‘పోల్’మంటూ పల్లెకు ప్రజలు
ABN, Publish Date - May 13 , 2024 | 01:03 AM
ఉద్యోగ, ఉపాధి కోసం పట్టణాలకు తరలివెళ్లిన స్థానికులు తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు స్వగ్రామాలకు తరలి వస్తున్నారు.
గిద్దలూరు, మే 12 : ఉద్యోగ, ఉపాధి కోసం పట్టణాలకు తరలివెళ్లిన స్థానికులు తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు స్వగ్రామాలకు తరలి వస్తున్నారు. రైళ్లు, బస్సుల ద్వారా, ప్రైవేటు వాహనాల ద్వారా స్వగ్రామాలకు వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర పట్టణాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలతోపాటు ఇతర ఉద్యోగాలు, కంపెనీలలో పని చేసే అన్ని విభాగాల కూలీలు గత రెండు రోజులుగా స్వగ్రామాల బాట పట్టారు. కాచీగూడ నుండి గిద్దలూరుకు వచ్చిన రైలులో 70శాతం మంది గిద్దలూరు ప్రాంతవాసులే కావడం గమనార్హం. దీంతో రైల్వేస్టేషన్ నుంచి గుంపులు గుంపులుగా తమ గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్నారు. అయితే ఆర్టీసీ బస్సులను ఎన్నికల సామగ్రి తరలించేందుకు, సిబ్బందిని తరలించేందుకు ఏర్పాటు చేయడంతో ఉన్న అరకొర బస్సులతో ఇక్కట్లకు గురయ్యారు. గ్రామాల నుంచి మోటార్ సైకిళ్లను తెప్పించుకొని కొందరు వెళ్లగా అధిక అద్దెలు చెల్లించి ఆటోలలో తరలివెళ్లారు. రెండు రోజులుగా గిద్దలూరు నియోజకవర్గానికి సుమారు 8 వేల మంది దాకా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కూలీలు స్వగ్రామాలకు వచ్చినట్లు తెలిసింది. సోమవారం తెల్లవారేవరకు మరో 2వేల మందికి పైగా వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికితోడు ఇరుపార్టీలు ఓటుకు నోటు అందజేయడంతో వాటిని ఖర్చు చేసేందుకు ఓటర్లు దుకాణాలకు తరలిరావడంతో పట్టణమంతా బిజీబిజీగా దుకాణాలన్నీ కిటకిటలాడుతూ కనిపించాయి.
Updated Date - May 13 , 2024 | 01:03 AM