కొత్త ప్రభుత్వానికి ‘పంచాయతీ’ సవాళ్లు!
ABN, Publish Date - Jul 25 , 2024 | 05:55 AM
గ్రామ ప్రాంతాల ప్రజల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం నిమిత్తం... మూడు అంచెల్లో అంటే గ్రామ పంచాయతి, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్‌లు ఏర్పాటయ్యాయి. గత ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసింది...
గ్రామ ప్రాంతాల ప్రజల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం నిమిత్తం... మూడు అంచెల్లో అంటే గ్రామ పంచాయతి, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్‌లు ఏర్పాటయ్యాయి. గత ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసింది. నిధులు, విధులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు గుర్తింపు లేక అవి ఉనికిని కోల్పోయాయి. అలా అని వీటిని పూర్తిగా విస్మరించడం కుదరదు. ఇవి రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్థలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో వీటి భాగస్వామ్యం అనివార్యం. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థను దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో ఉన్నట్లు వెల్లడించారు. అంటే ఆయన ముందుగా పంచాయతీ రాజ్ వ్యవస్థాగత నిర్మాణంలో ఉన్న మౌలిక సమస్యలను, పాలనా వ్యవస్థల్లో ఉన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దాలి.
గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసినా, జిల్లా ప్రజాపరిషత్‌ల పునర్విభజన చేపట్టలేదు. జిల్లాల పునర్విభజన అనేది ప్రాంతాల అభివృద్ధి, సుపరిపాలన కోసం అని ప్రకటించిన గత ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ప్రజాస్వామిక ప్రాతినిధ్య సంస్థలను నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. పైగా ప్రస్తుత జిల్లా ప్రజాపరిషత్‌లే వాటి పదవీకాలం (23 సెప్టెంబర్, 2026) పూర్తి అయ్యేవరకూ కొనసాగుతాయని ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ ఉత్తర్వులకు చట్టబద్ధతలేదు. కొత్తగా ఏర్పాటయిన జిల్లాల, ప్రస్తుత జిల్లా ప్రజాపరిషత్‌ల పరిధుల మధ్య పొంతన లేకపోవటంతో జిల్లా పాలనా వ్యవస్థల మధ్య గందరగోళం కొనసాగుతున్నది. దీంతో కొత్తగా ఏర్పడిన జిల్లాల జడ్పీటీసీ సభ్యులు వేరే జిల్లా ప్రజాపరిషత్ సమావేశాలలో పాల్గొనాల్సి వస్తోంది. ప్రస్తుత జిల్లా ప్రజాపరిషత్‌లకు కొత్త ప్రాంతాలు చేర్చడంతో వాటిల్లో కూడా ఇదే సమస్య ఉంది. ఇలా సంవత్సరాల తరబడి కొనసాగించటం అంటే కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రజాప్రాతినిధ్యాన్ని అపహాస్యం చేయడమే. పర్యవసానంగా ఒక జిల్లా ప్రజాపరిషత్ సమావేశానికి మూడు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొనాల్సి వస్తోంది. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక జిల్లా ప్రణాళికను... మూడు, నాలుగు జిల్లా ప్రజాపరిషత్‌లు ఆమోదించాల్సిన పరిస్థితి.
అలాగే జిల్లా నియామక యూనిట్‌గా కలిగిన ఉపాధ్యాయుల, జిల్లా ప్రజాపరిషత్‌ల సిబ్బంది నియామకాలు, బదిలీలు రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘించి చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం జిల్లాల పునర్విభజన మరోసారి చేపట్టే ఉద్దేశ్యంతో ఉన్నట్లు ప్రకటించినందున, జిల్లాల పునర్విభజనతోబాటు, జిల్లా ప్రజాపరిషత్‌ల పునర్విభజన కూడా చేపట్టాలి. కొత్త జిల్లాలకు జిల్లా ప్రజాపరిషత్‌లు ఏర్పాటు చేయడానికి రాజ్యాంగపరమైన అడ్డంకులు ఏమీలేవు. కేవలం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేస్తే సరిపోతుంది.
మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థల్లో ప్రస్తుత అధికార పార్టీల బలం నామమాత్రంగా ఉంది. పార్టీ ప్రాతిపదికగా ఎన్నికలు జరిగే జిల్లా ప్రజాపరిషత్‌లు, మండల ప్రజాపరిషత్‌లు అన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి. గ్రామపంచాయతీలకు పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు జరగవు. మారిన రాజకీయ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే కొత్త ప్రభుత్వానికి ప్రస్తుత సభ్యులు సహకరిస్తారనే ఆశించవచ్చు. కానీ వారిని సమన్వయం చెయ్యాల్సిన అవసరం ఉంది. అందుకు నిబద్ధత, సమర్ధత కలిగిన అధికారులను నియమించాలి.
రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పంచాయతీరాజ్ పాలనా వ్యవస్థల నిర్మాణమే ఒక గందరగోళం. ప్రభుత్వ స్థాయిలో మూడు, నాలుగు శాఖలు, శాఖాధిపతుల స్థాయిలో ఒక అరడజనుకి పైబడి శాఖాధిపతులు, ఇక జిల్లా ఆ క్రింది స్థాయికి వెళ్తే ప్రజాప్రతినిధులు, పంచాయితీరాజ్ అధికారులు, జిల్లా కలెక్టరుతో పాటు పది, పదిహేను శాఖల జిల్లా అధికారులు నిత్యం పరస్పర విరుద్ధమైన ఆదేశాలతో గందరగోళం సృష్టిస్తూ ఉంటారు. ఎవరి ఆదేశాలు పాటించాలో, అమలు చెయ్యాలో అర్థం కాక దిగువ స్థాయి అధికారులు, సిబ్బంది హైరానా పడుతుంటారు. ఏ పనికి ఎవరు బాధ్యులు, ఎవరికి ఎవరు జవాబుదారో స్పష్టత ఉండదు. ఏదైనా తప్పు జరిగితే సంబంధం లేని వారిని బలి చేస్తుంటారు.
రాష్ర్ట స్థాయిలో అధికారికంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఒకే శాఖ. ప్రభుత్వ స్థాయిలో కార్యదర్శి ఒక్కరే. కమిషనర్ ఒక్కరే. కానీ విచిత్రమేమిటంటే పై నుండి క్రింద దాకా అవి వేర్వేరు శాఖలుగా వ్యవహరిస్తాయి. నిబంధనల ప్రకారం లేని శాఖను ఉన్నట్లుగా చెలామణి చేస్తున్నారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖని పంచాయతీరాజ్‌లో అంతర్భాగంగా కొనసాగించడం లేదా ప్రత్యేక శాఖగా ఏర్పాటుచేయడం అత్యవసరం. వీటికితోడు కొత్తగా గ్రామ/వార్డ్ సచివాలయం, వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా ఒక శాఖను, కమిషనర్‌ను ఏర్పాటు చేయడంతో ఎవరి పరిధి ఏమిటో అర్థం కాదు. పంచాయతీరాజ్ వ్యవస్థకు గుండెకాయ పంచాయతీరాజ్ కమిషనరేట్. ఇది భ్రష్టుపట్టి ఉంది. ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బందికి క్షేత్రస్థాయి పరిస్థితుల మీద కనీస అవగాహన లేదు. చిన్న అవకాశం దొరికినా క్షేత్రస్థాయి సిబ్బందికి నరకం చూపిస్తారు. ఈ వ్యవస్థను సంస్కరించి ప్రాంతీయ కమిషనరేట్‌లు ఏర్పాటు చేయాలి.
ఇక జిల్లా స్థాయికి వస్తే పంచాయతీరాజ్ అధికార వ్యవస్థ రెండు విభాగాలుగా విడిపోయింది. ఒకటి అభివృద్ధి విభాగం– జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నియంత్రణలో, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. రెండవది నియంత్రణా విభాగం– జిల్లా కలెక్టర్ నియంత్రణలో జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, విస్తరణాధికారి, పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుంటారు. ఇవికాక రెండు ఇంజినీరింగ్ విభాగాలు– పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాలు. ఇక గ్రామీణాభివృద్ధి విభాగం పంచాయతీరాజ్ శాఖలో అంతర్భాగమైనా, ఎవ్వరితో సంబంధం లేనట్లుగా పనిచేస్తుంటుంది. ఈ సమాంతర పాలనా వ్యవస్థల్ని సంస్కరించి, సమన్వయంతో పనిచేసేలా మార్పులు చెయ్యాలి.
పంచాయతీరాజ్‌కు డివిజన్ స్థాయిలో ఏ రకమైన ప్రాతినిధ్య వ్యవస్థ లేదు. పంచాయతీ విభాగంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఉన్నారు. గ్రామ పంచాయతీల తనిఖీలు, పైవారి ఆదేశాలు క్రిందికి, క్రింది వారి నివేదికలు పైవారికి పంపించటం తప్ప ఈయనికి వేరే విధులేమీ లేవు. ఈ మధ్య ప్రభుత్వం, ఎంపీడీవోలకు పదోన్నతుల అవకాశాలు పెంచటం కోసం జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి హోదాతో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టును కొత్తగా సృష్టించింది. ఇది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కన్నా ఎక్కువ హోదా ఉన్న పోస్టు. ఈ పోస్టును, రెవెన్యూ డివిజనల్ అధికారుల మాదిరిగానే సాధారణ పరిపాలనా శాఖ క్రిందికి తెచ్చి నేరుగా జిల్లా కలెక్టరు పర్యవేక్షణలో ఉంచితే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత సమర్ధవంతంగా పర్యవేకించవచ్చు.
మండల ప్రజాపరిషత్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చాలా కీలకం. ప్రస్తుతం మండల ప్రజాపరిషత్‌లు వాటి ఉనికిని కోల్పోయాయి. మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టుకి అడ్డగోలుగా పదోన్నతులు ఇచ్చి జవసత్వాలు లేని వ్యవస్థగా తయారు చేశారు. ఈ పదోన్నతులు సమీక్షించి, కనీసం 50 శాతం తగ్గకుండా నేరుగా నియామకాలు చేపట్టాలి. గ్రామ స్థాయిలో జరిగిన మార్పుల కారణంగా ఒక్కో ఎంపీడీవో 500 నుంచి 1500 మంది ఉద్యోగుల పనితీరును నేరుగా పర్యవేక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పరుగులు పెట్టించాలి అంటే ఈ పోస్టులో యువ రక్తం ఎక్కించాలి.
గత ప్రభుత్వం గ్రామ పాలనా వ్యవస్థలో త్రిశంకుస్వర్గం సృష్టించింది. ఒక పక్క గ్రామ పంచాయతీలు, మరోపక్క గ్రామ సచివాలయాలు... ఈ రెండింటికీ అతీతంగా వాలంటీర్లు. పేరుకి సచివాలయం గ్రామ పంచాయతీ నియంత్రణలో ఉన్నట్లు పేర్కొన్నా, అవి అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే పనిచేశాయి. ఎంతో ఆర్భాటంగా నియమించిన సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ప్రకటించడానికి ప్రభుత్వం వారికి చుక్కలు చూపించింది. సచివాలయ సిబ్బంది కేడర్‌ను కనీసం జూనియర్ అసిస్టెంట్ స్థాయికి పెంచి వారి పదోన్నతులకు మార్గాలు అన్వేషించాలి. విధ్యాధికులైన, సమర్థులైన సచివాలయ సిబ్బందిని మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవాలి. అలాగే పైకి ఎంతో ఆదర్శంగా, ప్రజాసేవ కోసమే ఏర్పాటు జరిగింది అని చెప్పిన వాలంటీర్ వ్యవస్థను అధికార పార్టీ కార్యకర్తలతో నింపేశారు. ఈ వ్యవస్థపై కూడా ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేసి, తగు మార్పులు చేసి కొనసాగించాలి. అలాగే గ్రామ పంచాయతీకి సచివాలయానికి మధ్య సంబంధాలను స్పష్టంగా నిర్దేశించాలి.
పంచాయతీరాజ్ సంస్థలు రాజకీయ వ్యవస్థలు. గ్రామపంచాయతీలకు తప్ప, వీటి ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతున్నాయి. పార్లమెంటు, రాష్ర్ట శాసనసభ్యులు జిల్లా ప్రజాపరిషత్‌లలోనూ, మండల ప్రజాపరిషత్‌లలోను సభ్యులు. వీటి సమావేశాల్లో వారు పాల్గొనవచ్చు, తీర్మానాలపై ఓటు వేయవచ్చు. అందువలన ఇక్కడ తీసుకునే ప్రతీ నిర్ణయం, చర్య ఆఖరికి సిబ్బంది నియామకాలు, బదిలీలు, క్రమశిక్షణా చర్యలు కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్యలన్నీ లోతుగా అధ్యయనం చేసి, ఈ వ్యవస్థలు చక్కదిద్దుతారని ఆశిద్దాం.
పరదేశి కె. ఎరికిపాటి
విశ్రాంత పంచాయతీరాజ్ అధికారి
Updated Date - Jul 25 , 2024 | 08:08 AM