, సుభాష్ కుట్ర
శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపణలు
న్యూఢిల్లీ, జూలై 24(ఆంధ్రజ్యోతి): విశాఖలో రూ.వెయ్యికోట్ల భూమిని కాజేసేందుకే దేవదాయశాఖ సహాయ కమిషనర్ అయిన తన భార్య శాంతిని ట్రాప్ చేశారని ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, అప్పటి ప్రభుత్వ లాయర్ పోతిరెడ్డి సుభాష్ ఈకుట్ర చేశారన్నారు. బుధవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జగన్ నిరసన శిబిరానికి వంద మీటర్ల దూరంలోనే... ఆయన ఆందోళన చేపట్టారు. ‘‘వైఎస్ జగన్ డౌన్ డౌన్.. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి.. నా బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి తండ్రెవరో తేల్చాలి’’ అంటూ నినాదాలు చేశారు. విజయ సాయిరెడ్డిని పక్కనే పెట్టుకుని ధర్నా చేస్తున్న జగన్ తనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ.. ఆయనను కలిసేందుకు వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డిపై మదన్ మోహన్ తీవ్రమైన విమర్శలు చేశారు. ‘‘నా భార్య శాంతి దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా చేస్తోంది. అందుకే ఒక పథకం ప్రకారం ఆమెను ట్రాప్ చేశారు. రూ.1000కోట్ల భూములను కాజేయాలనే కుట్రతో మొదటి పోస్టింగ్ విశాఖలోనే ఇచ్చారు. శాంతిని మభ్యపెట్టి ప్రేమ సమాజంలోని భూములను 33 నుంచి 99 ఏళ్ల లీజులకు రాయించుకున్నారు. ఆమెను ప్రలోభ పెట్టి బిడ్డను కన్నారు. విజయసాయిరెడ్డి సలహా మేరకు.. నాతో విడాకులు తీసుకున్నట్టు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారు. భూ కుంభకోణం బయటికి వస్తుందనే భయంతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కలుస్తాం. మాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తాం’’ అని మదన్ మోహన్ పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి ఏ తప్పూ చేయకపోతే డీఎన్‌ఏ పరీక్షకు ఎందుకు ఒప్పుకోవడం లేదని నిలదీశారు. తక్షణమే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాయి రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
Updated Date - Jul 25 , 2024 | 07:37 AM