‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పేరు తొలగింపు
ABN, Publish Date - Jul 12 , 2024 | 04:14 AM
రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణ పథకానికి గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పేరును కొత్త ప్రభుత్వం తొలగించింది.
పేదల ఇళ్లపై జగన్ బొమ్మలున్న లోగోలు, వైసీపీ రంగులు నిలిపివేత
అమరావతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణ పథకానికి గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పేరును కొత్త ప్రభుత్వం తొలగించింది. పూర్తయిన పేదల ఇళ్లపై జగన్ బొమ్మతో ఉన్న లోగోలు అతికించడం, గత ప్రభుత్వ హయాంలో వేసిన నిర్దిష్ట రంగులను కూడా తక్షణమే నిలిపివేయాలని అన్ని జిల్లాల హౌసింగ్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. హౌసింగ్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌తోపాటు, కార్పొరేషన్ ద్వారా జారీ చేసే లబ్ధిదారుల కార్డులు, పాస్‌పుస్తకాలు, సర్టిఫికెట్లపై కూడా జగన్ బొమ్మలు, వైసీపీ జెండా రంగులు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, పేదల ఇళ్ల పథకాలకు కొత్త పేర్లు పెట్టే వరకు 2019కి ముందున్న పాత పేర్లను పునరుద్ధరించాలని హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు సూచించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లను మార్చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్, ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ పథకాలను గత ఐదేళ్లూ వైఎ్‌సఆర్ రూరల్ హౌసింగ్, వైఎ్‌సఆర్ స్పెషల్ హౌసింగ్ పేర్లతో అమలు చేశారు. ఈ రెండు పథకాలను మళ్లీ పాత పేర్లతోనే అమలు చేయనున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఇక మీదట ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్’ (ఓటీఎ్‌స)గా అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన లే-అవుట్ల వద్ద ‘వైఎ్‌సఆర్ జగనన్న కాలనీ’ పేరుతో స్వాగత ద్వారాలు (ఆర్చిలు) నిర్మించారు. ఇక మీదట ఈ పేర్లను కూడా నిలిపివేయనున్నారు.
Updated Date - Jul 12 , 2024 | 07:08 AM