ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరలో కొత్త ఎక్సైజ్‌ పాలసీ

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:43 PM

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను రద్దు చేసి కొత్త ఎక్సైజ్‌ పాలసీ తీసుకురానున్నారు.

రద్దు కానున్న స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో

పాత పద్ధతిలోనే మద్యం అమ్మకాలకు శ్రీకారం

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ స్టేషన్లకు వెళ్లేందుకు అధికారుల తాపత్రయం

స్టేషన్‌ను బట్టి రూ.5 నుంచి15 లక్షల వరకు డిమాండ్‌

చెక్‌పోస్టులు, విజిలెన్స్‌ పోస్టులకు ఆసక్తి చూపని యువ అధికారులు

వైసీపీ సర్కారులో చక్రం తిప్పిన సీఐలకే ప్రజాప్రతినిధుల లేఖలు

కర్నూలు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను రద్దు చేసి కొత్త ఎక్సైజ్‌ పాలసీ తీసుకురానున్నారు. మద్యం అమ్మకాలు కూడా పాత పద్ధతిలోనే చేపట్టనున్నారు. గతంలో మాదిరిగా వేలం పాటల ద్వారా మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 28న మంత్రివర్గం ఆమోదం తరువాత పూర్తిగా పాత స్వరూపంలోకి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ రానుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లకు డిమాండ్‌ పెరిగింది. ఫలానా స్టేషన్‌లో పోస్టింగ్‌ ఇప్పించాలంటూ ఇప్పటికే కొందరు ఎక్సైజ్‌ సీఐలు ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి పైరవీలు చేస్తున్నారు. సిఫారసు లేఖలు ఇవ్వాలంటూ మద్యం అమ్మకాలను బట్టి ఒక్కో స్టేషన్‌కు ఒక్కో రేటు చొప్పున రూ.5 నుంచి15 లక్షల వరకు ఆఫర్‌ ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం చెక్‌పోస్టులు, స్క్వాడ్లు బలోపేతం చేయడా నికి చర్యలు తీసుకుంటున్నా.. యువ అధికారులు ఆసక్తి చూపడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన సీఐలకే కీలక స్టేషన్లలో పోస్టింగ్‌ కోసం కొందరు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 సెబ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఈ నెల 28 తరువాత నూతన ఎక్సైజ్‌ పాలసీ అమల్లోకి వస్తే ఇవి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్లుగా మారనున్నాయి. కర్నూలు జిల్లాలో 83 మద్యం దుకాణాలు, 28 బార్లు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో 93 మద్యం దుకాణాలు, 22 బార్లు ఉన్నాయి. ఆయా మద్యం షాపులు, బార్లు ద్వారా ఏడాదికి సగటున 1,721.50 కోట్ల విలువైన 26.24 లక్షలు ఐఎంఎఫ్‌ఎల్‌ (లిక్కరు), బీర్లు అమ్మకాలు జరుగుతున్నాయి. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్లను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) స్టేషన్లుగా మార్చింది. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టింది. జగన్‌ ప్రభుత్వంలో కొందరు మద్యం అమ్మకాల్లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు తెర తీశారనే అరోపణులు ఉన్నాయి. మద్యం రేట్లు భారీగా పెంచడమే కాకుండా గతంలో ఉన్న అంతర్జాతీయ బ్రాండ్లను కాదని ఎన్నడూ ఎరుగని వివిధ బ్రాండ్ల పేరిట అమ్మకాలు చేపట్టారు. మద్యం పాలసీ మార్చేసి జే బ్రాండ్ల స్థానంలో అంతర్జాతీయ గుర్తింపు కలిగిన బ్రాండ్ల మద్యం సరసరమైన ధరలకే అందుబాటులోకి తెస్తామని ఎన్నికల ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి స్పష్టమైన హామీ ఇచ్చింది. అందులో భాగంగానే గత జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన విఫల ప్రయోగానికి స్వస్తి చెప్పి.. పూర్తిగా పాత స్వరూపంలోని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖగా మార్చనున్నారు.

స్టేషన్‌.. స్టేషన్‌కు ఒక రేటు

మద్యం అమ్మకాలను బట్టి స్టేషన్‌.. స్టేషన్‌కు ఒక రేటు ఉందనే ఆరోపణులు బలంగా ఉన్నాయి. పోస్టింగ్‌ ఇప్పించేందుకు కొందరు మధ్య దళారీలు రూ.5 నుంచి రూ.15 లక్షలకు పైగా డిమాండ్‌ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి జిల్లాలో 2023-24లో మద్యం దుకాణాలు, బార్ల ద్వారా రూ.1,721.39 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్కో షాపులో ఏడాదికి రూ.3 నుంచి 15 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. పాత మద్యం పాలసీ అమల్లో ఉన్నప్పుడు లైసెన్సుదారులకు అమ్మకాలపై 18-20 శాతం వరకు మార్జిన్‌ (లాభం) ఇచ్చేవారు. రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాలు లీజుకు ఇస్తే.. ఒక ఏడాది ఆదాయం లైసెన్సు ఫీజు కింద పోయినా రెండో ఏడాది అమ్మకాలపై ఆదాయం వస్తుందని గతంలో మద్యం అమ్మకాలు అనుభవం ఉన్న లైసెన్సుదారులు పేర్కొంటున్నారు. అదే క్రమంలో మద్యం అమ్మకాలపై సంబంధిత ఎక్సైజ్‌ స్టేషన్‌కు నెల మామూళ్లు ఉంటాయని, అందుకే చెక్‌పోస్టులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ ఉద్యోగాలు వద్దని స్టేషన్ల పోస్టులు కావాలని పలువురు సీఐలు పెద్దఎత్తున పైరవీలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యేలు చెప్పినట్లు చక్రం తిప్పిన ఎక్సైజ్‌ సీఐలు కొందరు టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా వివిధ మార్గాల్లో ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటూ నియోజకవర్గాలు మారుతున్నారే తప్ప పెత్తనం వదులుకోవడం లేదని రాజకీయ పలుకుబడి లేని అధికారులు కొందరు వాపోతున్నారు.

వామ్మో.. చెక్‌పోస్టులా..?

జిల్లాలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో కర్నూలు రూరల్‌ మండలం పంచలింగాల, సుంకేసులు, నందవరం మండలం నాగులదిన్నె, మంత్రాలయం మాధవరం, కౌతాళం మండలం బాపురం, ఆదోని మండలం పెద్దహరివాణం, హొళగుంద మండలం మార్లమడికి, హాలహర్వి మండలం చత్రగుడి వద్ద ఎక్సైజ్‌ చెక్‌పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాక్స్‌ఫోర్స్‌ టీంలు సరేసరి. నూతన పాలసీ ప్రకారం చెక్‌పోస్టులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్క్వాడ్లను బలోపేతం చేసేలా ఎక్సైజ్‌ శాఖ పక్కా ప్రణాళిక రూపొందించింది. ఇక్కడ పని చేసేందుకు సీఐలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కోరుకున్న స్టేషన్‌ రాకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్‌, అక్కడ దొరకకపోతే చెక్‌పోస్టుతో సరిపెట్టుకుంటాం అంటున్నారు. మెజార్టీ యువ సీఐలు స్టేషన్లకు వెళ్లి.. పదవీ విమరణకు (రిటైర్డ్‌ స్టేజ్‌) దగ్గరలో ఉన్న సీఐలను చెక్‌పోస్టులో పోస్టింగ్‌ ఇస్తే నేరాలు అదుపు చేయడం కష్టమని, యువ సీఐలకు చెక్‌పోస్టు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్యూటీలు ఇస్తే నేరాలను సమర్థవంతంగా అదుపు చేయవచ్చని, రాజకీయ నాయకులు ఈ విషయం ఆలోచించాలని సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొనడం కొసమెరుపు.

సిఫారు లేఖల కోసం పైరవీలు

కర్నూలు జిల్లాలో 7, నంద్యాల జిల్లాలో 7 కలిపి 14 ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. 8 చెక్‌పోస్టులు ఉంటే ప్రతి చెక్‌పోస్టులో సీఐ పర్యవేక్షణలో తనిఖీ టీం పని చేస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీంలు 2, ఏసీ టాక్స్‌ఫోర్స్‌ టీంలు జిల్లాకు ఒకటి, జిల్లా టాక్స్‌ఫోర్స్‌ టీఎంలు ఒక్కోటి ఉంటాయి. ప్రతి టీంలో సీఐ, ఎస్‌ఐ సహా సిబ్బంది ఉంటారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ టీంలు, చెక్‌పోస్టుల్లో యువ అధికారులను నియమిస్తే నేరాలను సమర్థవంతంగా అరకట్టే అవకాశం ఉంది. మెజార్టీ యువ సీఐలు వాటిపై ఆసక్తి చూపడం లేదు. నెలనెలా ఆదాయం వచ్చే స్టేషన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలానా స్టేషన్‌లో తమకు పోస్టింగ్‌ ఇప్పించాలంటూ ఎక్సైజ్‌ సీఐలు కొందరు మధ్య దళారీలు ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు సీఐలు సిఫారసు లేఖలు కూడా తీసుకున్నట్లు సమాచారం.

ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు, 2023-24 మద్యం అమ్మకాల వివరాలు

వివరాలు కర్నూలు నంద్యాల మొత్తం

మద్యం దుకాణాలు 83 93 176

బార్లు 28 22 50

ఐఎంఎఫ్‌ఎల్‌, బీర్లు అమ్మకాలు 11.88 లక్షల కేసులు 14.36 లక్షల కేసులు 26.24 లక్షల కేసులు

మద్యం అమ్మకాలు విలువ రూ.772.03 కోట్లు రూ.949.46 కోట్లు రూ.1,721.39 కోట్లు

ప్రభుత్వ ఆదాయం (రెవిన్యూ) రూ.644 కోట్లు రూ.792 కోట్లు రూ.1,436 కోట్లు

Updated Date - Aug 24 , 2024 | 11:43 PM

Advertising
Advertising
<