వరించిన అదృష్టం
ABN, Publish Date - Jun 13 , 2024 | 12:01 AM
ఫరూక్ విధేయతకు పట్టం.. కష్టకాలంలో పార్టీని ఆదుకున్న బీసీకి అందలం.. యువతను ప్రోత్సహిస్తూ టీజీ భరత్‌కు సువర్ణావకాశం...
ఉమ్మడి జిల్లాకు మూడు మంత్రి పదవులు
మంత్రులుగా టీజీ భరత్, ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
విధేయతకు ఫరూక్ మారుపేరు
కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన బీసీ
యంగ్ మినిస్టర్‌గా టీజీ భరత్‌కు చాన్స్
కర్నూలు, నంద్యాల జిల్లాలపై సీఎం చంద్రబాబు మార్క్
ఫరూక్ విధేయతకు పట్టం.. కష్టకాలంలో పార్టీని ఆదుకున్న బీసీకి అందలం.. యువతను ప్రోత్సహిస్తూ టీజీ భరత్‌కు సువర్ణావకాశం... వెరసి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఏకంగా ముగ్గురికి మంత్రులుగా అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు మంత్రి పదవులు దక్కడంపై ఇటు పార్టీ వర్గాల్లో.. అటు ప్రజల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గ కూర్పులో సమన్యాయం పాటించిన సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. చరిత్రలో తిరుగులేని విజయాన్ని కట్టపెట్టిన కర్నూలు, నంద్యాల జిల్లాలపై చంద్రబాబు తనదైన మార్క్ చూపించారు. బుధవారం కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎంగా చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులుగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే ఎన్‌ఎండీ ఫరూక్, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ప్రమాణ స్వీకారం చేశారు.
కర్నూలు, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర మూడో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పట్టాభిషేకం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా విదేశ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరు కాగా.. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు హర్షధ్వానాల మధ్య రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కేసరపల్లి కేంద్రంగా సాగిన పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు వరించాయి. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, నంద్యాల ఎమ్మెల్యే ఎన్‌ఎండీ ఫరూక్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో టీజీ భరత్ యువకుడు. చంద్రబాబు కేబినెట్‌లో వీరికి కీలక శాఖలు దక్కే అవకాశం ఉంది. జిల్లాలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి రెండు పార్లమెంటు, 12 అసెంబ్లీ స్థానాల్లో అఖండ విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. చంద్రబాబు తన మంత్రివర్గంలో ముగ్గురికి అవకాశం ఇచ్చి జిల్లాపై తనకున్న మమకారాన్ని మరోసారి చాటుకున్నారు.
యువనేత భరత్‌కు సువర్ణావకాశం
సీఎం చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీజీ భరత్ టీడీపీ యువనేత, యువగళం పాదయాత్ర సారధి నారా లోకేశ్‌కు విధేయుడుగా ఉంటున్నారు. చంద్రబాబు కుటుంబానికి ఎంతో దగ్గరయ్యారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, టీజీవీ గ్రూప్స్ అధినేత, మాజీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్ వారసుడిగా 2014లో టీజీ భరత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కర్నూలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆనాడు ఒక్క చాన్స్ అనే గాలిలో స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. అయినా.. కుంగిపోకుండా ఓటమినే విజయానికి మెట్లుగా మలుచుకుని ముందడుగు వేశారు. కార్పొరేట్ ఆఫీసును వదిలి మౌర్యఇన్ హోటల్‌లో ప్రత్యేకంగా రాజకీయ (టీడీపీ) ఆఫీసును ఏర్పాటు చేసి ప్రజలకు 12 గంటలకు పైగా అందుబాటులో ఉంటూ వచ్చారు. రాజకీయ వ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు అమలు చేస్తూ ముందుకు సాగారు. టీడీపీ అధిష్ఠానం ఇచ్చిన కార్యక్రమాలు కాకుండా నియోజకవర్గానికి తాను ప్రత్యేక హామీలు ఇస్తూ ప్రజలతో మమేకమయ్యారు. యువనేత నారా లోకేశ్ పాదయాత్ర, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేపట్టిన సభలను సక్సెస్ చేశారు. ఇక్కడ ఓటమి తప్పదని ముందే గుర్తించిన వైసీపీ తమ అభ్యర్థిగా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను తప్పించి ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ చేత బలవంతంగా రాజీనామా చేయించి బరిలో దింపారు. ఇంతియాజ్ పై భరత్ 18,850 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. తొలి విజయంతోనే చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఐ టీజీ భరత్..
కర్నూలు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన టీజీ భరత్‌కు అధినేత చంద్రబాబు తన కేబినెట్‌లో స్థానం కల్పించారు. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఐ టీజీ భరత్.. (టీజీ భరత్ అను నేను) అంటూ ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు సహా మంత్రులు అందరూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తే టీజీ భరత్ ఒక్కడే ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేయడం కొసమెరుపు. అనంతరం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, గవర్నర్ నజీర్‌ల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి భరత్‌ను చంద్రబాబు పరిచయం చేశారు. అనంతరం టీజీ భరత్ వేదికపై ఆసీనులైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తదితరుల ఆశీస్సులు అందుకున్నారు.
టీజీ భరత్ ప్రొఫైల్
పేరు : టీజీ భరత్
పుట్టిన తేది : 1976, ఆగస్టు 5
విద్యార్హత : ఎంబీకే (యుకే)
స్వగ్రామం : కర్నూలు నగరం
వృత్తి : పారిశ్రామికవేత్త, రాయలసీమ ఐస్ర్టెంథ్
ఐపో లిమిటెడ్ కమిటీకి సీఎండీ
కుటుంబ నేపథ్యం:
తల్లిదండ్రులు - టీజీ వెంకటేశ్, టీజీ రాజ్యలక్ష్మి
భార్య - టీజీ శిల్ప
సోదరీమణులు - టీజీ జ్యోత్న్య, మౌర్య
కుమార్తె - టీజీ శ్రీఆర్య
కుమారుడు - టీజీ విభు
రాజకీయ నేపథ్యం: టీజీవీ గ్రూప్స్ జూనియర్ చైర్మన్‌గా, యువ పారిశ్రామికవేత్తగా, వ్యాపార రంగాల్లో టీజీ భరత్ చురుకైన పాత్ర పోషించారు. తండ్రి టీజీ వెంకటేశ్ వైఎస్సార్, కిరణ్‌కుమార్ రెడ్డి, రోశయ్య కేబినేట్‌లో మంత్రిగా పనిచేశారు. అనంతరం రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. తండ్రి టీజీ వెంకటేశ్ రాజకీయ వారసుడిగా 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన టీజీ భరత్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన టీజీ భరత్ ఆ రోజు నుంచే గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈ ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అభ్యర్థిగా కర్నూలు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. కర్నూలు జిల్లా నుంచి ఇప్పటి వరకు మంత్రులుగా పని చేసిన వారిలో అతి చిన్న వయస్కుడు టీజీ భరత్ కావడం కొసమెరుపు. రాజకీయాల్లో రాణిస్తూనే టీజీబీ యూత్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తమ కంపెనీల తరపున రూ.కోట్లు విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
బీసీ జనార్దన్‌రెడ్డి ప్రొఫైల్
పేరు : బీసీ జనార్దన్ రెడ్డి
పుట్టిన తేదీ : 1960 జూలై 5
స్వస్థలం : బనగానపల్లె మండలం
యనకండ్ల గ్రామం
తల్లిదండ్రులు : బీసీ గుర్రెడ్డి, బీసీ లక్ష్మీదేవి
భార్య : బీసీ ఇందిరమ్మ
పిల్లలు : బీసీ మనోహర్ రెడ్డి, మనోరమ, శ్రీలక్ష్మి
విద్యార్హత : బీఏ
సోదరుల పేర్లు : బీసీ బాలతిమ్మారెడ్డి, బీసీ రాజారెడ్డి,
బీసీ రామనాథరెడ్డి
రాజకీయ నేపథ్యం: బనగానపల్లెకు చెందిన బీసీ జనార్దన్‌రెడ్డి మొదట వ్యాపారవేత్త. స్థానిక నేత కాటసాని రామిరెడ్డి ఆగడాలకు చెక్ పెట్టేందుకు 2010లో రాజకీయ రంగప్రవేశం చేశారు. 2011లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో బనగానపల్లె టికెట్ దక్కించుకోవటమే కాకుండా, పోటీ చేసిన మొదటిసారే బలమైన ప్రత్యర్థి కాటసాని రామిరెడ్డిపై 17,341 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఈ ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బీసీ కావటం గమనార్హం. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీయడంతో అదే ప్రత్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారంగా చిరకాల ప్రత్యర్థి కాటసానిపై 25,566 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఎన్‌ఎండీ ఫరూక్ ప్రొఫైల్
పేరు : ఎన్‌ఎండీ ఫరూక్
పుట్టిన తేదీ : 1950 మే 15
స్వస్థలం : నంద్యాల
తల్లిదండ్రులు : జైతూన్‌బీ, నశ్యం ఇబ్రహీం సాహెబ్
భార్య : మహబూబ్ చాంద్
పిల్లలు : ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె.
పర్వేజ్, ఫయాజ్, ఫిరోజ్,
ఫాజిల్, ఖలీల్ నవాజ్
విద్యార్హత : పీయూసీ
రాజకీయ నేపథ్యం: ఎన్‌ఎండీ (నశ్యం మహమ్మద్) ఫరూక్ టీడీపీ సీనియర్ నేత. పార్టీకి వీర విధేయుడు. టీడీపీ ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు టీడీపీలోనే కొనసాగుతున్నారు. 1981లో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్ధానం ప్రారంభించి, నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 1985 ఎన్నికల్లో తొలిసారిగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎన్‌ఎండీ ఫరూక్‌కు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కేబినెట్‌లో చక్కర శాఖ మంత్రిగా స్థానం దక్కించుకున్నారు. అనంతరం 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన ఫరూక్ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా, రాష్ట్ర పురపాలక శాఖ, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పదవులను అలంకరించారు. 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2014లో నంద్యాల ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గవర్నర్ కోటాలో 2017లో ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవటమే కాకుండా, మండలి చైర్మన్ పదవి చేపట్టారు. ఇక 2018 నవంబర్‌లో మంత్రివర్గ విస్తరణలో ఫరూక్‌కు మరోసారి మంత్రి పదవి చేపట్టి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిపై 12,333 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో సీనియర్ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.
Updated Date - Jun 13 , 2024 | 12:01 AM