గాడినపడని పోలీస్!
ABN, Publish Date - Sep 11 , 2024 | 12:19 AM
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చి మూడు నెలలవుతోంది. జిల్లాకు కొత్త పోలీసు బాస్ వచ్చి రెండు నెలలవుతోంది. అయినా పోలీసు శాఖలో బదిలీల తంతు పూర్తి కాలేదు. డీఎస్పీలు, సీఐల నియామకం విషయంలో అధిష్ఠానం, ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం అందుకు కారణమైంది. ఎస్సైల బదిలీల విషయంలోనూ కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇక ఎస్పీకి తన చుట్టూ ఉన్న పరివారం తప్పుడు సమాచారం ఇస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల పోలీసులు పంచాయితీలకు తెరలేపడం, దేకనకొండలో ఇరువర్గాలు ఘర్షణ పడితే ప్రేక్షక పాత్ర వహించడం ఆశాఖ పనితీరు గాడిలో పడలేదన్నదానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
పూర్తికాని బదిలీల పర్వం
డీఎస్పీలు, సీఐల విషయంలో అధిష్ఠానం, ఎమ్మెల్యేలకు మధ్య కుదరని ఏకాభిప్రాయం
ఎస్సైలకు స్థానచలనంలోనూ అదేతంతు
కొందరి బదిలీ విషయంలో ఎమ్మెల్యేల అసంతృప్తి
పోలీసుల నిర్లక్ష్యానికి దేకనకొండ ఘటన నిదర్శనం
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చి మూడు నెలలవుతోంది. జిల్లాకు కొత్త పోలీసు బాస్ వచ్చి రెండు నెలలవుతోంది. అయినా పోలీసు శాఖలో బదిలీల తంతు పూర్తి కాలేదు. డీఎస్పీలు, సీఐల నియామకం విషయంలో అధిష్ఠానం, ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం అందుకు కారణమైంది. ఎస్సైల బదిలీల విషయంలోనూ కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇక ఎస్పీకి తన చుట్టూ ఉన్న పరివారం తప్పుడు సమాచారం ఇస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల పోలీసులు పంచాయితీలకు తెరలేపడం, దేకనకొండలో ఇరువర్గాలు ఘర్షణ పడితే ప్రేక్షక పాత్ర వహించడం ఆశాఖ పనితీరు గాడిలో పడలేదన్నదానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు అధికారుల బదిలీల విషయంలో అనేక రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గత వైసీపీ పాలనలో గాడి తప్పిన పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. తదనుగుణంగా పోలీసు అధికారుల బదిలీల్లో కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరించిన విధానం ఆ పార్టీ అధినాయకులకు, ఎమ్మెల్యేలకు మధ్య అగాధాన్ని సృష్టించింది. తొలుత డీఎస్పీలను తామే పంపుతామని ప్రకటించారు. క్రమేపీ స్ధానిక ఎమ్మెల్యేల సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే గత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిన బాధిత డీఎస్పీలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయినా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ ఇద్దరు డీఎస్పీలను మాత్రమే కొత్తగా నియమించారు. మార్కాపురం, కనిగిరి, చీరాల డీఎస్పీల విషయంలో మీనవేషాలు లెక్కిస్తున్నారు. ఆగస్టులో రిటైర్ అవుతున్న కనిగిరి డీఎస్పీని అప్పటి వరకూ కొనసాగించాలని తొలుత కనిగిరి ఎమ్మెల్యే కోరారు. ఆతర్వాత ఆయనతోపాటు కొండపికి సంబంధించిన యువనాయకుడు సత్య డీఎస్పీగా అశోక్‌వర్దన్ కావాలని కోరారు. కుదరదని అధిష్ఠానం వారి ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఆతర్వాత శ్రీనివాసరెడ్డి అనే డీఎస్పీ పేరును ప్రతిపాదించారు. ఆయన ఏఎస్పీ ప్రమోషన్‌లో ఉన్నందున వీలుకాదన్నారు. ప్రస్తుత డీఎస్పీ రిటైర్ అయినా ఇంతవరకూ కొత్త వారిని నియమించలేదు. మార్కాపురానికి గతంలో ఒంగోలు డీఎస్పీగా చేసిన కిశోర్‌ను నియమించాలని మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక బాధ్యతల్లో ఉన్న నాయకులు సిఫార్సు లేఖ పంపమనడంతో వారు పంపారు. కానీ ఇంతవరకూ ఆ డీఎస్పీ నియామకం విషయంలో కూడా స్పష్టత రాలేదు. చీరాల డీఎస్పీ విషయంలో ఇలాంటి తంతే సాగుతోంది.
ఎమ్మెల్యేల ప్రతిపాదనకు లభించని ప్రాధాన్యం
సీఐలకు సంబంధించి ఎమ్మెల్యేలు సూచించిన వారిలో చాలామందిని కాదని అధిష్ఠానం వేరే వారిని నియమించింది. అధిష్ఠానంలో పలుకుబడి ఉన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్థాయి నాయకులు సిఫార్సు చేస్తే వైసీపీ ప్రభుత్వంలో రాజ్యమేలిన వారికి మంచి పోస్టులు దొరుకుతాయనేందుకు చీమకుర్తి సీఐ విషయం ఒక దర్పణం. అలాగే కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు సూచించిన సీఐలను కాకుండా వేరే వారిని ఎంపిక చేసి పంపారు. అందులో వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు మంచి పోస్టుల్లో పనిచేసిన ఒకరిద్దరు ఉన్నారు. ఇప్పటికీ త్రిపురాంతకం, కంభంతోపాటు చీరాల, అద్దంకి నియోజకవర్గాల్లో కొన్ని సర్కిళ్లకు ఇన్‌స్పెక్టర్‌లను నియమించాల్సి ఉంది.
ఎస్సైల విషయంలో ఎస్పీపై ఎమ్మెల్యేల గుర్రు
ఎస్సైల బదిలీల విషయంలో ఎస్పీ దామోదర్‌పై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇంకా పదికి పైగా స్టేషన్‌లలో ఎస్సైల బదిలీలు జరగాల్సి ఉంది. ఈ విషయంలో ఎస్పీకి, సంబంధిత ఎమ్మెల్యేల మధ్య అంతర్గత వార్ నడుస్తోంది. మార్కాపురం నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో కూడా పూర్తిగా అప్పటి వైసీపీ అభ్యర్థులకు అనుగుణంగా వ్యవహరించారని ఒక ఎస్సైపై విమర్శలు ఉన్నాయి. అతని పనితీరుపై ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అక్కడ కొత్తగా ఎవరిని నియమించాలో మార్కాపురం ఎమ్మెల్యే ఎస్పీకి సూచించారు. కొత్తగా నియమించాల్సిన ఎస్సై విషయంలో సమస్యలు ఉన్నా పాత ఎస్సైని వీఆర్‌కు పంపాల్సిన బాధ్యత అయితే ఉంది. కానీ ఎస్పీ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో నియోజకవర్గంలో ఎస్సైల బదిలీల విషయంలో ఎమ్మెల్యే ఎంత మొత్తుకున్నా ఎస్పీ దామోదర్ నుంచి సానుకూల స్పందన రావడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎస్సైల బదిలీలపై వేగంగా స్పందించిన ఎస్పీ తమ నియోజకవర్గం విషయంలో మాత్రమే మీనమేషాలు లెక్కిస్తున్నారని ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు.
పోలీసు బాస్‌కు తప్పుడు సమాచారం
జిల్లాలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ తదితర విభాగాల్లో తిష్టవేసి కూర్చున్న కొందరు పోలీసు అధికారులు ఎస్పీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే అయితే తన నియోజకవర్గంలో ఒక ఎస్సై పోస్టు విషయంలో ఎస్పీని ఎస్‌బీ అధికారులు తప్పుదారి పట్టించారని బలంగా నమ్ముతున్నారు. అంతెందుకు పోలీసు శాఖలో పనిచేసే వారిలోనూ అలాంటి అనుమానాలు ఉన్నాయి. కొన్ని స్టేషన్‌లలో పెత్తనం చేసే సీనియర్ కానిస్టేబుళ్ల మార్పులకు కూడా ఎస్పీ నుంచి సహకారం లభించడం లేదన్న ఆవేదనను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు.
దేకనకొండ ఘటన ఒక నిదర్శనం
పోలీసు శాఖ గాడిలో పడలేదనేందుకు కురిచేడు మండలం దేకనకొండలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఘర్షణను నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ గ్రామంలో సోమవారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. వైసీపీ వర్గీయులు ముందస్తు ప్రణాళికతో దాడికి దిగారనేది జగమెరిగిన సత్యం. ఆతర్వాత పోలీసుల రంగ ప్రవేశం చేశారు. గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ మంగళవారం ఉదయం పోలీసుల సమక్షంలో అక్కడ మరోసారి ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఇది పోలీసుల నిర్లక్ష్యాన్ని, వైఫల్యాన్ని తేటతెల్లం చేస్తోంది. అందులోనూ వైసీపీ వర్గీయులు దాడికి తెగబడటం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కొన్ని పోలీసు స్టేషన్‌లలో పంచాయితీల పర్వానికి అధికారులు తెరతీశారు.
Updated Date - Sep 11 , 2024 | 12:19 AM