ఉన్నా లేనట్టే..!
ABN, Publish Date - Jul 15 , 2024 | 11:09 PM
ఉన్నా లేనట్టే..!
జిల్లాలో గాడి తప్పిన పాలన
పెరిగిన సైబర్ నేరాలతో నిత్యం ఫిర్యాదులే..
ఉనికి కోల్పోయిన క్రైమ్ పార్టీ, సీసీఎస్
పోలీసు శాఖలో పెచ్చుమీరిన అవినీతి
కర్నూలు నగరంలో వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య
కొత్త ఎస్పీ ఎదుట పెను సవాళ్లు
కర్నూలు, జూలై 15: జిల్లాలో పోలీసు శాఖ గాడి తప్పింది. శాంతిభద్రతల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పక్క రాష్ట్రాల మద్యం ఏరులైపారుతోంది. సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. స్టేషన్‌లన్నీ సివిల్ పంచాయితీలకు అడ్డాగా మారాయి. ఎంత మంది ఎస్పీలు మారినా నగరంలో ట్రాఫిక్ సమస్య మాత్రం తొలగడం లేదు. క్రైమ్ పార్టీ సిబ్బంది పోలీసులపై రాజకీయ నాయకులు స్వారీ చేస్తున్నారు. సీసీఎస్ పోలీసు వ్యవస్థ ఉందా అనే పరిస్థితి నెలకొంది. ఎస్పీకి కళ్లు, చెవులైన స్పెషల్ బ్రాంచ్‌లోని కొంత మంది సిబ్బంది అవినీతి పెచ్చుమీరిపోయింది. ఇలా ఎన్నో సమస్యలు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ బిందుమాధవ్ ఎదుట ప్రధాన సవాళ్లుగా నిలిచాయి. వీటిని నియంత్రించేందుకు కొత్త ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
నిత్యం సైబర్ క్రైమ్ ఫిర్యాదులే
జిల్లాలో సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోయాయి. కర్నూలు జిల్లాలో ఎక్కువ వెనుకబడిన ప్రాంతాలు పశ్చిమ పల్లెలే. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం తదితర నియోజకవర్గాల్లో నిరక్షరాస్యత ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రాంతాల ప్రజలు నిత్యం సైబర్ నేరస్థుల వలలో పడుతున్నారు. ప్రతి వారం స్పందనలో సైబర్ ఫిర్యాదులు వస్తున్నాయి. సైబర్ నేరాలను కనిపెట్టేందుకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్లు ఉన్నా రికవరీ మాత్రం అంతంతే. రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన ప్రోత్సాహం లేకపోవడం, ఖర్చుతో కూడుకున్న పని కావడంతో పోలీసులు కూడా వెనక్కు తగ్గుతున్నారు. ఉన్నత స్థాయిలో రెకమెండేషన్ ఉంటే తప్ప రికవరీ కావడం లేదు.
పోలీసు శాఖలో పెచ్చుమీరిన అవినీతి
జిల్లా పోలీస్ శాఖలో అవినీతి పెరిగిపోయింది. జిల్లా కేంద్రం మొదలుకొని మారుమూల పోలీస్‌స్టేషన్‌ల వరకు పలువురు సీఐలు, ఎస్‌ఐలపై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ నాయకులకు ముడుపులు సమర్పించి పోస్టింగ్‌లు తెచ్చుకుని అక్రమార్జనకు తెగబడుతున్నారు. మద్యం మామూళ్ల కేసుల్లో లంచాలు మొదలుకొని చోరీ సొత్తు దండుకొని దొంగలను వదిలే స్థాయికి దిగజారుతున్నారు. కొంత మంది పోలీసులు చోరీ కేసుల్లోని రికవరీ సొత్తును అమ్మేస్తున్నారు. గతంలో కర్నూలు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఇలాంటి ఘటన జరిగింది. అక్కడ పని చేసే సిబ్బంది 105 కేజీల వెండిని రహస్యంగా అమ్మేశారు. ఇక ఫ్యాక్షన్ జోన్ విభాగం, క్రైం పార్టీ, సీసీఎస్ పోలీసు విభాగాలు పూర్తిగా తమ ఉనికినే కోల్పోయాయి. క్రైం పార్టీ సిబ్బందిని కొంత మంది ఉన్నతాధికారులు తమ సొంత అవసరాలకు వాడుతుండటం వివాదాస్పదంగా మారింది. స్పెషల్ బ్రాంచ్ పని తీరు కూడా మందగించింది. ఈ విభాగంలో జిల్లాలో పని చేసే పలువురు సిబ్బందిపై ఆరోపణలు ఉన్నాయి. సంబందిత ఎస్‌ఎస్‌వోలను బెదిరించుకుని తమ పబ్బం గడుపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కర్నూలు, ఆదోనిలో ట్రా‘ఫికర్’
కర్నూలు, ఆదోనిలో ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. ఆటో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆకతాయిలు బైక్ విన్యాసాలు చేస్తూ తోటి వాహనచోదకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో అటు ఆర్‌అండ్‌బీ, ఇటు మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవడంలో పోలీసు శాఖ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కూడళ్లలో సీసీ కెమెరాలు ఉన్నా వాటిని ఉపయోగించుకుని ట్రాఫిక్ కంట్రోల్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు.
జిల్లా వ్యాప్తంగా మట్కా, పేకాట జోరుగా సాగుతోంది. గతంలో అధికార పార్టీ అండదండలతో మట్కారాయుళ్లు చెలరేగిపోయారు. ఈ మట్కా పల్లెలకు కూడా విస్తరించింది. మొబైల్ పేకాట విచ్చల విడిగా సాగుతోంది. ఆదోని ప్రాంతంలో పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు పట్టుబడినా గత ప్రభుత్వంలో అధికార పార్టీ అండదండలతో పెద్దగా చర్యలు ఏమీ కనిపించలేదు. కర్నూలులో నిత్యం పేకాట, మట్కా జరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అంతా ఆన్‌లైన్ కావడంతో పోలీసులు చేతులెత్తేయాల్సిన పరిస్థితి.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో నేటికీ ఫ్యాక్షన్ రక్కసి రాజ్యమేలుతోంది. పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లు, కోడుమూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలతోపాటు పత్తికొండలాంటి సమస్యాత్మక గ్రామాలపై ఎస్పీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామాలపై నిరంతరం నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
గత ఐదేళ్లలో దిశా పోలీస్‌స్టేషన్ అంతంత మాత్రంగానే పని చేసింది. అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశా పోలీస్‌స్టేషన్ ప్రారంభించినా పని తీరులో పెద్దగా మార్పు కనిపించలేదు. గతంలో ఉన్న మహిళా పోలీస్‌స్టేషన్ పేరు తీసేసి దిశా పోలీస్‌స్టేషన్‌గా మార్చారు. సమర్థత లేని అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వడం వల్ల ఈ పోలీసుస్టేషన్‌లో అవినీతి పెచ్చుమీరిపోయింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం దిశా పోలీస్‌స్టేషన్ పేరు మార్చి మహిళా పోలీస్‌స్టేషన్‌గానే కొనసాగిస్తోంది.
Updated Date - Jul 15 , 2024 | 11:09 PM