నేనిక్కడే ఉంటా!
ABN, Publish Date - Jul 31 , 2024 | 01:15 AM
సీసీఎల్‌ఏ నుంచి వచ్చే వారెవరైనా సరే.. క్షేత్ర స్థాయిలో రెండేళ్లు పనిచేసిన తర్వాత తిరిగి సీసీఎల్‌ఏకు వెళ్లిపోవాలి. ఓ అధికారి మాత్రం సీసీఎల్‌ఏకు రిపోర్టు చేయటం లేదు. సీటు వదలను పొమ్మంటున్నారు. ఇక్కడి నుంచి కదిలేదని మొండికేస్తున్నారు. ఆయనే.. ఎన్నికల ముందు తూర్పు గోదావరి జిల్లా నుంచి కృష్ణాజిల్లా గన్నవరం మండలం వచ్చిన తహసీల్దార్. ఆయన్ను రిలీవ్ చేసినా.. ఇక్కడి నుంచి కదలటం లేదు. మరో ఏడాది ఇక్కడే కొనసాగేందుకు ఎక్స్‌టెన్షన్ కోసం సీసీఎల్‌ఏకు దరఖాస్తు చేసుకునేందుకు
సీసీఎల్‌ఏ నుంచి వచ్చి రెండేళ్లయినా సొంతగూటికి వెళ్లని అధికారి
రెవెన్యూలో ఎక్స్‌టెన్షన్ రగడ
గన్నవరం తహసీల్దార్ మొండిపట్టు
సీసీఎల్‌ఏ నుంచి వచ్చిన ఆయనకు పొడిగింపు
ఏపీఆర్‌ఎస్‌ఏ దగ్గర తహసీల్దార్ల గగ్గోలు
రెగ్యులర్ తహసీల్దార్లకు అన్యాయం జరుగుతోందని పంచాయితీ
సీతానగరం, రాజానగరం, గన్నవరంలలో తహసీల్దార్‌గా విధులు
మరో ఏడాది కొనసాగేందుకు ప్రయత్నాలు
సీసీఎల్‌ఏ నుంచి వచ్చే వారెవరైనా సరే.. క్షేత్ర స్థాయిలో రెండేళ్లు పనిచేసిన తర్వాత తిరిగి సీసీఎల్‌ఏకు వెళ్లిపోవాలి. ఓ అధికారి మాత్రం సీసీఎల్‌ఏకు రిపోర్టు చేయటం లేదు. సీటు వదలను పొమ్మంటున్నారు. ఇక్కడి నుంచి కదిలేదని మొండికేస్తున్నారు. ఆయనే.. ఎన్నికల ముందు తూర్పు గోదావరి జిల్లా నుంచి కృష్ణాజిల్లా గన్నవరం మండలం వచ్చిన తహసీల్దార్. ఆయన్ను రిలీవ్ చేసినా.. ఇక్కడి నుంచి కదలటం లేదు. మరో ఏడాది ఇక్కడే కొనసాగేందుకు ఎక్స్‌టెన్షన్ కోసం సీసీఎల్‌ఏకు దరఖాస్తు చేసుకునేందుకు ఆయన సిద్ధమయ్యారని తమకు అన్యాయం జరుగుతోందని రెగ్యులర్ రెవెన్యూ తహసీల్దార్లు ఆందోళన బాట పట్టారు. ఏపీ రెవెన్యూ సర్వీసు అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) దగ్గర ఈ తహసీల్దార్ వ్యవహారాన్ని ఏకరువు పెడుతున్నారు. రెగ్యులర్ తహసీల్దార్లకు ఇబ్బందికరంగా మారే ఈ అంశాన్ని సీసీఎల్‌ఏ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఏపీఆర్‌ఎస్‌ఏ నాయకులు కూడా సిద్ధమౌతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గన్నవరం) : ప్రస్తుతం గన్నవరం మండలంలో పనిచేస్తున్న తహసీల్దారే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. ఆయన ఎన్నికల ముందు తూర్పు గోదావరి జిల్లాలో పనిచేసేవారు. ఎన్నికల బదిలీల కారణంగా ఆయన గన్నవరం మండలానికి వచ్చారు. ఇతర జిల్లాల నుంచి కృష్ణాజిల్లాకు వచ్చిన తహసీల్దార్లంతా వరుసగా రిలీవ్ అవుతున్నా గన్నవరం తహసీల్దార్ మాత్రం రిలీవ్ కాలేదు. సీసీఎల్‌ఏలో గతంలో పనిచేసిన ఈ అధికారి రెండేళ్లు బయట తహసీల్దార్‌గా పనిచేయాల్సి ఉండటంతో తూర్పు గోదావరి జిల్లా వచ్చారు. ఆ జిల్లాలోని సీతానగరంలో ఏడాది పాటు తహసీల్దార్‌గా పనిచేశారు. ఆ తర్వాత రాజానగరంలో ఏడాదిన్నరపైగా పనిచేశారు. రాజానగరంలో పనిచేస్తుండగానే ఆయన రెండేళ్ల పీరియడ్ ముగిసిపోయింది. కానీ సీసీఎల్‌ఏకు విజ్ఞప్తి చేసుకుని మరో ఏడాది గడువు పొందారు.
ఇతర రెవెన్యూ అధికారుల ఆందోళన
వాస్తవానికి గడువు పెంచకూడదు. నిబంధనలకు విరుద్ధంగా గడువు పెంచినా ఎన్నికల నేపథ్యంలో కృష్ణాజిల్లా గన్నవరం మండలం వచ్చారు. గన్నవరం మండలంలో పనిచేసిన కాలంతో ఆయన మూడో ఏడాది కూడా పూర్తయింది. అదనంగా మరో ఏడాది సమయం తెచ్చుకున్న గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలో ఆయన మళ్లీ ఇక్కడే ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మిగిలిన తహసీల్దార్లు ఆరోపిస్తున్నారు. మూడేళ్లు కావటంతో ఆయన ఇక్కడి నుంచి సీసీఎల్‌ఏకు రిపోర్టు చేసి ఉంటే వివాదం అయ్యేది కాదు. ఇంకా తహసీల్దార్‌గా కొనసాగుతూ ఉండటంతో మిగిలిన రెగ్యులర్ తహసీల్దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీఎల్‌ఏ కూడా ఇటీవలే తక్షణం వచ్చి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇతర డిపార్ట్‌మెంట్ల నుంచి వచ్చి పాతుకుపోయిన వారితో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రెగ్యులర్ తహసీల్దార్లు గొడవ చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో కూడా ఇదే రకమైన ఆందోళన నెలకొంది. ఇతర డిపార్ట్‌మెంట్ల నుంచి వచ్చి ఆర్డీవోలుగా పనిచేస్తున్నవారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులన్నీ కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నాయని, తక్షణం వీటికి సంబంధించి ప్రభుత్వం ప్రక్షాళన చేయాల్సిందిగా రెవెన్యూ వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Updated Date - Jul 31 , 2024 | 07:55 AM