పలకల పరిశ్రమ కుదేలు
ABN, Publish Date - Jun 01 , 2024 | 01:45 AM
పిల్లలకు ఓనమాలు నేర్పాలంటే ఇదివరకు గుర్తొచ్చేది రాతి పలకే. రాతి పలకల తయారీకి, దేశవిదేశాల్లో పంపిణీకి కేంద్రబిందువు జిల్లాలోని మార్కాపురం. శతాబ్దకాలం నుంచి పలకల తయారీకి దేశవ్యాప్తంగా మార్కాపురం ప్రసిద్ధిగాంచింది.
మార్కాపురం, మే 31: పిల్లలకు ఓనమాలు నేర్పాలంటే ఇదివరకు గుర్తొచ్చేది రాతి పలకే. రాతి పలకల తయారీకి, దేశవిదేశాల్లో పంపిణీకి కేంద్రబిందువు జిల్లాలోని మార్కాపురం. శతాబ్దకాలం నుంచి పలకల తయారీకి దేశవ్యాప్తంగా మార్కాపురం ప్రసిద్ధిగాంచింది. అందుకే మార్కాపురం మట్టిపలకకి మారు పేరయ్యింది. కానీ మట్టి పలక ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోతోంది. పలకల తయారీ మొదట కుటీర పరిశ్రమగా ప్రారంభమైంది. రాసే పలకలకి గిరాకీ పెరగడంతో బడా వ్యాపారవేత్తలు కూడా రంగప్రవేశం చేశారు. తదనంతర అతిపెద్ద పరిశ్రమలు వెలశాయి. ఈ పలకల్ని విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. సుమారు 200ల ఫ్యాక్టరీలు నెలకొల్పారు. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 వేల మంది కూలీలు ఆధారపడి జీవించే వారు.
ఎనామిల్ పలకల తయారీ...
పలకల పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతున్న కాలంలో ఎనామిల్, హార్డ్‌బోర్డు పలకలు మార్కెట్‌లో రంగప్రవేశం చేశాయి. ఇక్కడ కూడా కొందరు ఎనామెల్ పలకల తయా రీ మొదలుపెట్టారు. కాని వాటి తయారీకి అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దానివల్ల ఆ వ్యాపారం లాభసాటిగా లేకపోవటంతో తయారీ ఆగిపోయింది.
కుటీర పరిశ్రమనుంచి పారిశ్రామికవాడ వరకు
మార్కాపురంలో వ్యాపారం ఊపందుకోవడంతో పరిసర ప్రాంతాలలో కూడా రాతిగనుల కోసం అన్వేషణ మొదలైంది. ఆ పట్టణ పరిసరప్రాంతాల్లోని మండలాల్లోనే కాకుండా గుంటూరు, నల్గొండ జిల్లాలలో కూడా ఈ రాతి నిక్షేపాలను గుర్తించారు. ఆయా ప్రాంతా ల్లో కూడా డిజైన్ స్లేట్ పరిశ్రమల్ని నెలకొల్పారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో బేస్తవారిపేట, తర్లుపాడు, త్రిపురాంతకం, దొనకొండ, దర్శి, గుంటూరు జిల్లాలో రేమిడిచర్ల, మాచర్ల, నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో ఈ పరిశ్రమలున్నాయి. మూడు జిల్లాల్లో కలిపి సుమారు మూడే వేల ఎకరాల్లో పలకల గనులు విస్తరించి ఉన్నాయి.
ఆర్థిక మాద్యంతో కుదేలైన పరిశ్రమ
2010లో అమెరికాలో ఏర్పడ్డ ఆర్థికమాద్యంతో పలకల పరిశ్రమ మొట్టమొదటిసారిగా కుందేలైంది. అప్పటి వరకు రోజుకు సుమారు 50 లారీల పలకలను ఎగుమతి చేస్తున్న వ్యాపారవేత్తలు నెలకు 50 లారీలు కూడా ఎగుమతి చేయలేని పరిస్థితికి పడిపోయారు. దీంతో గనుల నుంచి ముడిరాయిని వెలికి తీసేందుకు వ్యాపారవేత్తలు ఆసక్తి చూపలేదు. దీంతో గనులలో పనిచేసే కూలీలు ఉపాధి కోల్పోయారు. పనుల కోసం వలసలు వెళ్లారు. ముడిసరుకు లేని కారణంగా చాలా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీంతో పలక ఫ్యాక్టరీలలో పని చేసే వారి పరిస్థితి కూడా అదే విధంగా తయారైంది. దీనికి తోడు అనుబంధ పారిశ్రామికవేత్తలైన చెక్కపెట్టెల తయారీదారులు కూడా తమ ఫ్యాక్టరీలను మూసివేశారు.
పడి లేచిన తీరు...
కనుమరుగవుతున్న మార్కాపురం పలకల పరిశ్రమ లోకి ప్రవేశించి ఈ పలకలను రాసే పలకల్నించి రంగు రంగుల హరివిల్లులు తయారు చేయవచ్చని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి రాష్ట్ర మాజీ మంత్రి ఎం.మాణిక్యరావు. డిజైన్ స్లేట్ వ్యాపారం లాభాలను గడిస్తుండడంతో అప్పటి వరకూ రాసే పలకల వ్యాపారంలో ఆరితేరిన నలుగురు పారిశ్రామికవేత్తలు కూడా డిజైన్‌స్లేట్ రంగంలోకి మారారు. పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కూడా డిజైన్ స్లేట్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఫ్యాక్టరీలు మూతపడటం వల్ల ఉపాధి కోల్పోయిన వారంతా తిరిగి డిజైన్ స్లేట్ పరిశ్రమలోకి ప్రవేశించారు.
నాలుగురెట్లు పెరిగిన డెడ్ రెంట్
మార్కాపురం పారిశ్రామిక వాడలో ప్రస్తుతం సుమారు 60 ఫ్యాక్టరీలలో డిజైన్ పలకల ఉత్పత్తి జరుగుతోంది. పలకల గనులలో వచ్చే ముడి సరుకుపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెడ్‌రెంట్ విపరీతంగా పెంచింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో హెక్టారుకు ఏడాదికి రూ.15 వేలుగా ఉన్న డెడ్‌రెంట్ ప్రస్తుతం రూ.65 వేలకు పెంచింది. క్వారీల యజమానులకు టీడీపీ హయాంలో టన్నుకు చెల్లిస్తున్న రాయల్టీ రూ.6500 నుంచి రూ.13000లకు చేరింది.
పెరిగిన రవాణా చార్జీలు
డీజిల్ రేటు రోజురోజుకూ మారుతుండటంతో రవాణా చార్జీలు సైతం పెరిగిపోయాయి. మార్కాపురం నుంచి చెన్నై ఎయిర్ పోర్టుకు చేరేందుకు ఒక టన్నుకు రూ.1450 లు వసూలు చేస్తున్నారు. ఒక కంటైనర్‌ను నింపాలంటే 24 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉంది. విదేశాలకు రవాణా చార్జీలు సైతం ఆకాశాన్ని అంటాయి. ఒక కంట్తెనర్ అమెరికాకు పంపించడానికి గతంలో 1200 డాలర్లు చెల్లిం చాల్సి ఉండగా ప్రస్తుతం 7500 డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అదే బ్రిటన్‌కు గతంలో 800 డాలర్లు చెల్లిస్తుండగా ప్రస్తుతం 6000 డాలర్లు చెల్లించాల్సి వస్తుంది.
ముందుకు రాని బయ్యర్లు
పలకల ఉత్పత్తి వ్యయాలు, రవాణా చార్జీలు, కూలీ చార్జీలు పెరిగిన నేపధ్యంలో ఉత్పత్తిదారులు ఒక చదరపు అడుగుకు రూ.150లు పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం రూ.10లు పెంచితేనే పలకల కొనుగోలుకు విముఖత చూపే బయ్యర్లు ప్రస్తుతం పలకలకు యజమానులు సూచించే రేట్లకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
Updated Date - Jun 01 , 2024 | 01:45 AM