ఊరికో భూ బకాసురుడు
ABN, Publish Date - Aug 27 , 2024 | 04:53 AM
జగన్ ప్రభుత్వం దిగిపోయి వంద రోజులు కావస్తున్నా ఆయన హయాంలో వైసీపీ నేతలు చెలరేగి చేసిన అక్రమాలపై ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది.
ఫిర్యాదుల్లో 60 శాతం వైసీపీ కబ్జాలపైనే!
అలా చెలరేగి : ఏం చేసినా చెల్లుతుందనుకున్నారు. అధికారం అండ చూసుకుని చెలరేగిపోయారు. బెదిరించారు.. భయపెట్టారు.. భూములు కొల్లగొట్టారు. ప్రైవేటు స్థలాలేకాదు.. సర్కారు స్థిరాస్తులను కూడా వైసీపీ నాయకులు తెగబడి మరీ దోచుకున్నారు. ‘ఊరికో భూబకాసురుడు’ అవతరించి అక్రమాలకు పాల్పడ్డారు. జగన్ హయాంలో జరిగిన ఈ అక్రమాలు.. కుప్పలు తెప్పలుగా ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.
ఇలా చెరబట్టి : ఐదేళ్ల వైసీపీ పాలన ఊరికో భూ బకాసురుడిని సృష్టించింది. వైసీపీ నేతల భూ కబ్జాలపై ప్రస్తుతం ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పార్టీలు నిర్వహిస్తున్న వినతుల స్వీకరణలో వస్తున్న ఫిర్యాదుల్లో 60 శాతం.. భూముల ఆక్రమణ, కబ్జాలవే కావడం గమనార్హం. వీటికి రెవెన్యూ అధికారుల అవినీతి కూడా తోడైంది. వైసీపీతో అంటకాగి ప్రజల, ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టారు.
సర్వత్రా అదే గోడు
ఉమ్మడి చిత్తూరు జిల్లా, మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమైన సమయంలో అక్కడికి వెళ్లిన రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియాకు ఆ శాఖకు సంబంధించి ఐదారు వందలకుపైగానే ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన నివ్వెరపోయారు. ‘‘గత ఐదేళ్లలో ఏదో జరిగింది. అందుకే ఇంత భారీగా
ఫిర్యాదులు వస్తున్నాయి’’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
అధికారం అండ చూసుకుని చెలరేగిన వైసీపీ నాయకులు
బెదిరించి మరీ భూ దోపిడీ
ఐదేళ్ల జగన్ పరిపాలనలో భూ కబ్జాలపై జనం ఆక్రందన
అప్పట్లో భయంతో బిక్కుబిక్కు
ఇప్పుడు కూటమి సర్కారుకు ధైర్యంగా ఫిర్యాదుల పరంపర
పరిష్కారానికి సర్కారు సిద్ధం
సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ
ప్రజలకు ఊరటనిచ్చేలా నిర్ణయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ ప్రభుత్వం దిగిపోయి వంద రోజులు కావస్తున్నా ఆయన హయాంలో వైసీపీ నేతలు చెలరేగి చేసిన అక్రమాలపై ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా వైసీపీ నేతల అక్రమాలపైనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి అందుతున్న వినతులను రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక విభాగం సేకరించి వాటిని సంబంధిత జిల్లాలకు, అధికారులకు పంపుతోంది. ఈ విభాగం చేసిన విశ్లేషణ ప్రకారం ప్రజల నుంచి వస్తున్న వినతులు, ఫిర్యాదుల్లో 60 శాతం భూ సంబంధిత అంశాలపైనే ఉంటున్నాయి. వీటిలో అధిక శాతం భూ కబ్జాల ఫిర్యాదులే కావడం గమనార్హం. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ నేతలు భారీగా ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించుకున్నారని, అధికారులను అడ్డు పెట్టుకొని కబ్జాలకు పాల్పడ్డారని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. కాగా, ఉత్తరాంధ్రలో విశాఖ నగరం చుట్టుపక్కల ప్రాంతాలు, రాయలసీమలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి భూకబ్జా, ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.
2 నుంచి రెవెన్యూ సదస్సులు
రెవెన్యూ శాఖపై ఫిర్యాదులు అధికంగా ఉండటంతో వీటి పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు 2 నుంచి ఈ సదస్సులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వచ్చిన ఫిర్యాదులను అమరావతిలోని సచివాలయ విభాగం జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు పంపింది. అక్కడ నుంచి మండల కార్యాలయాలకు వాటిని పంపారు. గ్రామ రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్లు, మండల రెవెన్యూ అధికారులు ఏ సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరించాలో నిర్ణీత సమయం పేర్కొంటూ కలెక్టర్లు ఆదేశాలు పంపారు. ఆ సమయం దాటితే క్రమ శిక్షణ చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు. ‘‘మిగిలిన శాఖల పరిధిలో సమస్యలు త్వరగానే పరిష్కారం అవుతున్నాయి. రెవెన్యూ సమస్యలు కొంత క్లిష్టమైనవి కావడంతో ఎక్కువ సమయం పడుతోంది. అయినా వెంటపడుతున్నాం’’ అని సంబంధిత అధికారులు తెలిపారు.
ఫిర్యాదుల పరంపర ఇదీ..
. శ్మశాన స్ధలాలను కూడా వదిలి పెట్టడం లేదని, సమాధులను కూడా తొలగించి మరీ కబ్జా చేశారని మాచర్ల.. వడ్డెర సంఘం నేతలు వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు.
. ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరం చుట్టుపక్కల ఉన్న స్థలాలకు సంబంధించిన రికార్డులు మార్చేసి భూములు, స్థలాల ఆక్రమణకు పాల్పడ్డారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
. తిరుపతి నగరం చుట్టుపక్కల నుంచి కూడా ఇవే తరహా ఫిర్యాదులు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి.
. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరగణం ప్రభావం అధికంగా ఉన్న పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో కబ్జా రాయుళ్లు చెలరేగిపోతున్నారని ఫిర్యాదులు అందాయి.
. విశాఖ నగరం చుట్టుపక్కల జరిగిన కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులు ఇతర ఫిర్యాదుల కంటే ఎక్కువగా ఉన్నాయి.
. కబ్జాలకు తోడు రెవెన్యూ అధికారుల అవినీతి కూడా తారాస్థాయిలో ఉందని ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నారు.
. భూ వివాదాలు తలెత్తినప్పుడు ఎవరు డబ్బులి స్తే వారికి కొమ్ము కాయడం, సర్వేకు దరఖాస్తు చేసుకున్నా రాకపోవడం, రికార్డులను ఇష్టానుసారం మార్చివేయడం వంటి వాటిపై ఫిర్యాదు లు భారీగా వచ్చాయి.
. వైసీపీ హయాంలో నిర్వహించిన భూముల రీ సర్వేపై కూడా పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. రీ సర్వేలో రైతుల భూముల విస్తీర్ణాన్ని ఇష్టానుసారం మార్చివేశారని అన్నదాతలు తమ ఫిర్యాదుల్లో స్పష్టం చేశారు.
గొంతు విప్పితే గోడు!
రాజధాని అమరావతిలో మూడు చోట్ల ‘ప్రజాదర్బార్’ పేరుతో వినతులు స్వీకరిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం మినహా అన్ని రోజుల్లో ప్రజల నుం చి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ కా ర్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పా ల్గొంటున్నారు. దీంతో అన్ని వర్గాల వారు తమ గోడును నేరుగా వారికే వెళ్లబోసుకుంటున్నారు. మంత్రి నారా లోకేశ్ ప్రతి రోజూ ఉదయం ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించే ప్రజా దర్బార్‌కు కూడా ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలు చెప్పుకొంటున్నారు. సీఎం చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చినప్పు డు కూడా వందల సంఖ్యలో ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించారు. రెవెన్యూ కార్యదర్శి వంటి ఉన్నతాధికారులు జిల్లాలకు వెళ్లినప్పుడు కూడా ప్రజలు వినతులు సమర్పిస్తున్నారు.
Updated Date - Aug 27 , 2024 | 04:53 AM