రబీ కరువు నష్టంపై నివేదిక సిద్ధం
ABN, Publish Date - Jun 22 , 2024 | 02:59 AM
రాష్ట్రంలో 2023-24 రబీ సీజన్‌లో ఏర్పడిన కరువు పరిస్థితులపై కేంద్ర బృందం అధ్యయనం చేసి, నివేదికను తయారు చేసింది.
ఆరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన
319.77కోట్ల సాయం కోరిన రాష్ట్ర విపత్తుల శాఖ
అమరావతి, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2023-24 రబీ సీజన్‌లో ఏర్పడిన కరువు పరిస్థితులపై కేంద్ర బృందం అధ్యయనం చేసి, నివేదికను తయారు చేసింది. కేంద్ర రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి రితే్‌షచౌహాన్ నేతృత్వంలోని బృందం నాలుగు రోజుల పాటు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో పర్యటించింది. శుక్రవారం విజయవాడలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమై, కరువు పరిస్థితులను వివరించారు. ఈ సందర్బంగా కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ మాట్లాడుతూ ‘క్షేత్రస్థాయిలో కరువు వల్ల నష్టం వివరాలను ఫొటో ప్రదర్శన ద్వారా, రైతులతో మాట్లాడి తెలుసుకున్నాం. కేంద్రానికి నివేదిక అందజేస్తాం. వీలైనంత మేర బాధిత రైతుల్ని అన్ని విధాలా ఆదుకునేలా చూస్తాం’ అని చెప్పారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ ‘సాధారణం కంటే తక్కువ వర్షాల వల్ల 33ు కన్నా ఎక్కువ పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకుని, 6జిల్లాల్లో 63 తీవ్ర కరువు, 24 మండలాల్లో మధ్యస్థ కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు సత్వరమే రూ.319.77కోట్లు ఆర్థిక సహాయం కావాలి. ఉపాధి హామీ పథకం కింద అదనంగా మరో 50 పని దినాలు కరువు ప్రాంతం కూలీలకు కల్పించాలి’ అని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2024 | 07:51 AM