ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

యెర్నేని సీతాదేవి కన్నుమూత

ABN, Publish Date - May 28 , 2024 | 12:45 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, పూర్వపు ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి (74) హైదరాబాద్‌లోని తన కుమార్తె హంసిని నివాసంలో సోమవారం వేకువజామున గుండెపోటుతో కన్ను మూశారు. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి రెండుపర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా ఆమె పనిచేశారు.

హైదరాబాద్‌లో సీతాదేవికి నివాళులర్పిస్తున్న సినీ నిర్మాత కేఎల్‌ నారాయణ, టీడీపీ నేతలు రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము

ముదినేపల్లి/కలిదిండి, మే 27 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, పూర్వపు ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి (74) హైదరాబాద్‌లోని తన కుమార్తె హంసిని నివాసంలో సోమవారం వేకువజామున గుండెపోటుతో కన్ను మూశారు. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి రెండుపర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా ఆమె పనిచేశారు. విజయ డెయిరీ డైరెక్టర్‌గా సీతాదేవి కొనసాగుతున్నారు. ఆమె భర్త, రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్‌ 2023లో అనారోగ్యంతో మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సీతాదేవి మరణ వార్తతో ఆమె స్వగ్రామమైన ప్రస్తుత ఏలూరు జిల్లా కలిదిండి మండలంలోని కొండూరులో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె పార్థివ దేహం సోమవారం రాత్రికి కొండూరు చేరనుంది. ప్రజలు, పార్టీశ్రేణుల సందర్శనార్థం మంగళవారం ఆమె పార్థివదేహాన్ని స్వగ్రామంలో ఉంచి బుధవారం అంత్యక్రియలు జరపనున్నారు. ఆమె మృతిపట్ల మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు తదితరులు సంతాపం తెలిపారు.

ముదినేపల్లి నుంచే రాజకీయ ప్రస్థానం

గుండెపోటుతో మరణించిన యెర్నేని సీతాదేవికి ముదినేపల్లితో విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె రాజకీయ ప్రస్థానం ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది. ఆమె పుట్టినిల్లు ముదినేపల్లి మండలం గురజ గ్రామం కావడంతో సీతాదేవికి ఈ ప్రాంతంతోనే ఎక్కువ అనుబంధం ఏర్పడింది. కలిదిండి మండలం కొండూరు గ్రామంలో నివసిస్తున్నప్పటికీ ఆమెకు ముదినేపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులతోనే రాజకీయ సంబంఽధాలు ఉండేవి. ఉన్నత విద్యావంతురాలైన సీతాదేవికి సమీపబంధువైన రైతాంగ సమాఖ్య నాయకుడు యెర్నేని నాగేంద్రనాథ్‌తో వివాహం జరిగింది.

ఎన్టీఆర్‌ పిలుపుతో..

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్‌ పిలుపు మేరకు, అప్పటికే కాంగ్రెస్‌ వ్యతిరేక వాదంతో ఉన్న సీతాదేవి భర్త నాగేంద్రనాథ్‌ ప్రోద్బలంతో సీతాదేవి రాజకీయ అరంగేట్రం చేసి టీడీపీలో చేరి ముదినేపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో తొలి మహిళా నేతగా కాలు మోపారు. సీనియర్‌ రాజకీయవేత్త పిన్నమనేని కోటేశ్వరరావు హవా నడుస్తున్న ఆ నియోజకవర్గంలో సీతాదేవి టీడీపీకి ఒక వర్గాన్ని ఏర్పాటు చేయగలిగారు. తొలిసారిగా 1983లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చవి చూసినా 1985 ఎన్నికల్లో విజయం సాధించారు. 1988లో ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా స్థానం సాధించారు. 1994 ఎన్నికల్లో తిరిగి గెలిచి 1999, 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో ముదినేపల్లి నియోజకవర్గం రద్దు కావడంతో ఆమెకు తిరిగి పోటీ చేసే అవకాశం లేకుండాపోయింది. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు టీడీపీలో ఉన్న ఆమె 2013లో బీజేపీలో చేరారు. కొంతకాలం అనంతరం తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా మారారు. విజయ డెయిరీ డైరెక్టర్‌గా కొనసాగు తున్నారు. ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కైకలూరు, గుడివాడ నియోజక వర్గాల్లో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు.

అభివృద్ధిపై సీతాదేవి మార్క్‌

ముదినేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యురాలిగా, మంత్రిగా ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ముదినేపల్లిలో ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ భవనం నిర్మాణం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు, పోల్‌ రాజ్‌ డ్రైయిన్‌, కెనాల్స్‌పై వంతెనల నిర్మాణం, ముదినేపల్లి-ఏలూరు పాడు రోడ్డు విస్తరణ, మండల పరిషత్‌ ఇతర ప్రభుత్వం కార్యాలయాల భవనాల నిర్మాణం, ఎస్సీ బాలికల వసతిగృహం, భవనాల నిర్మాణం లాంటి పలు అభివృద్ధి పనులను ఆమె నిర్వహించారు.

యోధులతో పోటీ

రాజకీయ ప్రవేశం చేసిన అనతి కాలంలోనే వచ్చిన 1983 సార్వత్రిక ఎన్నికల్లో ముదినేపల్లి నియోజకవర్గం నుంచి సీతాదేవి తొలిసారిగా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, రాజకీయ యోధుడు పిన్నమనేని కోటేశ్వరరావుతో తలపడ్డారు. తొలి పోటీలో ఓడినా ధైర్యంగానే నిలబడ్డారు. 1985 ఎన్నికల్లో పిన్నమనేని పోటీ చేయకపోవటంతో ముదినేపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున మరో రాజకీయ యోధుడు కోనేరు రంగారావు పోటీ చేశారు. ఆయనపై పోటీ చేసి సీతాదేవి విజయం సాధించారు.

వెంకయ్య నాయుడు, చంద్రబాబు సంతాపం

యెర్నేని సీతాదేవి మృతి పట్ల మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురం దేశ్వరి, తదితరులు సంతాపం తెలిపారు. సీతాదేవి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. కాగా సోమవారం హైదరాబాద్‌లో వసంత సిటీలోని సీతాదేవి కుమార్తె హంసిని నివాసం వద్ద సీతాదేవి భౌతిక కాయాన్ని సినీ నిర్మాత డాక్టర్‌ కె.ఎల్‌.నారాయణ, తదితరులు సందర్శించి నివాళుర్పించారు.

పార్టీకి తీరని లోటు

- వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు

గుడివాడ : సీతాదేవి మృతి టీడీపీకి తీరని లోటని, పెద్ద దిక్కును కోల్పోవడం బాధాకరమని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావులు అన్నారు. సీతాదేవి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ బలోపేతానికి సీతాదేవి కృషి మరువలేనిదన్నారు.

యెర్నేని సీతాదేవి మృతి పట్ల మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ది గుడివాడ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ పిన్నమనేని బాబ్జీలు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి ఆమెచేసిన కృషి నేటితరానికి మార్గదర్శకమన్నారు.

ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి

- కృష్ణామిల్క్‌ చైర్మన్‌ చలసాని

చిట్టినగర్‌ : యూనియన్‌ పాలకవర్గ సభ్యురాలు, యెర్నేని సీతాదేవి మృతి తీరని లోటని కృష్ణామిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. సోమవారం ఒక ప్రకటనలో సీతాదేవి మృతికి యూనియన్‌ తరపున సంతాపం, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా యర్నేని సీతాదేవి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కృష్ణా మిల్క్‌ యూనియన్‌ పాడి రైతులు ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - May 28 , 2024 | 12:45 AM

Advertising
Advertising