తూర్పున తిరుగులేదు!
ABN, Publish Date - May 16 , 2024 | 01:06 AM
ఉమ్మడి ప్రకాశంలోని తూర్పుప్రాంతంలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో అధిక శాతం టీడీపీ కూటమి కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కూటమికే అనుకూల పవనాలు
టీడీపీకంతా స్థానిక అభ్యర్థులు.. వైసీపీకి స్థానికేతరులు
ఇటు ఐక్యత.. అటు విభేదాలు
ఏడు స్థానాల్లోనూ విజయంపై తెలుగు తమ్ముళ్ల ధీమా
ఐదుచోట్ల గెలుపుపై అధికారపార్టీలో ఆశలు
ఉమ్మడి ప్రకాశంలోని తూర్పుప్రాంతంలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో అధిక శాతం టీడీపీ కూటమి కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి జనసేన, బీజేపీల కలయిక కలిసి వచ్చింది. ఆరు స్థానాలలో ఆపార్టీ స్థానిక అభ్యర్థులను రంగంలోకి దించింది. వైసీపీ స్థానికేతరులను బరిలో నిలిపింది. అన్నిచోట్లా గ్రూపు విభేదాలు అధికార పార్టీకి సమస్యాత్మకంగా మారాయి. టీడీపీ కూటమి ఐదు స్థానాల్లో విజయంపై పూర్తి నమ్మకంతోనూ, రెండు స్థానాల్లో గట్టి పోటీ మధ్య బయటపడతామని అంచనా వేస్తోంది. వైసీపీ విషయానికొస్తే అద్దంకి, పర్చూరులో విజయావకాశాలపై ఆపార్టీ నేతల్లో ఆశలు సన్నగిల్లాయి. మిగిలిన స్థానాల్లో విజయంపై నమ్మకంతో ఫలితాల వైపు చూస్తున్నారు. మొత్తం పరిస్థితిని చూస్తే చీరాల, కందుకూరులో గట్టిపోటీ జరగ్గా మిగిలిన ఐదు స్థానాల్లో టీడీపీ కూటమి అనుకూల వాతావరణం నెలకొంది. అయితే ప్రలోభాలపైనే నమ్మకంతో వైసీపీ శ్రేణులు ఉన్నాయి.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న తూర్పు ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల ఫలితాలపై యావత్తు ప్రజానీకం దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో కొత్త ప్రకాశంలో మూడు, బాపట్ల జిల్లాలో 3, నెల్లూరు జిల్లా పరిధిలో ఒకటి ఉన్నాయి. గత ఎన్నికల్లో జగన్ అనుకూల వాతావరణంలోనూ ఈ ఏడింటిలో టీడీపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకొంది. ప్రస్తుతం టీడీపీతో జనసేన, బీజేపీలు కలవడం ఉద్యోగులు, యువత, విద్యార్థులు, వ్యాపార వర్గాల్లో కూటమి అనుకూల వాతావరణం నెలకొనడం తోడైంది. అలాగే కూటమి ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాల పట్ల ఓటర్లలో ఆకర్షణ కనిపించింది. వీటికి మించి స్థానికంగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం, కూటమి పార్టీల శ్రేణులు సమష్టిగా పనిచేయడం అన్నిచోట్ల కనిపించింది. వైసీపీలో ఎక్కువచోట్ల స్థానికేతర అభ్యర్థులు కావడం, పార్టీలో నెలకొన్న అనైక్యతలు సమస్యలుగా కనిపించాయి. కొన్ని వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను వైసీపీ నేతలు అంగీకరిస్తూనే వృద్ధులు, మహిళా ఓటర్లపై నమ్మకంతో ఉన్నారు. ఎక్కువ స్థానాల్లో ఓటర్లను ప్రలోభపరిచే అంశాల్లో ముందు ఉండటంపై వైసీపీ నాయకులు ఆశలు పెట్టుకోవడం విశేషం.
ఒంగోలులో మారిన వాతావరణం
ప్రతిష్టాత్మక పోటీ జరిగిన ఒంగోలు నియోజకవర్గంలో వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బాలినేని 23వేల అధిక్యతను పొందారు. అప్పట్లో వైసీపీకి అధిక్యతను ఇచ్చిన ఉద్యోగ, వ్యాపారవర్గాలతోపాటు కాపు సామాజికవర్గ ఓటర్లలో ఈసారి భారీగా గండిపడింది. గత ఎన్నికల్లో 10వేల ఓట్లు పొందిన జనసేన, ఈ పర్యాయం టీడీపీకి గట్టి మద్దతుగా నిలిచింది. టీడీపీ అభ్యర్థి జనార్దన్ పోల్‌మేనేజ్‌మెంట్‌లో పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. వైసీపీ.. దళిత, ముస్లిం, బీసీల్లో యాదవ సామాజికవర్గ ఓటర్లలో అధిక్యత వస్తుందన్న నమ్మకంతో ఉంది. అయితే కులాలకతీతంగా ఉద్యోగ, వ్యాపారవర్గాలు, యువత, నిరుద్యోగులు టీడీపీ వైపు మొగ్గుచూపడంతో వైసీపీకి భారీ నష్టం జరిగిందని విశ్లేషకుల అంచనా. బ్రాహ్మణ ఓటర్లతోపాటు, యాదవేతర బీసీ ఓటర్లలో టీడీపీ కూటమికి ఓట్లు పెరగడం కనిపిస్తోంది. కమ్మ, కాపు, ఆర్యవైశ్యుల్లో టీడీపీ మంచి అధిక్యతను పొందినట్లు వెల్లడైంది. అభివృద్ధి అంశాలు దామచర్లకు కలిసొచ్చాయి. మరోవైపు గత నాలున్నరేళ్లలో నగరంలో జరిగిన భూదందాలు, అల్లరి మూకల ఆగడాలు, వైసీపీ శ్రేణుల దాడులు ఆ పార్టీకి కనిపించని నష్టాన్ని కలిగించింది. మొత్తంగా చూస్తే ఒంగోలురూరల్ మండలంలో టీడీపీ అధిక్యత గతంకన్నా మూడింతలు పెరగబోతుంది. కొత్తపట్నం మండలంలో గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన అధిక్యతకు భారీగా గండి పడబోతోంది. నగరం నడిబొడ్డు ప్రాంతంలోని అన్ని బూత్‌లలో టీడీపీ అనుకూల వాతావరణం కనిపించగా, శివారు కాలనీల్లో వైసీపీకి అధిక్యత వచ్చే అవకాశం ఉంది. గెలుపుపై ఇరు పార్టీల్లోనూ ధీమా ఉన్నప్పటికీ అనుహ్య పరిస్థితులు మినహా టీడీపీకే మొగ్గు కనిపిస్తోంది.
కొండపిలో మళ్లీ అదే ఫలితం
కొండపిలో ఈ పర్యాయం కూడా టీడీపీకి సానుకూలత కనిపిస్తోంది. అభ్యర్థి స్వామి స్థానికుడు కావడం, అండగా దామచర్ల కుటుంబం ఉండటం, మాగుంట రాక కలిసొచ్చింది. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు మద్దతు టీడీపీకి లాభించింది. వైసీపీ అభ్యర్ధి సురేష్ స్థానికేతరుడు కావడం, నియోజకవర్గ వైసీపీలో గ్రూపు విభేదాలు తారస్థాయిలో ఉండటం ప్రతికూల అంశాలు. డబ్బు పంపిణీలో వైసీపీ ముందు ఉన్నప్పటికీ సొంత సామాజికవర్గం ఓటర్ల మద్దతుగా వారు చేసిన ప్రయత్నం ప్రత్యర్థి సామాజికవర్గంలో ఓట్ల చీలకకు తావిచ్చింది. వైసీపీకి బలమైన సింగరాయకొండ మండలంలో ఆ పార్టీ అధిక్యతకు భారీగా గండిపడటం ఖాయంగా కనిపిస్తోంది. టంగుటూరు, జరుగుమల్లి మండలాల్లో టీడీపీకి మెజారిటీ అధికంగానే వచ్చే అవకాశం ఉంది. పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లో అధిక్యతపై వైసీపీ కూడా ఆశతో ఉన్నప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కొండపి మండలంలో టీడీపీకి స్పష్టమైన అధిక్యత కనిపిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి స్వామి గెలిచే ఆవకాశం కనిపిస్తోంది.
ఎస్‌ఎన్‌పాడులో వార్ వన్‌సైడ్
ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలో స్థానికేతరుడైన వైసీపీ అభ్యర్థి నాగార్జునకు ఆ పార్టీలో అన్ని గ్రూపుల నుంచి అవసరమైన సహకారం లభించలేదు. అసమ్మతివాదులను కలు పుకొని పోయేందుకు నాగార్జున చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించ లేదు. టీడీపీ అభ్యర్థి విజయ్‌కుమార్ కూటమి నాయకులను ఐక్యంగా నడపడంలో సఫలీకృతులయ్యారు. తెలుగు తమ్ముళ్లు పట్టుదలతో పనిచేశారు. ముఖ్యంగా చీమకుర్తి మండలంలో వైసీపీ అధిక్యతకు గండిపడింది. అక్కడ బూచేపల్లి కుటుంబం దర్శిలో రంగంలో ఉండటం అందుకు ఒక కారణం. చీమకుర్తిలో జనసేన ఓట్లు బదిలీకావడం, బూచేపల్లి వ్యతిరేకవర్గం సహకరించడం కూడా టీడీపీకి కలిసొచ్చింది. ఎస్‌ఎన్‌పాడు, ఎన్‌జీపాడు మండలాల్లో టీడీపీ కూటమికి మంచి అధిక్యత లభించబోతోంది. మద్దిపాడు మండలంలో ఇరుపార్టీల పరిస్థితి పోటాపోటీగా ఉన్నప్పటికీ ఎవరికైనా స్పల్ప అధిక్యత కనిపిస్తోంది. దీంతో సుమారు 10వేల మెజారిటీ లభిస్తుందన్న ధీమాలో టీడీపీ ఉండగా, కనీసం నాలుగు, ఐదు వేలతోనైనా బయటపడగలమన్న ఆశతో వైసీపీ వారు ఉన్నారు
అద్దంకి, పర్చూరులో...
గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన అద్దంకి, పర్చూరుల్లో ఈసారి పట్టుకోసం వైసీపీ అధినాయక త్వం ముందు నుంచి పలు ప్రయత్నాలు చేసింది. స్థానికేతరులైన అభ్యర్థులను రంగంలోకి దించగా, టీడీపీ కూటమి తిరిగి రవికుమార్, సాంబశివరావులను బరిలోకి దింపింది. అద్దంకిలో డాక్టర్ గరటయ్య వైసీపీకి రాజీనామా చేయగా, పర్చూరులో మండల, గ్రామస్థాయిల్లో పలువురు బలమైన నేతలు టీడీపీలో చేరారు. మరికొందరు సైలెంట్ అయ్యారు. ఓటర్ల ప్రభావిత చర్యలకు వైసీపీ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ టీడీపీ కూటమి నుంచి కూడా ఎక్కడా తగ్గలేదు. పోలింగ్ అనంతరం పరిణామాలను పరిశీలిస్తే.. అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ టీడీపీకి సానుకూల వాతావరణం నెలకొంది. సంతమాగులూరు మండలంలోనూ టీడీపీకే ఆధిక్యత వచ్చే అవకాశాలు న్నాయి. బల్లికురవ మండలంలో టీడీపీకి గతంలో 800 ఓట్ల మెజారిటీ రాగా, ఇప్పుడు రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంది. అద్దంకి పట్టణంలో టీడీపీ ఆధిక్యత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. పంగులూరు కొరిశపాడు మండలాల్లో మంచి మెజారిటీ లభించే అవకాశాలున్నాయి. పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలంలో వైసీపీ ఆధిక్యతకు పూర్తిగా గండిపడింది. జనసేన కలయిక, ఇతర అంశాలతో పర్చూరు, కారంచేడు మండలాల్లో టీడీపీ మెజారిటీ పెరిగే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. యద్దనపూడి మండలంలో స్థానిక పరిస్థితులు, గొట్టిపాటి వర్గీయుల్లో కూడా కొందరు అదనంగా కలిసిరావడం.. ఏలూరికి దళిత, బలహీనవర్గాల్లో పలువురు కొత్తగా మద్దతు ప్రకటించడంతో అక్కడా ఆధిక్యం లభించనుంది. . ఇంకొల్లు మండలంలో గట్టిపోటీ జరిగినప్పటికీ దగ్గుబాటి వర్గీయులు ఎక్కువమంది టీడీపీతో కలిసివచ్చారు. దీంతో నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎప్పుడూ రాని ఆధిక్యత టీడీపీకి లభించే అవకాశాలు లేకపోలేదు.
చీరాల, కందుకూరులో నువ్వానేనా..
చీరాల, కందుకూరు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మఽధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగింది. చీరాలలో త్రిముఖ పోటీ జరిగింది. వైసీపీ అభ్యర్థి వెంకటేష్, టీడీపీ అభ్యర్థి కొండయ్యయాదవ్, మధ్యలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి రంగంలోకి వచ్చారు. మూడు పార్టీల్లోనూ విజయావకాశాలపై ధీమా ఉన్నప్పటికీ త్రిముఖ పోటీ టీడీపీకి కలిసివచ్చే అవకాశాలను కొట్టేయలేమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలలో టీడీపీ, వైసీపీలు పోటీపడగా.. కాంగ్రెస్ అభ్యర్థి కొంతమేర వెనుకబడ్డారు. అయితే యాదవులు అఽధికంగా ఉండే గ్రామంలో టీడీపీ అభ్యర్థి కొండయ్య యాదవ్‌పై దాడి జరగడం బలహీనవర్గాల్లో ఆయనకు కొంత మేర కలిసొచ్చింది. పోలింగ్ చివర్లో వైసీపీ, కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణలో మునిగితేలుతుం డగా, మిగిలిన ఓట్లను పోల్ చేయించుకోవడంలో టీడీపీ సఫలీకృతమైంది. ఆర్యవైశ్యుల ఓట్లలో టీడీపీకి ఊహించిన దానికన్నా ఎక్కువే పడ్డాయి. వేటపాలెం మండలంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉండగా చీరాల మునిసిపాలిటీలో ముగ్గురు మధ్య పోటీ నడిచింది. యాదవ సామాజికవర్గం ఉన్న గ్రామాలన్నీ టీడీపీకి సానుకూలంగా మారాయి. వైసీపీ ఓట్ల చీలక కలిసిసొస్తుందన్న భావన టీడీపీ శ్రేణుల్లో విజయంపై నమ్మకాన్ని పెంచింది. కందుకూరులో వైసీపీ, టీడీపీల మధ్య గట్టిపోటీ నెలకొంది. అయితే వైసీపీ అభ్యర్థి మధుసూదన్ స్థానికేతరుడు కావడం, ప్రధానంగా బలమైనవర్గం కలిగిన ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి రంగంలో లేకపోవడం వైసీపీకి మైనస్‌లుగా మారాయి. కందుకూరు పట్టణంలో ఆర్యవైశ్య ఓటర్లు టీడీపీకి అండగా నిలిచారు. జనసేన రూపంలో కాపు సామాజికవర్గం ఓట్లు టీడీపీకి పడ్డాయి. అలాగే వలేటివారి పాలెం, లింగసముద్రం మండలంలో టీడీపీకి ఆధిక్యత వస్తుంది. గుడ్లూరు మండలంలో వైసీపీకి మెజారిటీ ఉంది. ఉలవపాడు మండలంలో ఆధిక్యతపై ఇరుపార్టీలూ విశ్వాసంతో ఉన్నాయి. రెడ్డి సామాజికవర్గానికి సంబంధించి వైసీపీ ఓట్లను టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి మార్చుకోగలిగారన్న ప్రచారం ఉంది. దీంతో టీడీపీ ఆశలు పెరిగాయి. గ్రూపులకతీతంగా నియోజకవర్గంలో బలమైన కమ్మ, యాదవ సామాజికవర్గం అభ్యర్థులను రంగంలోకి దించడంతో అంచనాల విషయంలో అందరిలోనూ తడబాటు కనిపిస్తోంది.
Updated Date - May 16 , 2024 | 01:06 AM