దసరా లక్ష్యంగా..
ABN, Publish Date - Jun 19 , 2024 | 01:27 AM
దుర్గగుడికి కొత్తశోభ తీసుకొచ్చే దిశగా నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలతో దేవస్థానం ప్రాభవం మసకబారుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం గుడిపై రాజకీయాలకు స్వస్తి పలికి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా కసరత్తు ప్రారంభించింది. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఇటీవల దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గగుడిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, నిధుల కొరత లేకుండా చూసే బాధ్యత తమదని హామీ ఇచ్చినట్టు తెలిసింది. దసరా నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
దుర్గగుడి అభివృద్ధిపై కొత్త సర్కార్ దృష్టి
అక్టోబరు మొదటి వారానికి పనుల పూర్తికి కసరత్తు
ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా
పనులు పరుగులు పెట్టించాలన్న మంత్రి ఆనం
నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ
ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్, అన్నదాన భవనం..
ఇతర పనులు దసరా నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక
గతంలో రెండుసార్లు శంకుస్థాపనలు చేసిన జగన్
నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్న పనులు
దుర్గగుడికి కొత్తశోభ తీసుకొచ్చే దిశగా నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలతో దేవస్థానం ప్రాభవం మసకబారుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం గుడిపై రాజకీయాలకు స్వస్తి పలికి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా కసరత్తు ప్రారంభించింది. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఇటీవల దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గగుడిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, నిధుల కొరత లేకుండా చూసే బాధ్యత తమదని హామీ ఇచ్చినట్టు తెలిసింది. దసరా నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పలుమార్లు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేసి హడావిడి చేశారే తప్ప పనులు శరవేగంగా సాగింది లేదు. 2021లో సీఎం హోదాలో జగన్ దుర్గగుడికి వచ్చి అభివృద్ధి పనులకు రూ.70 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కానీ పైసా విదిల్చింది లేదు. 2023 డిసెంబరులో మరోసారి దుర్గగుడికి వచ్చిన జగన్ ఎన్నికల సమయం కావడంతో పలు పనులకు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేశారు. అయితే నిధుల కొరతతో ఇవి నత్తనడక నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దుర్గగుడి అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. దాతలు సమకూర్చిన రూ.5 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టిన యాగశాల పనులు తుది దశలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనుల్లో అన్నప్రసాద భవనం, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, ప్రసాదం పోటు, పూజామండపాల పనులు ప్రారంభదశలో ఉన్నాయి.
ఒకేసారి 2వేల మందికి అన్నదానం
దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడికి భక్తులు పోటెత్తుతుంటారు. ప్రతిరోజూ లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఇటీవల కాలంలో దుర్గగుడికి భక్తుల సంఖ్య బాగా పెరిగింది. సగటున రోజుకి 40 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నప్రసాద భవనాన్ని భారీ ఎత్తున నిర్మాణం చేస్తున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో జీ ప్లస్1 భవనాన్ని నిర్మిస్తున్నారు. ఒకేసారి 2వేల మంది భోజనాలు చేసేలా ఈ భవన నిర్మాణం జరుగుతోంది. దీంతోపాటు రూ.27 కోట్లతో అమ్మవారి ప్రసాదం పోటును జీ ప్లస్ 4 భవనంగా నిర్మాణం చేస్తున్నారు. ప్రసాదం తయారీ, ప్యాకింగ్, విక్రయాలు అన్నీ ఈ భవనంలోనే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పూజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ప్రస్తుతం లక్ష కుంకుమార్చన, శ్రీ చక్ర అర్చన వంటి పూజలు ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నా వాటికి ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పూజా మండపాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.7 కోట్ల వ్యయంతో వీటిని నిర్మాణం చేస్తున్నారు. దీంతో ప్రత్యేక పూజలు చేసుకునే భక్తులకు వెసులుబాటు కలుగుతుంది.
భక్తుల రద్దీ నియంత్రణకు..
పెరుగుతున్న భక్తుల రద్దీ నియంత్రణకు దుర్గగుడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా కనకదుర్గనగర్ ప్రవేశ మార్గం నుంచి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో దసరా నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు రూ.75 లక్షలతో కనకదుర్గానగర్ నుంచి మహామండపం వరకు రాజమార్గం, కనకదుర్గానగర్ ప్రవేశం వద్ద రూ.70 లక్షలతో మహారాజద్వారం వంటి పనులు జరుగుతున్నాయి.
నూతన కేశఖండనశాల..
దుర్గగుడి చెంత ఉన్న వాటర్ ట్యాంకు స్థలంలో కొత్త కేశఖండనశాలను రూ.19 కోట్లతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే వాటర్ ట్యాంకు ఉన్న స్థలం 10 సెంట్లు వీఎంసీ ఆధీనంలో ఉంది. దుర్గగుడికి చెందిన స్థలం 13 సెంట్లతోపాటు ఈ 10 సెంట్ల స్థలాన్ని కలుపుకొని కేశనఖండనశాలను భక్తులకు సౌకర్యవంతంగా నిర్మాణం చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఐదంతస్థుల్లో కేశన ఖండనశాల నిర్మాణం చేపట్టాలన్నది అధికారుల ప్రతిపాదన.
కొండచరియలు జారిపడకుండా..
అమ్మవారు కొలువుదీరిన ఇంద్రకీలాద్రి కొండ నుంచి రాళ్లు జారి పడటం తరచూ జరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల భద్రత కోసం భద్రతాచర్యలను దుర్గగుడి అధికారులు చేపట్టారు. బెంగళూరు నుంచి రాక్ ఫాల్ మిటిగేషన్ బృందాన్ని తీసుకొచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేసి వారి సూచనల మేరకు ఇప్పటికే రూ.4.25 కోట్ల వ్యయంతో భద్రతా పనులు పూర్తి చేశారు.
పార్కింగ్ సమస్య పరిష్కరించేందుకు..
దుర్గగుడి చెంత భక్తులు తమ వాహనాలను ముఖ్యంగా కార్లను పార్కింగ్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కనకదుర్గనగర్ ప్రవేశం చెంత మల్టీలెవల్ కార్ పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. సుమారు రూ.33 కోట్లతో తయారు చేసిన ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే 400 కార్ల పార్కింగ్‌ను అతి తక్కువ స్థలంలో పార్కు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం ఈ విధానం జనసమ్మర్ధంగా ఉండే నగరాల్లో అమల్లో ఉంది.
దసరా నాటికి పూర్తి చేయడమే లక్ష్యం
దుర్గగుడిలో పలు అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచనలతో వీటిని అక్టోబరు నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. దసరాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నాం.
- కేఎస్ రామారావు, దుర్గగుడి ఈవో
Updated Date - Jun 19 , 2024 | 01:27 AM