‘జలగ’ ఆక్రమణలపై కొరడా
ABN, Publish Date - Jul 30 , 2024 | 01:29 AM
అధికారాన్ని అడ్డంపెట్టుకొని వైసీపీ నాయకుడు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
1400 గజాల ప్రభుత్వ భూమి స్వాధీనం.. బోర్డుల ఏర్పాటు
అజిత్‌సింగ్‌నగర్, జూలై 29 : అధికారాన్ని అడ్డంపెట్టుకొని వైసీపీ నాయకుడు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోర్డులు ఏర్పాటు చేశారు. విద్యాధరపురం కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 69లో గల ఇరిగేషన్ స్థలాన్ని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అనుచరుడు ఆక్రమించుకొని మట్టితో చదును చేశాడు. ఈ ఉదంతాన్ని ‘బుడమేరును మింగేసిన జలగ’ శీర్షికతో ఆంధ్రజ్యోతి సోమవారం వెలుగులోకి తీసుకువచ్చింది. స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం వైవీరావు ఎస్టేట్ సమీపంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి వద్దకు చేరుకొని పరిశీలించారు. ఇరిగేషన్ ఏఈ రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ, కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగ అధికారులు రికార్డులు పరిశీలించి వాటి ప్రకారం కొలతలు వేసి ఆక్రమణకు గురైన సుమారు 1400 గజాల ఇరిగేషన్ భూమిని గుర్తించి స్వాధీనం చేసుకొని బోర్డులను ఏర్పాటు చేశారు.
నివ్వెరపోయిన అధికారులు
పాలఫ్యాక్టరీ వంతెన దిగి జక్కంపూడికి వచ్చే మెయిన్ రోడ్డు వెంబడి వైవీ రావు ఎస్టేట్ ప్రధాన గేటు వద్ద ఉన్న ఇరిగేషన్ భూమిని చూసి అన్ని విభాగాల అధికారులు నివ్వెరపోయారు. ఇంత కమర్షియల్ భూములు ప్రభుత్వానివా అంటూ నోరెళ్లబెట్టారు. ఇందులో గొల్లపూడి గ్రామ పంచాయతీకి సంబంధించిన కొంత భూమి ఉందని దాని సర్వే నెంబర్లను కూడా పరిశీలించిన తరువాత అసలు ఇక్కడ ఇరిగేషన్ భూమి మొత్తం ఎంత ఉందనేది తెలుస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వ భూమిలో బోర్డులు ఏర్పాటు చేసిన వారిలో ఇరిగేషన్ ఏఈ రాజశేఖర్, ఆర్‌ఐ శివప్రసాద్, సర్వేయర్ నాయక్ సిబ్బంది ఉన్నారు.
లీజుకు ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం
ప్రధాన రహదారి వెంబడి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఏవైనా కంపెనీలకు, చిరు వ్యాపారులకు లీజుకు ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుందని స్థానిక పెద్దలు చెబుతున్నారు. ఇలా వదిలేస్తే మళ్లీ ఈ భూములను కొత్త వ్యక్తులు ఆక్రమించుకునే ప్రమాదం ఉందని, ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
Updated Date - Jul 30 , 2024 | 01:29 AM