ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మేమేం తక్కువ?

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:44 PM

ఆదోనిలో మట్టి మాఫియా రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు అధికారులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో కొండలను పిండి చేస్తున్నారు.

ఎక్స్‌కవేటర్‌తో ఎర్రమట్టిని ట్రాక్టర్లలోకి నింపుతున్న దృశ్యం

ఇష్టారాజ్యంగా అధికార పార్టీ నాయకుల ఎర్రమట్టి తవ్వకాలు

ఆదోనిలో కరిగిపోతున్న కొండాపురం గుట్టలు

అక్రమంగా తరలిపోతున్న ఎర్రమట్టి

మామూళ్ల మత్తులో అధికారులు

కూటమి నేతలపై విమర్శల వెల్లువ

ఆదోని, సెప్టెంబరు 10 : ఆదోనిలో మట్టి మాఫియా రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు అధికారులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో కొండలను పిండి చేస్తున్నారు. ఆదోని కొండాపురం కొండల్లో, ప్రభుత్వ భూముల్లో మట్టి తరలించుకొనిపోయిన భారీ గుంతలు ఆనవాళ్లుగా కనిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కొండాపురం కొండల్లో ఉన్న ఎర్రమట్టిని విక్రయించి సొమ్ము చేసుకోగా, మేమేం తక్కువ అన్నట్లు.. ప్రస్తుత అధికార పార్టీ నాయకుల అండదండలతో కపటి గ్రామానికి చెందిన ఓ చోటా నాయకుడు ఎక్స్‌కవేటర్‌ను ఏర్పాటు చేసుకొని ఎర్రమట్టిని తవ్వి పట్టణానికి టిప్పర్లు, ట్రాక్టర్‌ల ద్వారా సరఫరా చేసి, సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ వ్యక్తి నుంచి ప్రతి నెల ఖర్చుల నిమిత్తం కూటమి నాయకుడికి రూ.2.60 లక్షల నగదు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. గతంలో వైసీపీ నాయకులు ఎర్రమట్టి తవ్వుకొని సొమ్ము చేసుకున్నారని, వాళ్లకంటే తాము ఏం తక్కువని ప్రస్తుత కూటమి నాయకులు అంటున్నారు.

ఆదోనిలో కొండలను గుల్ల చేస్తున్నారు. కొండలు, గుట్టలు కనుమరుగువుతున్నాయి. అక్రమార్కులు కొండలను కొల్లగొట్టడంతో పర్యావరణ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మట్టి దందాను అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ అండదండలతో అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా దందా కొనసాగిస్తున్నారు. ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక నాయకుడికి నెలకు రూ.2.60 లక్షలు ఇవ్వాల్సి ఉందని, దీనికి గాను ఎక్కడైనా తవ్వుకోవచ్చని చెప్పారనే మాటలు వింటుంటే గత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి తేడా ఏమిటనే ప్రశ్న తలెత్తుతోందని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కేవలం ఎర్రమట్టి మాత్రమే కాక ఇసుక, మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు కూడా అదోనిలో పంచుకు తింటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

అధికార పార్టీలో కీలకంగా ఉన్న ఓ నాయకురాలు ఆదేశాలతో ఆదోని మండలంలోని ఎస్‌ కొండాపురం గ్రామ పంచాయతీలోని కొండలు, గుట్టలను ఇష్టానుసారంగా తవ్వుకొని ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనివల్ల సహజ వనరులు అక్రమంగా తరలిపోవడమే కాకుండా, ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సిన సొమ్ము కూడా అందకుండా పోతోంది. అంతేకాకుండా ఆదోని చుట్టుపక్కల ఉన్న కొండలు, గుట్టలు ప్రాంతంలో ఎర్రమట్టిని కూడా అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. కొండాపురం కొండలను పిండి చేసినా, ఇంతవరకు అధికారులు పట్టించుకోకపోవడానికి కారణమమేటో అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడి ఆదేశాలు ఉండటంతోనే అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదని సమాచారం. ఎర్రమట్టి ఒక ట్రాక్టర్‌ దూరాన్ని రూ.1,000 నుంచి రూ.20,000 వరకు, అదే టిప్పర్‌ దూరాన్ని బట్టి రూ.3,000 నుండి రూ.5,000 వరకు విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజూ రూ.లక్షల్లో ఎర్రమట్టి అక్రమాలు జరుగుతున్నా, రెవెన్యూ, మైనింగ్‌, పోలీస్‌ ఽఅధికారులు ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం గమనర్హం.

వాల్టా చట్టానికి తూట్లు....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సహజ వనరులు తరలిపోకుండా ఉండేందుకు 2004లో తీసుకొచ్చిన వాల్టా (వాటర్‌, ల్యాండ్‌, ట్రీస్‌) చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ మాటలన్నీ కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం సొంత భూమిలో సైతం సహజ వనరులైన ఎర్రమట్టి తవ్వాలన్నా, నీటి కోసం బోర్లు వేయాలన్నా, సొంత పొలంలో ఉన్న చెట్టును తొలగించాలన్నా రెవెన్యూ, మైనింగ్‌, అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ రిసోర్స్‌ డిపార్ట్మెంట్‌ అధికారుల అనుమతులు తీసుకోవాలి. అక్రమ ధనార్జనకు అలవాటు పడిన కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది స్వార్థపరులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ సహజ వనరులను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు మాత్రం మామూళ్లు తీసుకొని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు స్థానికంగా ఉండే అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు లొంగి, చూసీచూడనట్లు వివరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

అప్పుడు వైసీపీ వాళ్లు తిన్నారు... ఇప్పుడు మేము తింటాం...

గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కొండలను పూర్తిగా తవ్వి అందిన కాడికి దోచుకున్నారని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో తాము ఎర్రమట్టి తరలించుకుంటే తప్పేమిటనే వాడన కూటమి పార్టీల నాయకుల నుంచి వినిపిస్తోంది. కావాలంటే డబ్బు ఇస్తాను.. నీవైనా తీసుకో.. మీ పేపర్‌కైనా యాడ్‌ వేసుకో అంటూ సెలవిచ్చారు.

ఈ విషయంపై తహసీల్దార్‌ శివరాముడును ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. ఎవరైనా ఎర్రమట్టిని తరలించినట్లు తెలిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. ప్రైవేట్‌ స్థలంలో ఎర్రమట్టిని తరలిస్తున్నారని సమాచారం తెలిస్తే కేసులు నమోదు చేస్తామని, ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని అన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:44 PM

Advertising
Advertising