ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గేట్లన్నీ మార్చాల్సిందే!

ABN, Publish Date - Sep 10 , 2024 | 12:05 AM

తుంగభద్ర ప్రాజెక్టుపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నియమించిన నిపుణుల కమిటీ కీలక అంశాలను తెరపైకి తెచ్చింది.

తుంగభద్ర డ్యాంను పరిశీలించిన నిపుణుల కమిటీ

ఏడు దశాబ్దాలుగా అవే గేట్లు

వాటి జీవితం కాలం 45 ఏళ్లు

ఇప్పటికే 25 ఏళ్లు అదనంగా వినియోగం

మరమ్మతులు చేస్తే జలాశయానికే ప్రమాదకరం

డ్యాం గేట్లు, గ్యాలరీ తనిఖీ

ప్రాజెక్టు నిర్వహణ ఇంజనీర్లతో భేటీ

తుంగభద్ర ప్రాజెక్టుపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నియమించిన నిపుణుల కమిటీ కీలక అంశాలను తెరపైకి తెచ్చింది. తుంగభద్ర డ్యాంకు సంబంధించి మొత్తం 33 గేట్లు మార్చాల్సిందేనని ఆ కమిటీ సూచించినట్లు సమాచారం. 70 సంవత్సరాలుగా అవే గేట్లను వినియోగిస్తున్నారు. నిజానికి డ్యాం గేట్ల జీవిత కాలం 45 సంవత్సరాలు. అయినప్పటికీ తుంగభద్ర డ్యాం గేట్లు మరో 25 సంవత్సరాలకు పైగా పొడిగించి వినియోగిస్తున్నారు. మళ్లీ వాటికి మరమ్మతులు చేస్తే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సేఫ్టీ కమిటీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ మూడు రాష్ట్రాల జీవనాడిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి ఉన్న 33 పాత గేట్లను పూర్తిగా తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేయాల్సిందేనని కమిటీ సూచించింది.

కర్నూలు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయం భద్రతపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నియమించిన నిపుణుల కమిటీ సోమవారం పరిశీలించింది. కేంద్ర జలసంఘం (సీడబ్లూసీ) మాజీ చైర్మన్‌ ఏకే బజాజ్‌, హైడ్రో మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ హర్కేష్‌ కుమార్‌, ఆదోనికి చెందిన తారాపురం సుధాకర్‌, ఆయా రాష్ట్రాల ప్రతినిధుల బృందం సభ్యులు డ్యాంను పరిశీలించారు. గత ఆగస్టు 10వ తేదీన చైన్‌ లింక్‌ తెగిపోయి కొట్టుకుపోయిన 19వ గేటు సహా డ్యాం 33 గేట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఢిల్లీకి చెందిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ సభ్యులు ఏకే బజాజ్‌, హర్కేష్‌ కుమార్‌, తారాపురం సుధాకర్‌లు ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి హోస్పేట్‌ దగ్గర ఉన్న టీబీ డ్యాంకు ఉదయం చేరుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు (టీబీపీ) సెక్రటరీ ఓ.రామకృష్ణారెడ్డి, ఎస్‌ఈ శ్రీకాంత్‌ రెడ్డి, డ్యాం పర్యవేక్షణ ఇంజనీర్లు వారికి స్వాగతం పలికారు. వీరితో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సెంట్రల్‌ డిజైనింగ్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) ప్రతినిధులు కూడా ఉన్నారు. ముందుగా డ్యాం వివరాలను బోర్డు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. గత నెలలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ నెంబరు గేటును పరిశీలించారు. 1 నుంచి 33 గేట్ల వరకు ప్రతి గేటును ఆపరేషన్‌ తీరు, చైన్స్‌, గేట్లను సమగ్రంగా పరిశీలించారు. అంతేగాకుండా ప్రాజెక్టు గర్భంలో ఉన్నటువంటి గ్యాలరీని నిపుణుల కమిటీపరిశీలించింది.

డ్యాం నిర్వహణ ఇంజనీర్లతో భేటీ

తుంగభద్ర డ్యాంను 1 నుంచి 16వ నెంబరు గేటు వరకు తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు నిర్వహణలో ఉంది. 17వ గేటు నుంచి కర్ణాటక జలవనరుల శాఖ ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారం భానికి ముందు వరదలు మొదలయ్యాక డ్యాం గేట్ల పనితీరును ఇంజనీర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. డ్యాం నిర్వహణ ఎలా జరుగుతుంది? ఈ ఏడాది నీటి సంవత్సరం ప్రారంభంలో వర్షాలు రాకముందు డ్యాంకు వరద మొదలయ్యాక గేట్లను తనిఖీ చేశారా? మరమ్మతులు నిర్వహించారా? ఆ సమయంలో ఎలాంటి లోపాలను ఏవైనా గుర్తించారా? గుర్తించి ఉంటే ఎలాంటి లోపాలు గమనించారు. తదితర అంశాలపై నిర్వహణ నిపుణుల కమిటీ ఇంజనీర్లతో సమావేశమై వివరాలు సేకరించారు. అంతేగాకుండా డ్యాం నిర్మాణం మొదలుకుని ఆ తర్వాత నిర్వహణ, ఇప్పటి వరకు డ్యాంను పరిశీలించిన నిపుణులు ఇచ్చిన నివేదికలు, ఇప్పటిదాకా చేపట్టిన మరమ్మతులు తదితర రికార్డులను కూడా పరిశీలించారు.

డ్యాం భద్రతపై సీడబ్ల్యూసీ దృష్టి

తుంగభద్ర డ్యాం భధ్రతపై కేంద్ర జలసంఘం దృష్టి సారించింది. అదే సమయంలో కొట్టుకుపోయిన 19వ నెంబరు గేటుతో పాటు 33 గేట్ల భద్రతపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేలా నిపుణుల కమిటీని నియమించాలంటూ తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఒ.రామకృష్ణా రెడ్డి నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీకి లేఖ రాశారు. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఏకే బజాజ్‌ నేతృత్వంలో హైడ్రో మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ సేఫ్టీ ఎక్స్‌ఫర్ట్స్‌ హర్కేష్‌ కుమార్‌, తారాపురం సుధాకర్‌లతో పాటు బోర్డులో భాగస్వామ్యమైన ఏపీ, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు సూచించిన ప్రతినిధులతో నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ డ్యాంను సమగ్రంగా పరిశీలించింది. ఏపీ నుంచి బోర్డు సభ్యుడు, సీఈ నాగరాజు, తెలంగాణ నుంచి ఈఈ బాలమురళీకృష్ణ, డ్యాం సేఫ్టీ రిటైర్డ్‌ ఎస్‌ఈ సుధాకర్‌, కర్ణాటక రిటైర్డ్‌ సెక్రటరీ సిద్ధగంగప్ప బృందంగా పర్యటించారు. ఆనకట్టపై ఉన్న షట్టర్లతో పాటు రాతి కట్టడాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు క్షుణ్ణంగా పరిశీలించారు. గైడ్‌ యాంగిల్‌, కౌంటర్‌ వెయిట్‌లను పరిశీలించిన అనంతరం రాతికట్టడాన్ని చూశారు. 70 ఏళ్ల క్రితం డ్యాం నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన క్రస్ట్‌ గేట్ల మందాన్ని అధ్యయనం చేశారు. నీటి అలల ఒత్తిడికి షట్టర్లు మందంలో తేడా వచ్చిందా (అరిగాయా..?) అని ఆరాతీశారు. మంగళవారం కూడా క్రస్టు గేట్లు, గ్యాలరీ, హైడ్రో మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ సిస్టమ్‌ను సమగ్రంగా పరిశీలిస్తారు.

తుంగభద్ర జలాశయానికి ఈ ఏడాది ముందుగానే వరదలు మొదలయ్యాయి. జూలై నెలలోనే గరిష్ఠ నీటి మట్టం 1,633 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలకు వరద చేరి, ఆ పైన లక్షల క్యూసెక్కుల వరద ఉండటంతో 33 గేట్లు ఎత్తి నదికి నీటిని విడుదల చేశారు. దాదాపు 200 టీఎంసీలు తుంగభద్ర డ్యాం నుంచి శ్రీశైలానికి వదిలారు. ఆగస్టు 10వ తేదీ నాటికి వరద తగ్గిపోవడంతో 1,633 అడుగుల లెవల్‌లో 105.788 టీఎంసీలు పూర్తి స్థాయి సామర్థ్యంలో ఎత్తిన గేట్లను డ్యాం ఇంజనీర్లు దించారు. ఆ సమయంలో 19వ నెంబరు గేటు చైన్‌లింక్‌ తెగిపోయి భారీ శబ్దంతో క్రస్టు గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. డ్యాం భద్రత దృష్ట్యా క్రస్ట్‌ లెవల్‌ 1,613 అడుగుల వరకు ఖాళీ చేయాల్సి వచ్చింది. అదే జరిగితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడేది. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్యాం భద్రత దృష్ట్యా క్రస్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్‌లను డ్యాంకు పంపించి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు ఆలోచనతో కన్నయ్య నాయుడు సారధ్యంలో స్టాఫ్‌లాగ్‌ ఎలిమెంట్స్‌ ఏర్పాటుకు కృషి చేశారు.

Updated Date - Sep 10 , 2024 | 12:05 AM

Advertising
Advertising