దేవరబెట్ట.. వెళ్లేదెట్టా....?
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:42 PM
భారీ వర్షానికి దేవరబెట్ట గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు కల్వర్టు తెగిపోయింది. దీంతో విద్యార్థులు, గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షానికి కొట్టుకుపోయిన కల్వర్టు రోడ్డు
రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
కోసిగి, ఆగస్టు 24: భారీ వర్షానికి దేవరబెట్ట గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు కల్వర్టు తెగిపోయింది. దీంతో విద్యార్థులు, గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం నుంచి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు సుమారు 50 మంది విద్యార్థులు జంపాపురంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, కోసిగిలోని మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వెళ్తున్నారు. కల్వర్టు తెగిపోయి మూడు రోజులు కావస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. దీంతో గ్రామానికి చెందిన యువకులు విద్యార్థులను కల్వర్టు దాటించి వెళ్తున్నారు. ఇక వాహనాలు, అంబులెన్సులు గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు. వైద్యం అత్యవసరమైతే తమ పరిస్థితి ఏమిటని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామానికి చెందిన యువకులు అనిల్ కుమార్, వీరేష్, భానుచంద్ర, అంజి తదితరులు కోరుతున్నారు.
Updated Date - Aug 24 , 2024 | 11:42 PM