లైట్ మెట్రో పట్టాలెక్కేనా..?
ABN, Publish Date - Jun 14 , 2024 | 12:31 AM
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో విజయవాడ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. తుది డీపీఆర్ సిద్ధమైనా వైసీపీ ప్రభుత్వ సమీక్షకు నోచుకోకుండా నాలుగున్నరేళ్లుగా మూలనపడిన ఈ ఫైల్ త్వరలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇన్నాళ్లూ పెండింగ్ పెట్టిన వైసీపీ ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో విజయవాడ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. తుది డీపీఆర్ సిద్ధమైనా వైసీపీ ప్రభుత్వ సమీక్షకు నోచుకోకుండా నాలుగున్నరేళ్లుగా మూలనపడిన ఈ ఫైల్ త్వరలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల సమీక్ష సందర్భంగా లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు అంశం కూడా చర్చకు రావటంతో పాటు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో త్వరలో సమీక్ష కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. తాజా అంచనా వ్యయంతో సమగ్ర తుది డీపీఆర్‌ను కోరే అవకాశముంది.
తొక్కిపెట్టిన వైసీపీ
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్లోబల్ టెండర్లు పిలవగా, శిస్ర్టా అనే కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ తయారు చేసింది. దాదాపు రూ.25 వేల కోట్లతో నాలుగు దశల్లో దీన్ని పూర్తి చేయాలనుకున్నారు. నాలుగు కారిడార్లతో మొత్తం 90 కిలోమీటర్ల నిడివితో దీనిని ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడకు మెట్రో ప్రాజెక్టును ఇస్తామని ఎన్‌డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) ఏర్పాటు చేశారు. అప్పట్లో మీడియం మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేశారు. టెండర్ల దశకు వెళ్లే క్రమంలో కేంద్రం అనుమతులు ఇచ్చే విషయంలో పేచీలు పెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మీడియం మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకొంది. ఆ తర్వాత లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు దిశగా అడుగులు వేసింది. పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించి డీపీఆర్‌ను తయారు చేయటానికి ఆదేశాలిచ్చింది. అయితే, అప్పట్లో ఏకఛత్రాధిపత్యంగా ఎన్‌డీఏ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ మాట చెల్లలేదు. ప్రస్తుతం టీడీపీ కూటమి కేంద్రాన్ని శాసించే పరిస్థితి ఉండటంతో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు పునరుజ్జీవం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Updated Date - Jun 14 , 2024 | 12:31 AM