నదిని తవ్వేశారు
ABN, Publish Date - May 17 , 2024 | 11:49 PM
తుంగభద్రను తవ్విపోస్తున్నారు. అధికారం మాటున నదిలోని ఇసుకను అడ్డంగా కాజేస్తున్నారు.
నిబంధనలు ‘తుంగ’లో కలిపేశారు
అక్రమ తవ్వకాలు నిజమే
అక్రమార్కులబారిన తుంగభద్ర
ప్రతిభ ఇన్ర్ఫాస్ట్రక్చర్ సంస్థకు నోటీసులు జారీ
మరో మూడు రీచ్‌లకు పర్యావరణ అనుమతుల కోసం ఫైల్
సుప్రీంకోర్టు ఆగ్రహంతో జిల్లాలో తాత్కాలికంగా ఆగిన ఇసుక తవ్వకాలు
పంచలింగాల వద్ద హైవే బిడ్జి కింద ఇసుక తవ్వకాలు
కర్నూలు, మే 17 (ఆంధ్రజ్యోతి): తుంగభద్రను తవ్విపోస్తున్నారు. అధికారం మాటున నదిలోని ఇసుకను అడ్డంగా కాజేస్తున్నారు. నిబంఽధనల పట్టింపు అసలే లేదు. తాజాగా ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే తీవ్ర తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా అక్రమార్కులు తీరు మారలేదు. అధికారబలం ముందు సుప్రీం కోర్టు తీర్పు ఏపాటి అని బరితెగిస్తున్నారు. కౌతాళం మండలం మరళి, గుడికంబాలి రీచ్‌లలో నిబంధనలకు విరుద్ధంగా 29 వేలు క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమంగా తవ్వినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రతిభ ఇన్ర్ఫాస్ట్రక్చర్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. అదే క్రమంలో మూడు కొత్త రీచ్‌లకు పర్యావరణ అనుమతుల (ఈసీ) కోసం నివేదిక పంపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు దృష్ట్యా ఇసుక తవ్వకాలు తాత్కాలికంగా ఆపేశారు.
తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాల కోసం కౌతాళం మండలం గుడికంబాలి-1,2,3, మరళి-1,2, నందవరం మండలం నాగులదిన్నె-1 ఓపన్ రీచులు, సి. బెళగల్ మండలం కొత్తకోట, కె. సింగవరం, పల్లెదొడ్డి, ముడుమాల, ఈర్లదిన్నె గ్రామాల వద్ద మరో నాలుగు డీసిల్టేషన్ రీచులను (నీటిలో బోటు ద్వారా ఇసుక తవ్వకాలు) గనులు భూగర్భ వనరుల శాఖ గుర్తించారు. ఇసుక తవ్వకాలు, రవాణా కోసం జేపీ పవర్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల లీజు అనుమతులు ఇచ్చింది. లీజు గడువు ముగిసినా ఆ సంస్థ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగించారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) గత జూన్‌లో ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు (ఈసీ)తో పాటు భారత ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) నుంచి ఎన్‌వోసీ లేకుండా రీచ్‌లలో ఇసుక తవ్వకాలు చేపట్టరాదని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం ప్రతిభ ఇన్ర్ఫాస్ట్రక్షర్ సంస్థ ఇసుక తవ్వకాలు చేస్తుంది. హైకోర్టు ఆదేశాల నేపఽథ్యంలో ఫిబ్రవరి నెలలో కలెక్టర్ సృజన ఆదేశాల మేరకు ఆదోని సబ్ కలెక్టరు నారాయణస్వామి నేతృత్వంతో కమిటీ ఆయా రీచ్‌లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు వస్తావమేనని ఆ కమిటీ నిగ్గు తేల్చినట్లు తెలిసింది.
అక్రమ తవ్వకాలు నిజమే
ఆదోని సబ్ కలెక్టరు శివనారాయణస్వామి, గనులు భూగర్భ వనరులు శాఖ (మైనింగ్) డీడీ రాజశేఖర్, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ, కౌతాళం మండలం తహసీల్దారు సహా సర్వే, రెవిన్యూ సిబ్బంది బృందం కౌతాళం మండలం గుడికంబాలి-3, మరళి-1,2 రీచ్‌లను ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. తుంగభద్ర నదిలో అనుమతి ఇచ్చిన రీచ్‌ల విస్తీర్ణం దాటి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు చేశారని గుర్తించారు. 29 వేల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక అక్రమంగా తవ్వినట్లు నిర్ధారించారు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా లీజ్ సంస్థ అయినా ప్రతిభ ఇన్ర్ఫాస్ట్రక్చర్ సంస్థకు నోటీసులు జారీ చేసినట్లు మైనింగ్ అధికారులు పేర్కొన్నారు. అయితే.. అధికారులు నిర్ధారించిన పరిమాణం కంటే రెండింతలు ఎక్కువగానే అక్రమంగా తవ్వేసినట్లు తెలుస్తోంది. నోటీసులు జారీ చేసి నెలలు గడుస్తున్నా.. లీజు సంస్థ నుంచి ఎలాంటి సమాధానం లేదని తెలుస్తున్నది.
కొత్తగా మూడు రీచ్‌లు:
కౌతాళం మండలంలో తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాల కోసం నదిచాగి వద్ద 10 హెక్టార్లు, గుడికంబాలి వద్ద 10 హెక్టార్లు, మరళి వద్ద 5 హెక్టార్ల విస్తీర్ణంలో మూడు కొత్త ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు పర్యావరణ అనుమతులు (ఈసీ) కోసం నివేదిక పంపినట్లు మైనింగ్ డీడీ రాజశేఖర్ తెలిపారు. ఆ గ్రామాల్లో పబ్లిక్ హియరింగ్ (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించాల్సి ఉందని వివరించారు. అయితే.. ఇప్పటి వరకు ఆయా రీచ్‌లు 5 హక్టార్ల విస్తీర్ణానికి మించి లేవు. అనుమతి విస్తీర్ణం దాటి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. దీన్ని నిరోధించాల్సిన అధికారులు రీచ్‌ల విస్తీర్ణం పెంచి ఈసీ అనుమతుల కోసం పంపడం విమర్శలకు తావిస్తోంది.
తాత్కాలికంగా ఆగిన తవ్వకాలు
ఎన్జీటీ తీర్పుకు విరుద్ధంగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, పలు ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు చేసినట్లు ప్రభుత్వ అధికారుల విచారణలో వెల్లడి అయ్యిందని సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. ఉల్లంఘనలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. కౌతాళం, సి. బెళగల్ మండలాల్లో తుంగభద్ర రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు, రవాణాను తాత్కాలికంగా ఆపేశారు. ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో..? అంటూ స్థానికులు పేర్కొంటున్నారు. అయితే.. రాజకీయ నాయకుల అండతో కౌతాళం మండలంలో రీచ్‌లకు దూరంగా అక్రమంగా తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
నేషనల్ హైవే బిడ్జి కింద ఇసుక తవ్వకాలు
కర్నూలు నగర శివారులో తుంగభద్ర నదిలో మునగాలపాడు, పంచలింగాల తదితర గ్రామాలకు చెందిన పలువురు ఇసుక తవ్వకాలు చేస్తూ ఎడ్లబండ, ట్రాక్టర్లు ద్వారా రవాణా చేస్తున్నారు. గ్రామం చెంతనే ఉన్న తంగభద్ర ఇసుక ఆధారంగా పలువురు జీవనం జీవనం సాగిస్తున్నారు. వారి వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదని, దీంతో చూసి చూడనట్లు వెళ్తున్నామని అధికారులు అంటున్నారు. అయితే.. హైదరాబాదు-బెంగళూరు వయా కర్నూలు జాతీయ రహదారి (ఎన్‌హెచ్)-44 తుంగభద్ర నది దాటేందుకు హైవే బిడ్జి నిర్మించారు. ఈ బిడ్జికి ఇరువైపు దాదాపు వంద మీటర్ల వరకు ఎలాంటి ఇసుక తవ్వకాలు చేయరాదని నేషనల్ హైవే అథారిటీ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు విరుద్ధంగా బడ్జి దిగువన, పిల్లర్లకు అతి సమీపంలో ఎడ్డబండ్లు, ట్రాక్టర్ల యజమానులు ఇసుక తవ్వకాలు చేస్తుండడం వల్ల బిడ్జికి ప్రమాదకరమని అంటున్నారు.
ఇసుక తవ్వకాలు ఆపేశాం
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు నేపధ్యంలో తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలు తాత్కాలికంగా ఆపేశాం. తదుపరి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు మేరకు ముందుకు వెళ్తాం. కౌతాళం మండలంలో రీచ్‌ల విస్తీర్ణం దాటి 29 వేల క్యూబిక్ మీటర్లు ఇసుక అక్రమంగా తవ్వినట్లు గుర్తించి లీజు సంస్థ ప్రతిభ ఇన్ర్ఫాస్ట్రక్చర్ సంస్థకు నోటీసులు జారీ చేశాం. నేషనల్ హైవే బిడ్జి దిగువన, అతి సమీపంలో ఇసుక తవ్వకాలు చేయరాదు. స్థానిక గ్రామస్థులలో అవగాహన కల్పిస్తాం. అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
- రాజశేఖర్, డీడీ, మైనింగ్ శాఖ, కర్నూలు
Updated Date - May 17 , 2024 | 11:49 PM