ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ వీఆర్వోలు సెపరేటు..!

ABN, Publish Date - Aug 21 , 2024 | 01:04 AM

ఖరీదైన ఖద్దరు దుస్తులు వేసుకుంటారు కానీ, పేరొందిన రాజకీయ నాయకులు కాదు. జిగేలుమనే బంగారు ఆభరణాలతో మెరిసిపోతారు కానీ, బడా వ్యాపారవేత్తలు కాదు. అంతకుమించిన ఐ ఫోన్లు.. స్పోర్ట్స్‌ బైకులు ఉపయోగిస్తారు కానీ, సినిమా హీరోలు కూడా కాదు.

విజయవాడ, విజయవాడ రూరల్‌ మండలాలను ఏలుతున్న ‘ధనా’పాటీలు

ఆ డజను మంది వీఆర్వోల రూటే వేరు..!

18 ఏళ్లుగా కదలకుండా అడ్డగోలు దోపిడీ

రూ.కోట్లలో ఆస్తులు కూడగట్టి లగ్జరీ లైఫ్‌

వీఆర్వోలుగా, డాక్యుమెంట్‌ రైటర్లుగా, రియల్టర్లుగా త్రిపాత్రాభినయం

తహసీల్దార్లను డమ్మీలు చేసి చెలా‘మనీ..’

వైసీపీ ప్రభుత్వ హయాంలో పెచ్చుమీరిన అవినీతి

కొండలు, గుట్టల్లో అడ్డగోలు తవ్వకాలకు ఊతం

మైనింగ్‌ మాఫియాతో వాటాలు పంచుకుని వ్యాపారం

జోగి రమేశ్‌ భూ కబ్జాల్లో కీలకంగా ఓ వీఆర్వో

ప్రస్తుతం బదిలీల నుంచి బయటపడే యత్నాలు

ఖరీదైన ఖద్దరు దుస్తులు వేసుకుంటారు కానీ, పేరొందిన రాజకీయ నాయకులు కాదు. జిగేలుమనే బంగారు ఆభరణాలతో మెరిసిపోతారు కానీ, బడా వ్యాపారవేత్తలు కాదు. అంతకుమించిన ఐ ఫోన్లు.. స్పోర్ట్స్‌ బైకులు ఉపయోగిస్తారు కానీ, సినిమా హీరోలు కూడా కాదు. విలాసవంతమైన భవనాలు.. ఆధునిక అపార్టుమెంట్లలో రాచభోగాలు అనుభవిస్తారు కానీ మాఫియా డాన్లు కూడా కాదు. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. నమ్మడానికి కాస్త కష్టమైనా.. వీరంతా సాధారణ ప్రభుత్వ ఉద్యోగులైన వీఆర్వోలు. వీరి వేతనం నెలకు రూ.50 వేలే. వీరిని చూస్తే మాత్రం అస్సలు అలా కనిపించరు. విజయవాడ నగరం, విజయవాడ రూరల్‌ మండల పరిధిలో ఏళ్ల తరబడి తిష్టవేసి రెవెన్యూలో షాడో బాసులుగా చెలామణీ అవుతున్నారు. ప్రజలను జలగల మాదిరిగా పీల్చి పిప్పి చేస్తున్నారు. తహసీల్దార్లు, డీఆర్వోలు మొదలుకుని ఆర్‌డీవోల వరకూ, ఆఖరుకు ఏసీబీ అధికారులను సైతం బుట్టలో వేసుకుని పనులు చక్కబెడుతున్న ‘ధనా’పాటీలు వీరు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటంతో ఇక్కడి నుంచి కదలకుండా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : 14 లక్షల జనాభా కలిగిన విజయవాడ నగరంలో నాలుగు రెవెన్యూ మండలాలున్నాయి. నగరాన్ని ఆనుకుని శరవేగంగా విస్తరిస్తున్న మండలం విజయవాడ రూరల్‌. ఈ ఐదు మండలాల పరిధిలో పనిచేస్తున్న విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్ల (వీఆర్వో) రూటే వేరు. దాదాపు డజను మంది వీఆర్వోలు ‘షాడో’ బాస్‌ అవతారమెత్తారు. ఖద్దరు దుస్తులతో రాజకీయ నాయకులను, సెలబ్రెటీలను తలపించేలా, బంగారు ఆభరణాలు, ఐఫోన్లతో కనిపించే ఈ షాడో బాస్‌లు సొంత వృత్తి కంటే వ్యాపారాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు. తమ మండలాల పరిధిలో డాక్యుమెంట్‌ రైటర్ల అవతారమెత్తారు. సబ్‌ రిజిస్ర్టార్లతో సంబంధాలను కలిగి ఉండి భారీ ఎత్తున దండుకుంటున్నారు. వీఆర్వో ఉద్యోగాల కంటే డాక్యుమెంట్‌ రైటర్ల ఉద్యోగాలే ఎక్కువగా వెలగబెడుతున్నారు. అంతేకాదు.. రియల్టర్ల అవతారమెత్తి త్రిపాత్రాభినయం కూడా చేస్తున్నారు. వీఆర్వోలుగా తమకున్న అధికారాలను దుర్వినియోగపరిచే స్థాయికి దిగజారుతున్నారు. రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేసే స్థాయికి వెళ్తున్నారు. తప్పుడు రిపోర్టులు ఇచ్చే స్థాయికి దిగజారుతున్నారు. మాజీమంత్రి జోగి రమేశ్‌ అగ్రిగోల్డ్‌ భూముల కబ్జా వ్యవహారంలో ఒక వీఆర్వో తప్పుడు ఎండార్స్‌మెంటే కీలకపాత్ర పోషించింది. వీరిలో చాలామంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయటం కోసం విజయవాడ బైపాస్‌ వె ంబడి ఖరీదైన భూములు కొన్నారంటే ఏ స్థాయిలో చేతులు చాస్తున్నారో అర్థమవుతుంది.

తూతూమంత్రంగానే తహసీల్దార్లు

ఈ షాడోబాస్‌లు ఉన్న మండలాల్లో తహసీల్దార్ల పాత్రమీ ఉండదు. కొత్తగా వచ్చే తహసీల్దార్లకు స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో వీఆర్వోలపైనే ఆధారపడతారు. దీనిని ఆసరాగా చేసుకుని ఈ షాడోలు రూపాంతరం చెందుతున్నారు. తహసీల్దార్లకు తప్పుడు సమాచారాలు ఇవ్వటంతో పాటు డబ్బు ఆశచూపి వారిని లొంగదీసుకోవడం, ప్రతి పనికీ రేటు కట్టి తహసీల్దార్లకు ప్రయోజనం కల్పించడం చేస్తున్నారు. వీరిపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా చర్యలు మాత్రం శూన్యం. రాజకీయ నేతల దృష్టికి తీసుకెళ్లినా అదే పరిస్థితి.

వైసీపీ హయాంలో భారీ దోపిడీ

కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ రూరల్‌ మండల పరిధిలోని ఈ షాడో వీఆర్వోలు అడ్డగోలుగా అక్రమ మైనింగ్‌కు సహకరించారు. కొండలు, గుట్టలు, గట్లు, కాలువ గట్లు, చెరువులు, తోటలు తవ్వుకోవటానికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. అక్రమ మైనింగ్‌ వ్యాపారులను వాటాలు కూడా అడిగే రేంజ్‌కు వీరు చేరారు. మైనింగ్‌ మాఫియాను రక్షించేందుకు ఓ వీఆర్వో ఏకంగా వాట్సాప్‌ గ్రూపునే ఏర్పాటు చేశాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఉన్నతాధికారుల తనిఖీలు, ప్రజల ఫిర్యాదులు, ఆకస్మిక తనిఖీలు.. ఇలా సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా చేరవేసేవాడు. దీంతో మైనింగ్‌ మాఫియా అప్రమత్తమయ్యేది. విజయవాడ రూరల్‌ మండలంలో సాగిన మైనింగ్‌ మాఫియాపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆగ్రహించింది. వారి ఆదేశాల మేరకు అప్పటి సబ్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సమాచారాన్ని స్థానిక వీఆర్వోలు మాఫియాకు చేరవేశారు. అక్రమ మైనింగ్‌ తవ్వకాల వద్దకు సబ్‌ కలెక్టర్‌ చేరుకోకుండా ఉండటానికి ఏకంగా రోడ్డుకు గండి కొట్టించారు.

ధ్రువీకరణ పత్రాల్లో దండుడే..

నగర పరిధిలో ధ్రువీకరణ పత్రాల లావాదేవీలే ఎక్కువగా నడుస్తుంటాయి. ఈ పత్రాల జారీకి సంబంధించి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు (ఎఫ్‌ఎంసీ) సదరు వీఆర్వోలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టడం, దరఖాస్తుదారులను తమ చుట్టూ తిరిగేలా చేయటం, ఆ తర్వాత వారితో బేరాలకు దిగటం చేస్తున్నారు. నగరంలో పనిచేసే ఓ వీఆర్వో కమ్‌ డాక్యుమెంట్‌ రైటర్‌కు కామవాంఛ ఎక్కువ. గతంలో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, చివరికి రోడ్డున పడ్డాడు. ఈ ఉదంతం తర్వాత మళ్లీ అక్రమ సంపాదనకు తెరతీశాడు. విజయవాడ రూరల్‌ మండలంలో ముఖ్యమైన గ్రామంలోని ఓ వీఆర్వో ఏకంగా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం ముందే డాక్యుమెంట్‌ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. పశ్చిమ నియోజకవవర్గం దాటిన తర్వాత మేజర్‌ గ్రామ పంచాయతీలో వీఆర్వోగా పనిచేసిన వ్యక్తి ఇక్కడి భూములు ఖరీదైనవి కావటంతో రైతుల దరఖాస్తులకు కొర్రీలు వేస్తూ భారీగా అవినీతికి పాల్పడ్డాడు. విజయవాడ నగరంలోనూ, రూరల్‌ ప్రాంతంలోనూ తిష్ట వేసిన ఈ వీఆర్వోలు ఇక్కడి నుంచి పక్కకు కదలడానికి అస్సలు ఇష్టపడరు. ఇటు అటు మారి సర్దుకుంటారు తప్ప ఆ ప్రాంతాన్ని మాత్రం విడిచిపెట్టరు. వైసీపీ హయాంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డ ఇలాంటి వారిని సాగనంపకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముంది.

Updated Date - Aug 21 , 2024 | 07:03 AM

Advertising
Advertising
<