ముగిసిన సప్తరాత్రోత్సవాలు
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:47 PM
ముగిసిన సప్తరాత్రోత్సవాలు
సర్వ సమర్పణతో ముగింపు పలికిన పీఠాధిపతి
సప్త వాహనం రథోత్సవంపై దర్శనమిచ్చిన ప్రహ్లాదరాయలు
మంత్రాలయం, ఆగస్టు 24 : మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 353వ సప్తరాత్రోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పంచ వాహన రథానికి పూజలు చేసి ప్రారంభించారు. ఏడు రోజులు జరిగిన సప్తరాత్రోత్సవాలకు పీఠాధిపతి సర్వసమర్పణోత్సవంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. శనివారం ఉదయం నుంచి రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణ, మహామంగళహారతులు ఇచ్చారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను వజ్రాలతో పొదిగిన హారాలతో అలంకరించి స్వర్ణ పల్లకిలో అధిష్టించారు. అనంతరం ఊంజల సేవ చేశారు. ఆ తరువాత గజ వాహనం, చెక్క, వెండి, బంగారు, నవరత్నాల రథాలపై ఊరేగించారు. చక్క రథంపై అశ్వ, గజ, స్వర్ణ పల్లకి, మయూరి సప్త వాహనాలను సుందరంగా తీర్చిదిద్ది వాటి మధ్య రాఘవేంద్రస్వామి నిల్వ ప్రతిమను అలంకరించి అందులో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అధిష్టించి పీఠాధిపతులు మహామంగళ హారతులు ఇచ్చి పంచవాహన రథోత్సవాన్ని ఊరేగించారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని పంచ వాహన రథోత్సవాన్ని తిలకించి ఆనందపరవశులయ్యారు. పీఠాధిపతి పంచవాహన రథానికి సర్వసమర్పణోత్సవం చేసి మహామంగళహారతులు ఇచ్చి ముగింపు పలికారు. కార్యక్రమంలో బాలగర్ మఠం పీఠాధిపతి అక్షోభ్యరామ ప్రియ తీర్థులు , వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యా మనోహర్ తీర్థులు, విద్వాన్ రాజా ఎస్ గిరిరాజాచార్, మఠం దివాన్ సుజీంద్రాచార్, ఆనంద తీర్థాచార్, గౌతమాచార్, దక్షిణాది విచారణకర్త శ్రీమఠం సలహాదారు శ్రీనివాస్ కస్బే, ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ఏఈలు బద్రినాథ్, శ్రీహరి, వ్యాసరాజాచార్, బిందు మాధవ్, ద్వారపాలక అనంతస్వామి, జయతీర్థాచార్, వాధిరాజాచార్‌లు పాల్గొన్నారు.
అలరించిన కూచిపూడి నృత్యం
ఉత్సవాల ముగింపులో భాగంగా యోగీంద్ర కళా మండపంలో కర్నూలు చెందిన లాస్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ బృందం, హైదరాబాదుకు చెందిన శ్రీసాయి దేవా కూచిపూడి డ్యాన్స్ అకాడమీ వారిచే కూచిపూడి నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. హైదరాబాదుకు చెందిన వరవీణ మ్యూజిక్ అకాడమి వారిచే శాస్త్రీయ సంగీతం భక్తులను మంత్రముగ్థులను చేసింది. వీరి నృత్యాలను పీఠాధిపతి కనులారా తిలకించి నగదు, శేషవస్త్రం, ఫలపుష్ఫ మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.
Updated Date - Aug 24 , 2024 | 11:47 PM