టార్గెట్ ఎవరు..?
ABN, Publish Date - Apr 18 , 2024 | 01:21 AM
వారంతా రోజువారీ కూలీలు.. కూలి పనికి వెళ్తే గానీ పూట గడవని పరిస్థితి. తాముంటున్న కాలనీకి సమీపంలో ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారని తెలిసి ఆసక్తిగా చూడటానికి వెళ్లారు. వారిలో మైనర్ బాలురు కూడా ఉన్నారు. జనంతో పాటే వారూ జగన్‌ను చూసి ఇళ్లకు చేరుకున్నారు. అదే వారి పాలిట శాపమైంది. గుర్తుతెలియని వ్యక్తులు ముఖ్యమంత్రి జగన్‌పై రాయి విసిరారు. ఇప్పుడు ఆ నింద టీడీపీ నాయకులు, వడ్డెర కాలనీ వాసులే టార్గెట్‌గా కదులుతోంది. విచారణ పేరుతో నిన్నటికి నిన్న ఐదుగురు మైనర్లను తీసుకెళ్లిన పోలీసులు.. నేడు వేముల దుర్గారావు అనే టీడీపీ వడ్డెర సంఘం నాయకుడిని అదుపులోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. తమవారు ఎలా ఉన్నారోనని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు పడుతూనే ఉన్నారు.
వడ్డెర కాలనీవాసులా.. టీడీపీ నాయకులా..!
సీఎంపై రాయి దాడి ఘటనలో తెరవెనుక కుట్రలు
ఇప్పటికే పోలీసుల అదుపులో ఐదుగురు మైనర్లు
తాజాగా టీడీపీ వడ్డెర సంఘం నాయకుడు కూడా..
టీడీపీ వారిని ఇరికించేలా ప్రభుత్వ పెద్దల మంతనాలు
పోలీసులపై పెరిగిన ఒత్తిడి
వారంతా రోజువారీ కూలీలు.. కూలి పనికి వెళ్తే గానీ పూట గడవని పరిస్థితి. తాముంటున్న కాలనీకి సమీపంలో ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారని తెలిసి ఆసక్తిగా చూడటానికి వెళ్లారు. వారిలో మైనర్ బాలురు కూడా ఉన్నారు. జనంతో పాటే వారూ జగన్‌ను చూసి ఇళ్లకు చేరుకున్నారు. అదే వారి పాలిట శాపమైంది. గుర్తుతెలియని వ్యక్తులు ముఖ్యమంత్రి జగన్‌పై రాయి విసిరారు. ఇప్పుడు ఆ నింద టీడీపీ నాయకులు, వడ్డెర కాలనీ వాసులే టార్గెట్‌గా కదులుతోంది. విచారణ పేరుతో నిన్నటికి నిన్న ఐదుగురు మైనర్లను తీసుకెళ్లిన పోలీసులు.. నేడు వేముల దుర్గారావు అనే టీడీపీ వడ్డెర సంఘం నాయకుడిని అదుపులోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. తమవారు ఎలా ఉన్నారోనని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు పడుతూనే ఉన్నారు.
విజయవాడ, ఆంధ్రజ్యోతి/అజిత్‌సింగ్‌నగర్, ఏప్రిల్ 17 : అనేక అనుమానాల మధ్య మలుపులు తిరుగుతున్న సీఎంపై రాయి దాడి ఘటనపై అధికార పార్టీ నేతలు ఆపసోపాలు పడుతున్నారు. టీడీపీ వారు చేసిన పనేనని తేల్చడానికి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఈ దిశగా ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం జగన్‌పై అజిత్‌సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ వద్ద ఈనెల 13వ తేదీన రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. బుధవారానికి ఈ ఘటన జరిగి నాలుగు రోజులైంది. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు దర్యాప్తులో టీడీపీని టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత వడ్డెర కాలనీ టార్గెట్‌గా పావులు కదులుతున్నాయి. రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రే పోలీసులు అజిత్‌సింగ్‌నగర్‌లోని వడ్డెర కాలనీపై పడ్డారు. విచారణ పేరుతో ఐదుగురు మైనర్ బాలురును తీసుకెళ్లారు. ఇంతవరకు వారు ఇళ్లకు చేరలేదు. ఈలోపే క్యాంటీన్‌లో టీ తాగడానికి వెళ్తున్న టీడీపీ వడ్డెర సంఘం నాయకుడు వేముల దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాలనీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నిత్యం కూలి పనులు చేసుకుని బతికే తమపై అంత పెద్ద నింద పడటంతో ఇటు దుర్గారావు కుటుంబం, అటు మైనర్ బాలుర కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇంత పెద్ద నింద కేసుల రూపంలో తమపై పడటం, పోలీసులు అదుపులోకి తీసుకున్నవారి ఆచూకీ చెప్పకపోవడంతో కాలనీవాసులు కంగారు పడుతున్నారు.
టార్గెట్ రివర్స్
సెంట్రల్ నియోజకవర్గంలో నాలుగైదు వడ్డెర కాలనీలున్నాయి. ఈ సామాజికవర్గం ఓటర్లు మొత్తం 10వేల మంది. డాబాకొట్లు సెంటర్‌కు సమీపాన ఉన్న ఈ కాలనీలో రెండు పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో దాని పరిధిలో సుమారు 1,000 ఓటర్లు ఉన్నారు. మొత్తం ఈ కాలనీలో 2వేల ఓటర్లు ఉన్నారు. ఈ సామాజికవర్గంలో 70 శాతం వైసీపీ వైపు ఉన్నవారే. 30 శాతం మాత్రమే టీడీపీ వైపు ఉన్నారు. ఇప్పటి వరకు వైసీపీ వైపు చూసిన వడ్డెరలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో షాకయ్యారు. ఉపాధి చిన్నదైనా, పెద్దదైనా చెమట చిందించుకుని కుటుంబాలను పోషించుకుంటున్న తమపై ‘రాయి’ టార్గెట్ ఏమిటని మదనపడుతున్నారు. టీడీపీని టార్గెట్ చేసుకుని కదుపుతున్న పావులు ఇప్పుడు వైసీపీకి రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలపై వడ్డెర సామాజికవర్గ పెద్దలు చర్చించుకుంటున్నారు. జెండా పట్టుకుని నిలబడితే రూ.200 ఇస్తామని చెప్పి తీసుకెళ్లిన నేతలు తిరిగి తమ బిడ్డలను కేసులో ఇరికించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన నాటి నుంచి వైసీపీ నేతలు మౌనం వహించడం ప్రస్తుతం వస్తున్న అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఒకరి తర్వాత ఒకరిని విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లడంతో ఆ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇంకెంతమందిని పోలీసులు తీసుకెళ్తారోనని మిగిలిన యువకులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎన్నికలకు ముందు ఏదో ఒక అస్త్రాన్ని బయటకు తీస్తున్న వైసీపీ ఈసారి ఎన్నికల్లో రాయిని ప్రయోగించిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి రాయి ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం సాయంత్రం వెల్లడిస్తారని లీకులు వచ్చాయి.
Updated Date - Apr 18 , 2024 | 01:21 AM