బెజవాడ అనుభవంతో భద్రం!
ABN, Publish Date - Sep 09 , 2024 | 03:57 AM
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
భారీ వర్షాలతో ఉత్తరాంధ్రకు వరద ముప్పు
ప్రాణ, ఆస్తి, పంట నష్టం తగ్గించాలి
ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు
ఆహార సరఫరాకు డ్రోన్లు వాడండి
ఏలేరు ప్రాజెక్టు వద్ద గట్టి చర్యలు
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం టెలికాన్ఫరెన్స్
అమరావతి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడ వరదను గమనంలో ఉంచుకుని ముందస్తు చర్యలను వేగంగా తీసుకోవాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపాలని కోరారు. ఆదివారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదల ప్రభావం కనిపిస్తోంది. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తం కావాలి. నాగావళి, వంశధార నదులకు వరద పెరిగే అవకాశం ఉంది. ఏలేరు రిజర్వాయర్‌కు ఎక్కువ వరద నీరు రావొచ్చు. ప్రాజెక్ట్‌లోకి వచ్చే ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని, సమర్థవంతంగా వ్యవహరించాలి. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలి. భారీ, అతిభారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, మెడికల్ క్యాంప్‌లను సిద్ధం చేయాలి. ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ, ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలి. ముందస్తు చర్యలతో ఆస్తి నష్టాన్ని తగ్గించాలి. పంట నష్టం అంచనా, బాధితులకు ఆహార సరఫరా, వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లు వినియోగించాలి. ప్రభావిత ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. అక్కడ వారికి అన్ని వసతులు కల్పించాలి. పరిస్థితి తీవ్రతను బట్టి, సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ టీమ్‌ను సంప్రదించాలి. ఏజెన్సీలో వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలి. వినాయకుని నిమజ్జనం కోసం చెరువులు, కాలువల వద్దకు వెళ్లే భక్తులు, ప్రమాదాలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలవారీగా వర్షపాతం వివరాలను సీఎంకు కలెక్టర్లు వివరించారు. బాపట్ల జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో పెరుగుతున్న బాధితులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు పెంచుతున్నామని ఆ జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. రెండువేల మందికి పైగా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం అందిస్తున్నామని ఏలూరు కలెక్టర్ కె. వెట్రి సెల్వీ చెప్పారు. విజయనగరంజిల్లాలో భారీ వర్షాలకు అనుగుణంగా రాకపోకలను నియంత్రిస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ వివరించారు.
పండుగ రోజూ పరామర్శలే
ముఖ్యమంత్రి చంద్రబాబు వినాయకచవితి పండుగ రోజు కూడా వరద బాధితులను పరామర్శించేందుకు విజయవాడలో పర్యటించారు. సింగ్‌నగర్‌లో వరదనీరు ఉండటంతో పొక్లెయిన్ ఎక్కి మారుమూల ముంపు ప్రాంతాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఓవైపు వర్షం.. మరోవైపు వరద నీటిలోనే సుమారు మూడు గంటలపాటు సీఎం పర్యటన కొనసాగింది. బాధితులు తమ కష్టాలను ఆయనకు చెప్పుకొన్నారు. తీవ్రంగా నష్టపోయామని, ఇంట్లో ఉన్న వస్తువులు, వాహనాలు అన్నీ దెబ్బతిన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గండ్లు పూడ్చివేయడంతో వరద నీరు ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుందని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని చంద్రబాబు....బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం కాన్వాయ్‌లో తిరిగి విజయవాడ కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు
ప్రభుత్వ కృషిని ప్రశంసించిన అబ్దుల్ నజీర్
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఇక్కడ కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌తో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. విజయవాడ నగరాన్ని కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తడంతో ఆయన గవర్నర్‌ను కలసి ఈ పరిణామాలను వివరించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరదల వల్ల జరిగిన నష్టం, బాధితులను ఆదుకోవడానికి తాము తీసుకొన్న చర్యలను చెప్పారు. ప్రభుత్వం సత్వరం స్పందించి యుద్ధ ప్రాతిపదికన బాధితులను ఆదుకోవడానికి తీసుకొన్న చర్యలను గవర్నర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడాన్ని మెచ్చుకొన్నారు. త్వరలోనే ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనగలవన్న ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు.
Updated Date - Sep 09 , 2024 | 03:57 AM