బుక్ బ్యాంకులెక్కడ..?
ABN, Publish Date - Jul 29 , 2024 | 01:21 AM
పాఠశాలల్లో బుక్ బ్యాంకులకు మంగళం పాడేశారు. గతంలో ఒక తరగతి నుంచి మరో తరగతి వెళ్లే విద్యార్థుల నుంచి పాత పాఠ్యపుస్తకాలు తీసుకుని భద్రపరిచేవారు. కొత్త పాఠ్యపుస్తకాలు ఆలస్యంగా చేరితే, పాత పుస్తకాలతో సిలబస్‌ను మొదలుపెట్టేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బుక్ బ్యాంకులు వద్దని చెప్పడంతో విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ విధానం మూలకు చేరింది.
పాఠశాలల్లో కనిపించని బుక్ బ్యాంకులు
పుస్తకాల సేకరణను పక్కన పెట్టేసిన ఉపాధ్యాయులు
ఒకప్పుడు భారీగా పాత పాఠ్యపుస్తకాల సేకరణ
వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిలుపుదల
మూలనపడిన ఉపయోగకరమైన విద్యావిధానం
పాఠశాలల్లో బుక్ బ్యాంకులకు మంగళం పాడేశారు. గతంలో ఒక తరగతి నుంచి మరో తరగతి వెళ్లే విద్యార్థుల నుంచి పాత పాఠ్యపుస్తకాలు తీసుకుని భద్రపరిచేవారు. కొత్త పాఠ్యపుస్తకాలు ఆలస్యంగా చేరితే, పాత పుస్తకాలతో సిలబస్‌ను మొదలుపెట్టేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బుక్ బ్యాంకులు వద్దని చెప్పడంతో విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ విధానం మూలకు చేరింది.
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఆరో తరగతి పూర్తిచేసి ఏడులోకి అడుగుపెట్టే విద్యార్థుల వద్ద ఉన్న పాత పాఠ్యపుస్తకాలను విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయులు సేకరించేవారు. అలాగే, ఏడు పూర్తిచేసి ఎనిమిదో తరగతిలోకి అడుగుపెట్టే విద్యార్థుల నుంచి కూడా పుస్తకాలు తీసుకునేవారు. 2022-23 విద్యా సంవత్సరం వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇలానే చేసేవారు. ఈ పాఠ్యపుస్తకాలను ఒక గదిలో భద్రపరిచేవారు. వాటిని బుక్ బ్యాంక్‌లుగా వ్యవహరించేవారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమై నెల దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో బుక్ బ్యాంక్‌ల మాట లేదు. వాస్తవానికి ఈ బుక్ బ్యాంక్‌ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం మంగళం పాడేసింది. విద్యార్థుల పాత పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవద్దని 2023-24 విద్యా సంవత్సరంలో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బుక్ బ్యాంక్‌ల జోలికి వెళ్లడం మానేశారు.
ఉపయోగమేంటి?
మొదటి, రెండో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలు ఉంటాయి. మూడు నుంచి ఐదో తరగతులకు తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఈవీఎస్ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/సైన్స్, సోషల్) పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ఆరు నుంచి పదో తరగతి వరకు ఆరు పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ప్రతి విద్యాసంవత్సరంలో ప్రభుత్వం ఈ పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు అందజేస్తుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచాక వారంలోపు పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయాల్సి ఉంటుంది. ఒక్కో ఏడాది పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యమవుతుంటుంది. కొన్నిసార్లు కొన్ని పాఠ్య పుస్తకాలే పాఠశాలలు తెరిచే సమయానికి వస్తుంటాయి. మిగిలిన వాటి కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ విద్యాసంవత్సరంలో మాత్రం దాదాపు అన్ని తరగతులకు పాఠ్యపుస్తకాలు పాఠశాలలు తెరిచే నాటికే అందాయి. కానీ, అన్ని విద్యా సంవత్సరాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేం. అటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పాత విద్యాబోధన చేయడానికే గతంలో ఇలా పుస్తకాలు సేకరించేవారు. కొత్త పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరుకునే లోగా పాతవి ఉపయోగపడేవి.
నష్టం లేదు కదా?
విద్యా ప్రణాళికలో పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాల మార్పు నిరంతరం కొనసాగుతోంది. కొత్త సిలబస్‌ను పరిచయం చేసినప్పుడు పాత పుస్తకాలతో పెద్దగా పని ఉండదు. కొత్త సిలబస్‌లో కొన్ని పాఠ్యాంశాలు మాత్రం పాత సిలబస్‌కు లింకై ఉంటుంది. ఈ నేపథ్యంలో పాఠ్యపుస్తకాలను రిఫరల్ బుక్స్‌గా అందుబాటులో పెట్టుకోవాలి. ఇలా చేయడానికి ప్రఽధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు పెద్దగా ఆసక్తిని చూపడం లేదని తెలుస్తోంది. బుక్ బ్యాంక్‌లను నిర్వహించడమే పాఠశాలలు ఒక భారంగా భావిస్తు న్నాయని కొంతమంది ఉపాధ్యాయులు బహిరంగంగా చెబుతు న్నారు. ప్రస్తుతం ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తర్వాత మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సిలబస్ ఈ పాఠ్యపుస్తకాల నుంచే ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు అవసరమైన పాఠ్యపుస్తకాల కోసం మార్కెట్లో తిరుగుతున్నా అందుబాటులో ఉండడం లేదు. విద్యార్థుల నుంచి పాత పాఠ్యపుస్తకాలను తీసుకుని బుక్ బ్యాంక్‌లను నిర్వహిస్తే ఇలా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉపయోగపడతాయన్న అభిప్రాయం విద్యావంతుల నుంచి వ్యక్తమవుతోంది.
Updated Date - Jul 29 , 2024 | 01:21 AM