విజృంభిస్తున్న వైరల్ ఫీవర్
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:18 PM
జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. వాతావరణ మార్పులతో జ్వరాల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.
రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. వాతావరణ మార్పులతో జ్వరాల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, గ్రామాల్లో పారిశుధ్య లోపాలు మొదలైన కారణాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ప్రైవేటు హాస్పిటళ్లకు రోగులు పరుగులు తీస్తున్నారు. చాలా ఇండ్లలో చిన్నారుల నుంచి పెద్దల వరకు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, నొప్పులతో రోగులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా డయోగ్నస్టిక్ సెంటర్ల వద్ద రద్దీ పెరిగింది. వైరస్ కారణంగా జ్వరాలు వ్యాపిస్తున్నాయని గుర్తించినా వ్యాధికారక వైరస్ ఏమిటో తెలియడం లేదు.
కర్నూలు(హాస్పిటల్), సెప్టెంబరు 10: గతంలో వైరల్ జ్వరాలు మందులు వేసుకున్నా, లేకున్నా 3 నుంచి 4 రోజుల్లో తగ్గిపోయేవి. ప్రస్తుతం వస్తున్న వైరల్ జ్వరాలు ఏ మాత్రం తగ్గడం లేదు. 7 నుంచి 10 రోజులపాటు జ్వరం ఉంటున్నది. 104 డిగ్రీల జ్వరం వచ్చి ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బందిపడుతున్నారు. దీని వల్ల సీఆర్పీ (సీరియాక్టివ్ ప్రొటీన్) త్వరగా పెరుగుతుంది. జ్వరంతో పాటు ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పడిపోతుంది. డెంగీ కేసులు అనుమానితమైనవే అధికంగా ఉన్నాయి. వారం రోజులుగా కర్నూలు జీజీహెచ్‌లో 10 డెంగీ కేసులు ఉన్నాయి. లక్షల్లో ఉండాల్సిన ప్లేట్‌లెట్ల కౌంట్ల సంఖ్య వేలల్లో ఉంటుంది. చాలా మందికి రక్తంలో ప్లేట్‌లెట్లు తక్కువగా ఉన్నాయి. వెంటనే ఎక్కించాలని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రోగులకు దోపిడీ చేస్తున్నాయి. ఇక మురికివాడలా రోగులు ఆర్థిక భారంతో ప్రైవేటు ఆసుపత్రులకు ఎక్కువగా క్యూ కడుతున్నారు.
పరీక్షలు తప్పవా...?
వైరల్ జ్వరం వచ్చిన వారు తప్పనిసరిగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలను వైద్యులు తప్పనిసరిగా రాయిస్తున్నారు. ప్రైవేటు ల్యాబ్‌లో రోగులను దోపిడీ చేస్తున్నారు. దీంతో నిరుపేదలు వీటి కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. పీహెచ్‌సీలో ఈ పరీక్షలన్నీ సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ మంది ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రమాదకరంగా డెంగీ
జిల్లాలో డెంగీ కేసులు అధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 221 కేసులు నమోదు కాగా, ఇందులో కర్నూలు అర్బన్‌లో 65 డెంగీ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. శరీన్‌నగర్, వీకర్‌సెక్షన్ కాలనీ, బుధవారపేట, ముజఫర్‌నగర్ వంటి స్లమ్ ఏరియాలో డెంగీ అధికంగా ఉంది. ఇక కర్నూలు మండలంలో 16, దేవనకొండల 15, ఉలిందకొండలో 14, సి.బెళగల్‌లో 13, నందవరంలో 10, కల్లూరులో 7, ఆస్పరిలో రక్తపూతల పరీక్షలు 2.80 లక్షలు మంది నిర్వహించగా... 8 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.
వైరల్ ఫీవర్‌లే ఎక్కువ
కొద్ది రోజులుగా ఆసుపత్రికి వైరల్ ఫీవర్ కేసులు అధికంగా వస్తున్నాయి. వాతావరణంలో మార్పులు వర్షాల వల్ల జ్వరంతో పాటు జలుబు, కీళ్ల నొప్పుల లక్షణాలు ఉంటున్నాయి. కానీ వైరల్ ఫీవర్ పట్ల భయపడాల్సిన అవసరం లేదు. జ్వరం ఉన్న చాలా కేసులు అడ్మిట్ చేసుకోవడం లేదు. మంగళవారం మెడికల్ ఓపీకి 400 మంది రాగా ఇందులో 30 మంది అడ్మిట్ అయ్యారు. వీటిలో 20 కేసులు వైరల్ ఫీవర్ కేసులే ఉన్నాయి. రెండు రోజులకు మించి జ్వరం ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- డా. లక్ష్మీబాయి, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ కర్నూలు సర్వజన వైద్యశాల
నెల రోజులుగా బాధపడుతున్నా
జ్వరం, కాళ్ల నొప్పులు, వాపులతో ఉదయం మెడికల్ ఓపీకి వచ్చారు. నెల రోజులైనా కాళ్ల నొప్పులు, వాపులు తగ్గడం లేదు. ఇప్పటికే పెద్దాసుపత్రికి ఐదుసార్లు తిరిగాను. చికెన్ గున్యా అంటూ మందులు వాడినా తగ్గడం లేదు.
- బాలన్న, డోన్ మండలం కనపకుంట
జ్వరం తగ్గడం లేదు
నెల రోజుల నుంచి ఆసుపత్రికి తిరుగుతున్నా ఏ మాత్రం జ్వరం తగ్గడం లేదు. సరిగ్గా ఆకలి కావడం లేదు. ఇన్ని రోజులు ఎప్పుడూ జ్వరం ఉండలేదు. ఆసుపత్రిలో మందులు వేసుకున్నా అవి సరిగా పని చేయడం లేదు.
- ఫిరోజ్ ఖాన్, రోగి
Updated Date - Sep 10 , 2024 | 11:18 PM