సమస్యల సంగమం
ABN, Publish Date - Jun 15 , 2024 | 12:55 AM
నాడు.. : చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణం.. అందమైన పచ్చటి ప్రకృతి సోయగం.. ఓవైపు కృష్ణమ్మ పరుగులు.. మరోవైపు గోదావరి ఉరుకులు.. నడుమ నదీ హారతులు.. పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రత్యేక ఘాట్లు.. ఆహ్లాదంగా గడిపేందుకు బోటింగ్ పాయింట్లు.. ఐదేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ప్రాంత పవిత్రత ఇదంతా. నేడు.. : నాచు పట్టి బురదగా మారిన నదీతీరం.. ఎండిపోయి వడిలిపోయిన పచ్చిక బయళ్లు.. కనుచూపు మేరలో కనిపించని కృష్ణమ్మ.. పూర్తిగా పక్కనపెట్టిన హారతులు.. తుప్పుపట్టిన బోట్లు.. కుంగిపోయిన రోడ్లు.. ఐదేళ్లలో పవిత్ర సంగమంలో వైసీపీ ప్రభుత్వ అపవిత్రత ఇదంతా..
గతంలో టీడీపీ హయాంలో వెలిగిన పర్యాటక ప్రాంతం
వైసీపీ వచ్చాక సర్వనాశనం
కృష్ణా, గోదావరి హారతులకు చెల్లు
పూర్తిగా ఎండిపోయిన నందనవనం
పనికిరాకుండా పోయిన స్నానఘాట్లు
కుంగిపోయిన నాలుగు వరుసల రోడ్డు
బోటింగ్ పాయింట్ కూడా బంద్
రావడమే మానేసిన పర్యాటకులు
టీడీపీ ప్రభుత్వ రాకతో మళ్లీ ఆశలు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కృష్ణ, గోదావరి నదులు సంగమించే ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి ఎగువ ప్రాంతాన్ని గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘పవిత్ర సంగమం’గా నామకరణం చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశారు. గత కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఇక్కడ రివర్ ఫ్రంట్ ఘాట్లను నిర్మించారు. వంపులు తిరుగుతూ చూడముచ్చటగా, పూలవనంలా వీటిని నిర్మించారు. ఈ ప్రాంతానికి చేరుకోవటానికి వీలుగా ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి ఎన్‌హెచ్-65కు అనుసంధానంగా కిలోమీటరున్నరకు పైగా నాలుగు వరుసల రోడ్డు నిర్మించారు. రోడ్డుకు రెండు వైపులా గ్రీనరీని అభివృద్ధి చేశారు. సెంట్రల్ డివైడర్‌పై గ్రీనరీ, ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఘాట్ల వెంబడి, సర్క్యులేటెడ్ ఏరియాలో హైమాస్ట్ ఎల్‌ఈడీ టవర్లను భారీగా ఏర్పాటు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు ఈ ప్రాంతం ఓ వెలుగు వెలిగింది. కృష్ణా పుష్కరాల సందర్భంలో ఇక్కడ కృష్ణా హారతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ హారతులు చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చేవారు. పర్యాటకుల కోసం బోటింగ్ పాయింట్‌ను కూడా భారీగా ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి విధ్వంసంతో పాటే పవిత్ర సంగమాన్ని కూడా నిర్వీర్యం చేశారు. నాలుగు వరుసల రోడ్డు బీటలు వారింది. గ్రీనరీ ఎండిపోయింది. ప్రస్తుతం ఈ రోడ్డును లారీలు నిలుపుకొనే పార్కింగ్ ఏరియాగా మారిపోయింది. పరిసర ప్రాంతాల్లోని వ్యర్థాలన్నింటినీ ఈ రోడ్డు వెంబడే డంప్ చేస్తున్నారు. ఘాట్‌లోని నందనవనం ఏనాడో ఎండిపోయింది. కృష్ణానదిలో రెయిలింగ్ కొట్టుకుపో యింది. బోటింగ్ నిలిచిపోయింది. ఘాట్లు అపరిశుభ్రమ య్యాయి. ఇప్పుడు మందుబాబులకు ఇదొక అడ్డా. అసాంఘిక కార్యక్రమాలకు వేదిక. తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సంగమానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది.
Updated Date - Jun 15 , 2024 | 12:55 AM