ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
ABN, Publish Date - Sep 19 , 2024 | 12:57 AM
ల్లాలోని రెండు గ్రామ పంచాయతీల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ముగ్గురు గ్రామ పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. వాస్తవంగా ఆ ముగ్గురు కార్యదర్శులను బుధవారమే సస్పెండ్ చేసినా ఆ ఉత్తర్వులను బయటపెట్టకుండా దాచిపెట్టిన విషయంపై ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది.
ఎట్టకేలకు డీపీవో ఉత్తర్వులు
ఒంగోలు(కలెక్టరేట్), సెప్టెంబరు 18 : జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ముగ్గురు గ్రామ పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. వాస్తవంగా ఆ ముగ్గురు కార్యదర్శులను బుధవారమే సస్పెండ్ చేసినా ఆ ఉత్తర్వులను బయటపెట్టకుండా దాచిపెట్టిన విషయంపై ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీంతో ముగ్గురు కార్యదర్శుల సస్పెన్షన్ ఉత్తర్వులను ఆయా ఎంపీడీవోలకు డీపీవో పంపారు. మండల కేంద్రమైన సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.రామకోటయ్య రూ.79వేలను ఫోన్‌పే ద్వారా తన బ్యాంకు ఖాతాకు జమచేయించుకొని రికార్డులు చూపలేదు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను గ్రామపంచాయతీ రికార్డు దాఖలు లేకుండా జారీచేయడంతో రామకోటయ్యపై చర్యలు తీసుకున్నారు. మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి పి.శ్రీనివాసులు, పెదకొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-5) ఎన్.వినోద్‌ను కూడా సస్పెండ్ చేశారు. దొడ్డవరప్పాడు పంచాయతీలో ఎటువంటి ముందస్తు నోటీసులు కానీ, వార్డుసభ్యుల ఆమోదం కానీ లేకుండా ఈ ఏడాది జనవరి 12, ఈ ఏడాది ఫిబ్రవరి 23న మీటింగ్ నిర్వహించినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం పంచాయతీ తీర్మానం చేశారు. సర్పంచ్ బెజవాడ శ్రీరామమూర్తి నిబంధనలకు విరుద్ధంగా రూ.7,36,400 తన సొంత ఖాతాకు నిధులు బదిలీ చేసుకున్నట్లు ఉప సర్పంచ్ మురళి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ చేసి ఆ నిధులకు సంబంధించి నివేదిక ఇచ్చారు. పంచాయతీ నిధులకు ఆమోదం లేకుండా నిధులు డ్రా చేసేందుకు సహకరించిన గ్రామ కార్యదర్శి, డ్రాయింగ్ అధికారి అయిన పి.శ్రీనివాసులు, గ్రేడ్-5 కార్యదర్శి వినోద్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Updated Date - Sep 19 , 2024 | 12:57 AM