నిధులు ఉన్నా ఏం చేయలేరు!
ABN, Publish Date - Sep 10 , 2024 | 01:09 AM
గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రామ పంచాయతీలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తూ ఆర్థికసంఘం నిధులు ఇచ్చినా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చి పక్షం గడుస్తున్నా వాటి వినియోగానికి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించకపోవడంతో పాలకవర్గాలు ఏమీచేయలేక ఎదురుచూస్తున్నాయి.
గామ పంచాయతీల ఖాతాల్లో రూ.40 కోట్లు
డ్రా చేసేందుకు విధివిధానాలు ఇవ్వని ప్రభుత్వం
మరోసారి విద్యుత్ బిల్లులు, కార్మికులకు వేతనాలు చెల్లించే అవకాశం
పాలకవర్గాల్లో ఆందోళన
ఒంగోలు (కలెక్టరేట్), సెప్టెంబరు 9 : గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రామ పంచాయతీలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తూ ఆర్థికసంఘం నిధులు ఇచ్చినా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చి పక్షం గడుస్తున్నా వాటి వినియోగానికి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించకపోవడంతో పాలకవర్గాలు ఏమీచేయలేక ఎదురుచూస్తున్నాయి. జిల్లాలోని 729 గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా సుమారు రూ.40కోట్ల వరకూ వాటి ఖాతాల్లో ఉండిపోయాయి. ఇటీవల వరకు జిల్లాలోని అనేక గ్రామాల్లో చేపట్టిన పలు రకాల పనులకు సంబంధించిన బిల్లులు రాకపోగా, అత్యవసర పనులు చేసేందుకు చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి కొనసాగింది. ప్రస్తుతం ఒక్కో పంచాయతీకి జనాభాను బట్టి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకూ జమయ్యాయి. వీటితో సత్వరమే పనులు చేపట్టేందుకు ఎక్కువ మంది సర్పంచ్‌లు సిద్ధమయ్యారు. కొంతమంది పాత బిల్లులు చేసుకునేందుకు చూస్తున్నారు. కొందరు అత్యవ సర సమయంలో పంచాయతీలకు అవసరమైన లైట్లు, బ్లీచింగ్ వంటివి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ బిల్లులను ఎం బుక్ చేయడం లేదు. మరోవైపు గతంలో చేసిన పనులకు కూడా ఇంజనీరింగ్ అధికారులు ఎంబుక్‌లు చేసేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం.
ఈసారి కూడా అంతేనా
గ్రామ పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మొత్తాన్ని ఈసారి కూడా విద్యుత్ చార్జీలకు చెల్లించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో గత ప్రభుత్వంలోని పరిస్థితి పునరావృతం అవుతుందేమోనన్న అనుమానాలు పాలకవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని అనేక గ్రామపంచాయతీల్లో నిధులు లేక పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో వారికి కూడా ఆర్థిక సంఘం నిధుల ద్వారా జీతాలు చెల్లిస్తే ఇక పంచాయతీల్లో నిధులు ఉండవని పాలకవర్గాలు చెప్తున్నాయి. ఏదిఏమైనా పంచాయతీ నిధుల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇస్తేనే ఆ నిధుల వినియోగం ఎలాగన్నది తెలిసే అవకాశం ఉంటుంది.
Updated Date - Sep 10 , 2024 | 01:09 AM