Kakinada : ప్రాణం ఖరీదు.. 3 లక్షలు..!
ABN, Publish Date - Nov 28 , 2024 | 04:36 AM
అది కాకినాడ జిల్లాలోని జీజీహెచ్ ఆస్పత్రి.. నిష్ణాతులైన వైద్యులున్నారు.. కావాల్సినన్ని మౌలిక సదుపాయాలున్నాయి..
డయాలసిస్ రోగికి వేరొక గ్రూప్ రక్తం
కాకినాడ జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యం
మహిళ మృతి.. పరిహారం
జీజీహెచ్(కాకినాడ), నవంబరు 27(ఆంధ్రజ్యోతి): అది కాకినాడ జిల్లాలోని జీజీహెచ్ ఆస్పత్రి.. నిష్ణాతులైన వైద్యులున్నారు.. కావాల్సినన్ని మౌలిక సదుపాయాలున్నాయి.. కానీ ఇక్కడ ప్రాణం ఖరీదు కేవలం రూ.3 లక్షలు..! కొంతమంది వైద్యవిద్యార్థుల అవగాహనా రాహిత్యంతో నిర్లక్ష్యంగా ఒక గ్రూపునకు బదులు మరో గ్రూపు రక్తం ఎక్కించడం... ఒక మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. అయితే తప్పు తెలుసుకున్న అధికారులు ప్రభుత్వం ద్వారా సమకూర్చిన రూ.3లక్షల చెక్కును బాధిత కుటుంబానికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వలమారు గ్రామానికి చెందిన భావన శిరీష(34) గత నెల 14న అస్వస్థతకు గురికావడంతో కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు వెంటనే డయాలసిస్ చేయాలని కాకినాడ జీజీహెచ్‌కు రిఫ ర్ చేశారు. దీంతో ఆమెను ఈనెల 4న జీజీహెచ్‌లోని ఎం-5లో చేర్చారు. మంగళవారం ఆమెకు డయాలసిస్ చేశారు. అనంతరం ఆమెకు రక్తం ఎక్కించారు.
కొద్దిసేపటికే ఆమె బిగుసుకుపోతుండడంతో ఆమె తల్లి వైద్యసిబ్బందికి తెలిపింది. దీంతో వైద్యవిద్యార్థులు తాము ఎక్కించింది రోగికి అవసరమైన ఓ పాజిటివ్ కాదని, ఏబీ పాజిటివ్ అని గ్రహించారు. శిరీష ఆరోగ్యం క్షీణించి బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న ఆస్పత్రివర్గాలు ఆమె తల్లిని సముదాయించి బుధవారం ప్రభుత్వపరంగా సమకూర్చిన రూ.3 లక్షల చెక్కును ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ ఎన్.శ్రీధర్, సీఎ్‌సఆర్‌ఎంవో కె.అనిత సమక్షంలో సూపరింటెండెంట్ ఎస్.లావణ్యకుమారి అందజేశారు.
Updated Date - Nov 28 , 2024 | 04:38 AM