‘తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం’
ABN, Publish Date - Aug 02 , 2024 | 12:27 AM
తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కవిత అన్నారు.
మహానంది, ఆగస్టు 1: తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కవిత అన్నారు. గురువారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మహానంది మండలం అబ్బీపురం గ్రామంలోని అంగన్‌వాడీ-2 కేంద్రంలో అంగన్‌వాడీ టీచర్ సావిత్రి ఆధ్వర్యంలో బాలింతలకు, గర్భిణులకు తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సూపర్‌వైజర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు 6 నెలల పాటు పిల్లలకు తల్లిపాలు సంపూర్ణ ఆరోగ్యం అని తెలిపారు. మండలంలో 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించన్నుట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దివ్య, అంగన్‌వాడీ టీచర్ చంద్రలీల పాల్గొన్నారు.
నంద్యాల (నూనెపల్లె): తల్లిపాలు శిశువుకు శ్రేయస్కరమని ఐఎంఏ నంద్యాలశాఖ అద్యక్షురాలు డాక్టర్ వసుధారాణి అన్నారు. ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలలోని రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో గురువారం సదస్సు ఏర్పాటు చేశారు. రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలనికి డాక్టర్ వసుధారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టడంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అవగాహన లోపాలతో శిశువులకు ముర్రుపాలు పట్టించడంలో తల్లులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ముర్రుపాలతో శిశువుకు వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సంవత్సరం వరకు తల్లులు పిల్లలకు పాలు పట్టాలని సూచించారు. దీని వల్ల తల్లులకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల మేనేజర్ ప్రగతి రెడ్డి, అధ్యాపక బృందం విద్యార్థినిలు పాల్గొన్నారు.
గోస్పాడు: శిశువు జన్మించినప్పుడే తల్లి ముర్రుపాలు ఇవ్వడం బిడ్డకు శ్రేయస్కరమని అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు అన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా గురువారం గోస్పాడులో తల్లిపాల వారోత్సవాల గోడ పత్రికలను విడుదల చేశారు. 7వ తేదీ వరకు ప్రతి అంగన్‌వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు జరగనున్నాయి. ఈ వారోత్సవాలలో పిల్లల పట్ల తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భిణులులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి వివరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మకూరురూరల్: తల్లి పాలలో ఉండే పోషక విలువలతో శిశు మరణాలు తగ్గించవచ్చని, శిశు మరణాల నియంత్రణలో తల్లి పాలే శ్రేష్టమని వైద్యాధికారి పవన్‌కుమార్ సూచించారు. గురువారం ప్రపంచ తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా తల్లి పాల ఆవశ్యకతపై బాపనంతాపురం గ్రామంల్లో తల్లులకు అవగాహన కల్పించారు. డాక్టర్ పవన్‌కుమార్ మాట్లాడుతూ..ప్రసవం జరిగిన వెంటనే తప్పనిసరిగా ముర్రుపాలను బిడ్డకు పట్టించాలని తద్వారా బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తల్లి పాలలో 400 రకాల పోషక విలువలు ఉంటాయని, ఆరు నెలల పాటు బిడ్డకు అమ్మపాలు తాగిస్తే తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యానికి కలిగే మేలు గురించి వివరించారు. ముర్రుపాలతో శిశువుకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. సీహెచ్‌వో ఫాతిమా, హెల్త్ సూపర్‌వైజర్ రమణమ్మ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
Updated Date - Aug 02 , 2024 | 12:27 AM